నార్కట్‌పల్లి, నవంబర్ 5 : యాదవుల ఐక్యతకు నిండు నిదర్శనమే సదర్ సమ్మేళనమని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు చిరుమర్తి, బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. నార్కట్‌పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి సదర్ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంస్కృతీ సంప్రదాయాలను నేటి యువతకు అందించేందుకే సదర్ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ యాదవుల అభ్యున్నతే ధ్యేయంగా పని చేస్తున్నారని అనంతరం దున్నపోతు విన్యాసాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, శ్రీకృష్ణ యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
నల్లగొండలో..
రామగిరి : నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో శనివారం రాత్రి నిర్వహించిన సదర్ సమ్మేళనం విశేషంగా ఆకట్టుకున్నది. యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకు యాదవులు డోళ్లు, తాళాల చప్పుళ్లు, నృత్యాల నడుమ నల్లని బలిష్టమైన దున్నపోతులను ఊరేగిస్తూ కళాశాల ఆవరణలోకి తీసుకొచ్చారు. వాటిని చూసేందుకు జిల్లా కేంద్రంతోపాటు పరిసర ప్రాంతాల నుంచి యువత, ప్రజలు తరలిరావడంతో కళాశాల ఆవరణ మొత్తం సందడి నెలకొంది. ఉత్సాహంగా నిర్వహించిన కార్యక్రమంలో తొలుత శ్రీకృష్ణుడికి పూజలు చేశారు. కార్యక్రమానికి కోదాడ ఎమ్మెల్మే బొల్లం మల్లయ్యయాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించాలన్నారు. మేకల యాదయ్యయాదవ్ అధ్యక్షతన జరిగిన వేడుకల్లో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు, కౌన్సిలర్ పిల్లి రామరాజు, మాజీ ఎంపీపీ నారబోయిన భిక్షపతియాదవ్, యాదవ ప్రముఖులు పంకజ్‌యాదవ్, అల్లి వేణు, దూదిమెట్ల సత్తయ్య, బొబ్బలి గోపాలకృష్ణ, శ్రీశైలంయాదవ్ పాల్గొన్నారు.