నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి జిల్లాలో గతంలో ఒక సాధారణ ఎన్నికకు మరో సాధారణ ఎన్నికకు మధ్య ఏకంగా మూడు ఉప ఎన్నికలు వచ్చిన సందర్భం లేదు. 2018 డిసెంబర్లో జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో మొత్తం ఐదు ఉప ఎన్నికలు రాగా అందులో మూడు జిల్లాకు చెందినవే కావడం గమనార్హం. 2019 అక్టోబర్‌లో హుజూర్నగర్ ఉప ఎన్నిక జరిగింది. ఇక్కడ అప్పటి వరకు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎంపీగా గెలుపొంది ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఎక్కడ జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిపై భారీ మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. గతేడాది మేలో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక జరిగింది. అప్పటి ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య 2020 డిసెంబర్లో హఠాన్మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఇక్కడ జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కుమార్ కాంగెస్ పార్టీ సీనియర్ నేత కుందూరు జానారెడ్డిపై ఘన విజయం సాధించారు. టీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంది. తాజాగా మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరి ఆగస్టులో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నికల పోలింగ్ గురువారం జరిగింది. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బీజేపీ నుంచి రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి ప్రధాన పార్టీల అభ్యర్థులుగా బరిలో నిలిచారు. ఈ పోలింగ్ ట్రెండ్ అంతా టీఆర్ఎస్ వైపే కనిపించింది. ఉదయం నుంచి రాత్రి వరకు సాగిన పోలింగ్‌లో టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించినట్లు స్పష్టమైంది. సాయంత్రం 6గంటల నుంచి వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నింటిలోనూ టీఆర్ఎస్దే విజయమని స్పష్టమైంది. 10నుంచి 15శాతం ఓట్ల తేడాతో టీఆర్ఎస్ ఘన విజయం సాధించబోతుందని ఎక్కువ సర్వేల్లో తేలింది. ఈ నెల 6న కౌంటింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ కౌంటింగ్‌లో టీఆర్ఎస్ విజయం లాంఛనమేనన్న చర్చ సర్వత్రా నెలకొంది. ఇదే జరిగితే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ హాట్రిక్ విజయం సాధించనట్లే. దీంతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా చరిత్రలోనూ ఒక అరుదైన సందర్భంగా అవిష్కృతం కానుంది. మొత్తం 12అసెంబ్లీ స్థానాలకు 12అసెంబ్లీ స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలో పడనున్నాయి. ఎన్నికల చరిత్ర ప్రారంభం నుంచి ఇలాంటి సందర్భం ఎన్నడూ ఉమ్మడి జిల్లాలో లేదు. దీంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో యువనేత కేటీఆర్ మార్గదర్శకంలో జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఘనత చరిత్ర పుటల్లో నిలువనుంది.