నల్లగొండ ప్రతినిధి, (నమస్తే తెలంగాణ)/ సంస్థాన్ నారాయణపురం/ మునుగోడు,
నవంబర్ 1 : ‘మునుగోడు నియోజకవర్గంలో మిగిలిన అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తాం. రహదారులు, కళాశాలలు, పోడు భూముల సమస్యలు నా దృష్టికి వచ్చాయి. టీఆర్ఎస్ను గెలిపిస్తే వాటన్నింటినీ పరిష్కరిస్తాం.’ అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా మునుగోడులో మంగళవారం మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో కేటీఆర్ ప్రసంగించారు. అనంతరం సంస్థాన్ నారాయణపురం మండలంలోని పుట్టపాకలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఆధ్వర్యంలో మహిళలతో నిర్వహించిన భారీ ర్యాలీలో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉప ఎన్నికలు సాధారణంగా స్థానిక ఎమ్మెల్యే చచ్చిపోతే వస్తాయని, మునుగోడులో మాత్రం అమ్ముడుపోతే వచ్చాయని అన్నారు. రూ.18వేల కోట్లకు అమ్ముడుపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇంటికి తులం బంగారం ఇచ్చి గెలువాలనుకుంటున్నాడని విమర్శించారు.
మునుగోడు ప్రజలు చాలా చైతన్యవంతులని, తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. 2014లో రూ.400 ఉన్న గ్యాస్ ధర 1200 రూపాయలు అయ్యిందని.. పెట్రోల్, డీజిల్ ధరలకు అడ్డూఅదుపు లేదని విమర్శించారు. వాటి ఫలితంగా నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగాయని, ధరలు పెంచుతూ పోతున్న మోదీకి ఈ ఎన్నికల ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తమది పేదల ప్రభుత్వం, వాళ్లది పెద్దల ప్రభుత్వం.. ఎవరి వల్ల మన బతుకులు బాగుపడుతాయో ఆలోచించాలని సూచించారు. రైతుబంధు ఇచ్చే ప్రభుత్వం కావాలా.. రాబంధు లాంటి బీజేపీ కావాలో ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న బీజేపీ యువతకు చేసిందేమీ లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మల్కాపూర్‌లో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసి ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నదని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు ఇచ్చి వ్యవసాయాన్ని బాగు చేస్తుంటే.. మోదీ సర్కార్ నల్ల చట్టాలతో రైతులను తొక్కిస్తున్నదని విమర్శించారు.
పెద్దోళ్లకు రూ.11.50లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన ప్రధాని మోదీ.. పేదల కోసం ఏం చేశాడని ప్రశ్నించారు. పైగా రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కక్ష గట్టి ఉచితాలు వద్దంటున్నరని విమర్శించారు. ప్రధాని మోదీ ధరలు పెంచుతూ, ప్రభుత్వ ఆస్తులను అమ్ముతూ, రూపాయి విలువను తగ్గిస్తూ ప్రజలను వంచిస్తున్నాడని మండిపడ్డారు. ఝూటా మాటల బీజేపీకి బుద్ధి చెప్పి సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుచాలని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి చేయలేని అభివృద్ధి బీజేపీ తరఫున గెలిస్తే ఎలా చేస్తావని రాజగోపాల్‌రెడ్డిని ప్రశ్నించారు. దేశం కోసం, ధర్మం కోసం అని చెబుతున్న మాటలన్నీ బూటకమన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపించుకుందామని, గరీబోళ్ల కోసం పాటుపడుతున్న కేసీఆర్‌ను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఈ ఉప ఎన్నిక ఇద్దరి వ్యక్తుల మధ్య జరుగుతున్న పోటీ కాదని, రెండు భావజాలాల మధ్య సాగుతున్న పోరాటమని తెలిపారు. మునుగోడు ప్రజలు ఏ గట్టున ఉంటారో తేల్చుకోవాలన్నారు. రాజగోపాల్‌రెడ్డి గుజరాత్ పైసలతో గెలువాలని చూస్తున్నాడని, ఆయన ఏది ఇచ్చినా తీసుకొని టీఆర్ఎస్కే ఓటు వేయాలని కోరారు.
సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ
మత విద్వేషాలను రెచ్చగొడుతున్న మతతత్వ బీజేపీని ఓడించాలన్నారు. తెలంగాణను అభివృద్ధిపథంలో నడిపిస్తున్న టీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నందునే వామపక్షాలు టీఆర్ఎస్కు మద్దతిచ్చాయన్నారు. మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ బీజేపీ డబ్బు సంచులతో వస్తున్నదని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. అప్రమత్తంగా ఉండి కారు గుర్తుకు ఓటు వేసి వామపక్షాలు బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పుట్టపాకలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని యావద్దేశం కోరుకుంటున్నదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే కూసుకుంట్లను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, కంచర్ల భూపాల్‌రెడ్డి, హనుమంత్ షిండే, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, షీప్ అండ్ గోట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నెల్లికంటి సత్యం, ఎంపీపీ కర్నాటి స్వామియాదవ్, జడ్పీటీసీ నారబోయిన స్వరూపారాణి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నారబోయిన రవి ముదిరాజ్, మండలాధ్యక్షుడు బండ పురుషోత్తంరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. పుట్టపాకలో సర్పంచ్ భాస్కర్, ఎంపీటీసీ మర్రి వసంతారెడ్డి, ఉప సర్పంచ్ చంద్రశేఖర్, నాయకులు ఆడెపు పరదేశి, సురేశ్‌కుమార్, వెంకటేశ్, లింగస్వామి, అజయ్, నవీన్ పాల్గొన్నారు.
నియోజకవర్గాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తా
2014లో నన్ను గెలిపిస్తే నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాం. 2018లో రాజగోపాల్‌రెడ్డి మాయమాటలు నమ్మి మోసపోయారు. నమ్మి ఓటేస్తే కాంట్రాక్టులకు అమ్ముడుపోయిన దొంగ రాజగోపాల్‌రెడ్డి మళ్లీ డబ్బు సంచులతో వస్తుండు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండండి. మళ్లీ మోసపోవద్దు. మోసపోతే గోసపడక తప్పదు. మరోసారి దొంగల చేతిలో మోసపోకుండా కారు గుర్తు ఓటేసి నన్ను గెలిపించండి. నాలుగు సంవత్సరాల నుంచి ఆగిపోయిన అభివృద్ధిని ముందుకు తీసుకుపోతాం. నన్ను ఆశీర్వదించండి.. మీ సేవకుడిగా పనిచేస్తా.
టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
న్యాయానికి, అన్యాయానికి మధ్య జరుగుతున్న పోరు
ఈ ఎన్నిక న్యాయానికి, అన్యాయానికి మధ్య జరుగుతున్న పోరు. ప్రజలు ధర్మం వైపు నిలబడి కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. 60 ఏండ్ల కాంగ్రెస్, బీజేపీ పాలనలో మునుగోడు ఆగమైంది. 2014 తర్వాతే అభివృద్ధి మొదలైంది. ఫ్లోరోసిస్‌ను తరిమికొట్టి మునుగోడును పచ్చగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే. నిత్యం ప్రజల పక్షాన నిలుస్తూ తెలంగాణను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రికి అండగా నిలువాలి. ప్రజల సంక్షేమం పట్టని బీజేపీ, కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దు. సామాన్యుల నడ్డి విరిచేలా ధరలు పెంచుతున్న బీజేపీని మునుగోడు దరి చేరనీయొద్దు. మునుగోడులో ప్రాజెక్టులు పూర్తయి సస్యశ్యామలం కావాలంటే, మరింత అభివృద్ధి జరుగాలంటే కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ను గెలిపించాలి. ప్రాజెక్టులను అడ్డుకుంటున్న బీజేపీని, అమ్ముడుపోయిన రాజగోపాల్‌రెడ్డిని చిత్తుగా ఓడించాలి.
గిరిజనుల ఆరాధ్య దైవం సీఎం కేసీఆర్
తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి గిరిజనుల ఆత్మగౌరవాన్ని కాపాడింది సీఎం కేసీఆరే. సమైక్య పాలనలో గిరిజనులను గుర్తించిన దాఖలాలు లేవు. తెలంగాణ రాష్ట్రంలో 10 శాతం రిజర్వేషన్ కల్పించిన గిరిజనుల ఆరాధ్య దైవం కేసీఆర్. గిరిజన బంధు ప్రకటనపై గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో గిరిజన భవనం ఏర్పాటు చేసి లంబాడీల ఆత్మగౌరవాన్ని పెంచారు. గిరిజనులంతా కేసీఆర్ వెంటే ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రికి కానుకగా ఇవ్వాలి.
– మంత్రి సత్యవతి రాథోడ్
మునుగోడు తీర్పు ఢిల్లీ పెద్దలకు చెంపపెట్టు కావాలి
మునుగోడు ఉప ఎన్నిక ఢిల్లీ మతోన్మాదానికి, తెలంగాణ అభివృద్ధికి మధ్య జరుగుతున్న పోరాటం. ఢిల్లీ గద్దలకు చెంపపెట్టులా ఉండేలా తీర్పు ఇవ్వాలి. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. నియోజకవర్గంలో పెండింగులో ఉన్న చర్లగూడెం, లక్ష్మణాపురం ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటే మునుగోడు ప్రాంతం సస్యశ్యామలమవుతుంది. సంస్థాన్ నారాయణపురం మండలంలోని రాచకొండ ఎత్తిపోతల పథకం పూర్తయితే మండలంలోని ప్రతి ఎకరాకూ సాగునీరు అందుతుంది. నియోజకవర్గ అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలి. కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలి. ఢిల్లీకి బయల్దేరుతున్న దక్షిణాది సూర్యుడు
సీఎం కేసీఆర్‌కు మునుగోడు విజయం కానుకగా ఇవ్వాలి. – కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ
మోదీని ఓడించి.. కేసీఆర్‌ను గెలిపించాలి
దేశానికి ప్రమాదకరంగా మారిన మతోన్మాద బీజేపీలో చేరిన రాజగోపాల్‌రెడ్డిని చిత్తుగా ఓడించాలి. వామపక్షాలు మద్దతిచ్చినప్పుడే టీఆర్ఎస్ గెలుస్తుందనే చర్చ నియోజకవర్గంలో జరిగింది. అవకాశవాద రాజగోపాల్‌రెడ్డిని ఓడించాలనే నిర్ణయానికి ప్రజలు వచ్చారు. ఈ విషయం తెలిసిన బండి సంజయ్, రాజగోపాల్‌రెడ్డికి వణుకు పుట్టి కల్లు తాగిన కోతుల్లా మాట్లాడుతున్నారు. వారి మాయమాటలు నమ్మొద్దు. కమ్యూనిస్టులు ఎప్పుడూ ప్రజల వైపే ఉంటారు. ప్రజల కోసం సీపీఎం, సీపీఐ అనేక ఉద్యమాలు, త్యాగాలు చేశాయి. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నది. అందుకే ప్రజలపై భారాలు మోపే చట్టాలు తెస్తున్న మోదీని ఓడించాలి. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌ను గెలిపించాలి.
– చెరుపల్లి సీతారాములు, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు
టీఆర్ఎస్ను గెలిపించుకొని నీళ్లు తెచ్చుకుందాం
మునుగోడు ఉప ఎన్నికలు ఎందుకొచ్చాయో అందరికీ తెలుసు. మనం ఎన్నుకున్న ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి రూ.18వేల కోట్ల కాంట్రాక్టులకు అమ్ముడుపోవడం వల్లే ఈ ఎన్నికలు వచ్చాయి. మళ్లీ డబ్బు గుమ్మరించి గెలువచ్చనే దురుద్దేశంతోనే అనవసర ఎన్నికలు మనపై మోపారు. మూడేండ్లపాటు ఆయన చేసిన అభివృద్ధి శూన్యం. జరిగిన అభివృద్ధి అంతా 2014-2018 మధ్య జరిగిందే. కారు గుర్తుకు ఓటు వేసి కూసుకుంట్లను గెలిపించుకొని డిండి లిఫ్ట్ ద్వారా చర్లపల్లి ప్రాజెక్టు నుంచి నారాయణపురం మండలానికి నీళ్లు తెచ్చుకుందాం.
– ఉజ్జిని యాదగిరిరావు, మాజీ ఎమ్మెల్యే