యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : మునుగోడు ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న కీలక ఘట్టం ఆవిష్కృతం కానున్నది. ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మునుగోడు నియోజకవర్గానికి రానున్నారు. ఆదివారం చండూరు మండలంలోని బంగారిగడ్డలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్న టీఆర్ఎస్ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇందుకోసం గులాబీ సేన అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది. సభ వేదికను సిద్ధం చేసింది. వీవీఐపీ, వీఐపీ, ప్రజల కోసం ప్రత్యేకంగా హాళ్లుగా విభజించింది. సెక్యూరిటీ, మంచి నీటి వసతి, వాహనాల పారింగ్ ఏర్పాట్లు చేసింది. గ్రౌండ్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం హెలీకాప్టర్ ద్వారా సీఎం బంగారిగడ్డకు చేరుకోనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. అకడి నుంచి కాన్వాయ్‌లో సభ వద్దకు రానున్నారు. గులాబీ బాస్‌కు ఘన స్వాగతం పలికేందుకు ప్లాన్ చేశారు. మరోవైపు కేసీఆర్ సభ కోసం జనం స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అనేక గ్రామాల నుంచి పాదయాత్ర ద్వారా సభకు తరలిరానున్నట్లు టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. సీపీఎం, సీపీఐ శ్రేణులు సైతం వేలాదిగా హాజరుకానున్నాయి. మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు అంశం, ఉప ఎన్నిక వేడి నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రసంగం ఎలా ఉండబోతుందో అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అక్టోబర్ 30 వచ్చేసింది. మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీఎం కేసీఆర్ సభకు సమయం ఆసన్నమైంది. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చండూరు మండలం బంగారిగడ్డలో ఆదివారం నిర్వహించనున్న టీఆర్ఎస్ బహిరంగ సభకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. అందుకోసం గులాబీ యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నది. మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం కానుండగా, సీఎం కేసీఆర్‌ను చూసేందుకు, ఏం చెప్తారో వినేందుకు వెళ్లాలని నియోజకవర్గ ప్రజలు సిద్ధమవుతున్నారు. గ్రామాలకు గ్రామాలు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సమాయత్తమవుతున్నాయి. చండూరు చుట్టపక్కల గ్రామాల ప్రజలు, టీఆర్ఎస్ శ్రేణులు పాదయాత్రగా సభకు రానున్నట్లు తెలుస్తున్నది. మంత్రులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు శనివారం సభా ప్రాంగణాన్ని పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు దగ్గరుండి ఏర్పాట్లు చూసుకుంటున్నారు.
చండూరు, అక్టోబర్ 29 : మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో చండూరులో ఆదివారం నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. శనివారం ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, టీఎస్ఐఐడీసీ చైర్మన్ బాలమల్లుతో కలిసి హెలీప్యాడ్ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలు రూపొందించి అమలు చేస్తున్నారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లలా చూస్తున్నారని, సీఎం కేసీఆర్త్రోనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందిందన్నారు. ఎక్కడికి వెళ్లినా, ఎవరిని కలిసినా టీఆర్ఎస్కే మా ఓటు అని ఘంటాపథంగా చెబుతున్నారని తెలిపారు. వారి నుంచి వస్తున్న పాజిటివ్ స్పందన చూస్తే టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి భారీ మెజార్టీ ఖాయమని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ సభకు చండూరు మున్సిపాలిటీతోపాటు మునుగోడు నియోజకవర్గం నుంచి వేలాదిగా ప్రజలు తరలివచ్చేలా చూడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలిరానుండటంతో పార్కింగ్‌కు ఇబ్బంది లేకుండా టీఆర్ఎస్ చర్యలు తీసుకుంది. అన్ని దారుల్లో ప్రత్యేకంగా పార్కింగ్ పాయింట్లను పెట్టింది. నాంపల్లి నుంచి వచ్చే వాహనాలు తుమ్మలపల్లి, మర్రిగూడ నుంచి వచ్చేవి లెంకలపల్లి, చౌటుప్పల్, నారాయణపురం, గట్టుప్పల నుంచి వచ్చే వాహనాలు ఇడికుడ, మునుగోడు, చండూరు వాహనాలు సభ వేదికకు ఎదురుగా ఉన్న పాయింట్లో పార్కింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
చండూరు మండలంలోని బంగారిగడ్డలో ఆదివారం నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభకు వేలాదిగా తరలివచ్చి జయపద్రం చేయాలి. సభకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశాం. అనేక గ్రామాల నుంచి సద్ది కొట్టుకొని పాదయాత్రతో కేసీఆర్ సభకు వస్తామని ప్రజలు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాక కోసం, ఆయన ప్రసంగం కోసం మునుగోడు ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బీజేపీ కుట్రలు, కుతంత్రాలు, కేంద్రం రాష్ర్టాలను ఏవిధంగా బలహీనపరుస్తున్నదో, ఎట్లా అన్యాయం చేస్తున్నదో సభలో కేసీఆర్ వివరించనున్నారు. అభివృద్ధి ఆగిపోయిందని చెబుతూ రాజగోపాల్‌రెడ్డి రూ.18 వేల కోట్లకు అమ్ముడుపోయిన విషయాన్ని ప్రజలు గమనించారు. ఆయన రాజీనామా వెనుక బీజేపీ అజెండా ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. బండి సంజయ్ సిగ్గు లేకుండా యాదాద్రిలో ప్రమాణం చేయడం దుర్మార్గమైన చర్య. ఆయనను ఎవరు అడిగారని ప్రమాణం చేశారో చెప్పాలి. దేవుళ్లను రాజకీయాలకు వాడుకోవడమంత నీచమైన పని ఇంకోటి లేదు. బీజేపీ అగ్రనేతలకు బండారం బయటపడుతుందనే భయం పట్టుకుంది.
కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ శనివారం పరిశీలించారు. సభకు నిర్వహణకు సంబంధించి పలు సూచనలు చేశారు. పార్కింగ్, హెలీప్యాడ్‌ను ప్రత్యేకంగా పరిశీలించారు. మంత్రులతోపాటు ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే గాదరి కిశోర్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, శాట్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి పనులను పరిశీలించారు. అంతకుముందు టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ ఏర్పాట్లను
పర్యవేక్షించారు.