యాదాద్రి, అక్టోబర్27 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కార్తిక మాసం సందర్భంగా వ్రత పూజల్లో భక్తులు పాల్గొని తరించారు. ప్రధానాలయంతోపాటు పూర్వగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో కార్తిక మాస వేడుకలు విశేషంగా జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని దీపాలు వెలిగించారు. స్వామి దర్శనం కోసం భక్తులు క్యూకట్టారు. సత్యనారాయణ స్వామి వ్రత మండపం సందడిగా మారింది. యాదాద్రి కొండ కింద నూతన వ్రత మండపం, పాతగుట్టలో సత్యనారాయణ వ్రతాలు వైభవంగా జరిగాయి. 221 మంది దంపతులు వ్రతమాచరించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపాల వద్ద మహిళలు భక్తిశ్రద్ధలతో దీపారాధన చేపట్టారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారికి నిత్యారాధనలు అత్యంత వైభవంగా సాగాయి. ప్రధానాలయ మొదటి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహహోమం జరిపిన అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా ముస్తాబు చేసి గజవాహనంపై ఊరేగించారు. సువర్ణపుష్పార్చన అత్యంత వైభవంగా జరిగింది. గురువారం ప్రధానాలయ ముఖమండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా సువర్ణపుష్పార్చన జరిపించారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. అనంతరం లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా నిత్య తిరుకల్యాణతంతును జరిపారు. తెల్లవారు జామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామివారికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. సాయంత్రం స్వామికి వెండి మొక్కు జోడు సేవ, దర్బార్ సేవ చేపట్టారు. రాత్రి వేళ స్వామివారి తిరువరాధన చేపట్టి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామివారికి సహస్రనామార్చన జరిపారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చన జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. అన్ని విభాగాలను కలుపుకుని స్వామివారి ఖజానాకు రూ. 16,74,295 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
స్వామివారి 16 రోజుల హుండీ ఆదాయాన్ని గురువారం కొండపై హరిత హోటల్లో లెక్కించారు. రూ.98,49,445 ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. ఇందులో మిశ్రమ బంగారం 173 గ్రాములు, మిశ్రమ వెండి 2 కిలోల 60 గ్రాములు, 415 అమెరికా డాలర్లు, యూఏఈకు చెందిన 115 దిరామ్స్, ఆస్ట్రేలియాకు చెందిన 10 డాలర్లు, న్యూజిలాండ్‌కు చెందిన 15 డాలర్లు, సింగపూర్‌కు చెందిన 14 డాలర్లు సమకూరినట్లు వివరించారు.
లక్ష్మీనరసింహస్వామివారిని రాష్ట్ర రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కృష్ణమనేని పాపారావు దర్శించుకున్నారు. గురువారం యాదాద్రికి చేరుకున్న ఆలయ స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట ఆలిండియా వెలమ అసోషియేషన్ కార్యవర్గం ఉంది.
ప్రధాన బుక్కింగ్ ద్వారా 1,24,700
వీఐపీ దర్శనాలు 60,000
వేద ఆశీర్వచనం 15,000
నిత్య కైంకర్యాలు 2,800
సుప్రభాతం 2,700
ప్రచార శాఖ 15,000
వ్రత పూజలు 1,74,400
కల్యాణకట్ట టిక్కెట్లు 56,500
ప్రసాద విక్రయం 7,99,210
వాహనపూజలు 7,500
అన్నదాన విరాళం 19,801
సువర్ణ పుష్పార్చన 81,580
యాదరుషి నిలయం 37,184
పాతగుట్ట నుంచి 24,520
కొండపైకి వాహన ప్రవేశం 2,50,000
శివాలయం 3,400