మునుగోడు రూరల్, అక్టోబర్ 21 : టీఆర్ఎస్ పాలనలోనే దళితులకు ఆత్మగౌరవం దక్కిందని, కేంద్రంలోని బీజేపీ పాలనలో దళితులు, ఆడపిల్లలపై దాడులు జరుగుతున్నాయని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. శుక్రవారం మండలంలోని కొంపల్లిలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్కు మద్దతుగా దళిత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బాల్క సుమన్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంతుషిండే, ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాధించుకున్న తెలంగాణలో అన్ని కులస్తులతో సమానంగా గౌడ కులస్తులకు సముచిత స్థానం కల్పిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. దేశంలో ఎన్నడు లేని విధంగా దళితుల ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం తీసుకొచ్చినట్లు గుర్తుచేశారు. దళిత సమాజాన్ని కడుపులో పెట్టుకొని చూస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పక్షాన్నే నిలబడి మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ విత్తన అభివృద్ధి శాఖ చైర్మన్ కొండబాల కోటేశ్వర్రావు, ఇల్లందు మార్కెట్ చైర్మన్ హరిసింగ్, ఉద్యమకారుడు బొమ్మెర రామ్మూర్తి, టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
సొంత ప్రయోజనాల కోసమే ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
దళితులను రెచ్చగొడుతుండు : ఎమ్మెల్యే చిరుమర్తి
నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. సొంత ప్రయోజనాల కోసమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దళితులను రెచ్చగొడుతున్నాడని అన్నారు. అన్ని రకాలుగా రిజర్వేషన్లను అనుభవించిన ప్రవీణ్‌కుమార్ ఆయన, ఆయన భార్య ఆర్థికంగా లబ్ధి పొంది నీతిమంతుడిలా మాట్లాడటం విడ్డూరమన్నారు. పేద పిల్లల కోసం గురుకులాలను తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్, సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ గురుకులాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ప్రవీణ్ కుమార్‌కు గురుకులాల బాధ్యతలు అప్పజెప్పింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. బహుజన విద్యార్థుల కోసం గురుకులాలను తీసుకొచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు. గురుకులాలను తానే అభివృద్ధి చేశానని ప్రవీణ్ కుమార్ చెప్పుకోవడం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు. సొంత ప్రయోజనాల కోసం దళితుల ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. కులం పేరుతో రాజ్యాధికారం పొందలేమన్నది జగమెరిగిన సత్యమని, పసి హృదయాల్లో రాజకీయ బీజాలు నాటి వారి ఆలోచనలు దెబ్బతీసే ప్రయత్నం ప్రవీణ్‌కుమార్ చేస్తున్నాడన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రవీణ్‌కుమార్ లాంటి వ్యక్తుల మాటలు నమ్మొద్దన్నారు. దళిత సాధికారత ముమ్మాటికీ కేసీఆర్‌తోనే సాధ్యమని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.