గట్టుప్పల్, అక్టోబర్ 21: మునుగోడు ఉప ఎన్నిక సమీపిస్తున్న తరుణంలో వాడవాడలా ఏ నోట విన్నా టీఆర్ఎస్ పార్టీ గెలుపు మాటే వినిపిస్తున్నదని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పేర్కొన్నారు. గ్రామాల్లో అంతా ఏకమై కారు గుర్తుకే ఓటేస్తామని ముక్తకంఠంతో చెబుతున్నారని అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా గట్టుప్పల్ మండల కేంద్రంలో శుక్రవారం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడారు. ప్రచారంలో అన్ని వర్గాల ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తమ బతుకులు బాగుపడ్డాయని ప్రజలంతా గర్వంగా చెబుతున్నారని అన్నారు. తాము లబ్ధిపొందిన ప్రభుత్వ పథకాలతోపాటు మొత్తంగా అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి వారే అనర్గళంగా వివరిస్తున్నారన్నారు. దీంతో ప్రచార సమయంలో టీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం కన్పిస్తున్నదని చెప్పారు. ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు బీజేపీకి వణుకు పుట్టించడం ఖాయమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దిన్, రాష్ట్ర సీనియర్ నాయకుడు నిట్టు వేణుగోపాల్ రావు, ప్రేమ్‌కుమార్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పున్న రాజేశ్వర్, పిప్పిరి వెంకట్, నల్లవెల్లి అశోక్, పిప్పిరి ఆంజనేయులు, ప్రభాకర్‌రెడ్డి, మధుసూదన్‌రావు, వెంకట్‌గౌడ్, నర్సింహారెడ్డి, మోహన్‌రెడ్డి, రాజాగౌడ్, రతన్ పాల్గొన్నారు.