ఒకప్పుడు నిల్వ నీడ లేకుండా ఉన్న ఈ ప్రాంతంలో హరితహారం కింద నాటిన మొక్కలు నీడనివ్వడంతో పాటు అధిక వర్షపాతానికి కూడా కారణమయ్యాయి. అంతే కాకుండా ప్రభుత్వం ఈ దఫా చేపట్టిన పల్లె ప్రగతి కారణంగా అక్కడి పల్లెల్లో వికాసం మొదలైంది. ఇంటి ముందు ఉన్న పెంట దిబ్బలు మాయమవడం.. ఇంట్లో ఊడ్చిన చెత్తను ట్రాక్టర్ల ద్వారా పంచాయతీలు సేకరించడం.. ఆహ్లాదకరమైన వాతావరణానికి చక్కని పల్లె పార్కులు, పల్లె ప్రకృతి వనాలు, ఆట స్థలాలు, బృహత్ ప్రకృతి వనాలు ఆ పల్లెల వికాసానికి దోహదపడ్డాయి. ఇక ప్రతి ఊరిలోనూ వైకుంఠధామాలు ఏర్పాటు చేసి, చివరి మజిలీ తిప్పలనూ దూరం చేసింది.
మునుగోడు.. ఒకప్పుడు నీరు, నీడ లేని వెనుకబడిన ప్రాంతం. టీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు సమస్యలు రాజ్యమేలిన నియోజకవర్గం.. ఎక్కడ చూసినా ఫ్లోరైడ్ విషం.. దీంతో అంగవైకల్యం.. కాళ్లు, చేతులు వంకర పోయిన దృశ్యాలు అనేకం.. బతుకు జీవుడా అంటూ వలసలు వెళ్లడం ఇక్కడ నిత్యకృతం.. కానీ, ఇప్పుడా పరిస్థితి మారింది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి ఏంటో మునుగోడు నియోజకవర్గం చూసింది. ఫ్లోరైడ్ రక్కసి నుంచి కాపాడేందుకు మిషన్ భగీరథ వచ్చింది. మిషన్ కాకతీయ రైతన్నలను ఆదుకుంది. ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో పల్లెల్లో వికాసం మొదలైంది. రోడ్లు అందుబాటులోకి వచ్చాయి. ఎక్కడికి వెళ్లినా పచ్చని చెట్లు
దర్శనమిస్తున్నాయి. అభివృద్ధికి మారుపేరుగా పల్లెలు మారాయి.
ఉమ్మడి నల్లగొండ జిల్లా దేవరకొండతో పాటు మునుగోడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కంటే ముందు అన్ని రంగాల్లో వెనక బడి ఉండడంతో ప్రతి పథకం అమలులోనూ సీఎం కేసీఆర్ సూచనతో జిల్లా యంత్రాంగం ఎంతో ప్రాధాన్యమిచ్చింది. నిధుల కేటాయింపుతో పాటు ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఈ ప్రాంత అభివృద్ధి ప్రగతి విషయంలో అధికార యంత్రాంగం ఎంతో చొరవ చూపి ముందుకెళ్లింది. ఈ నేపథ్యంలోనే అధిక మొక్కల నాటడం.. ఇంటింటికి నల్లా బిగించి, తాగు నీటి సరఫరా.. మిషన్ కాకతీయ కింద చెరువుల పూడిక లాంటి పనులకు ఎంతో ప్రాధాన్యతనిచ్చింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అత్యంత వెనుక బడ్డ ప్రాంతాలు దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలు.. ఈ రెండు ప్రాంతాల్లో ప్రధానంగా సాగు, తాగు నీరు లేక అభివృద్ధికి నోచుకోనివి. ప్రధానంగా మునుగోడులో ఫ్లోరైడ్ ప్రభావంతో ఆ ప్రాంత ప్రజల్లో ఎక్కువ మంది జవసత్వాలు కోల్పోయి కాళ్లు, చేతులు వంకర పోగా, మరి కొందరు వలస వెళ్లారు. అలాంటి మునుగోడు నేడు అప్పటి పరిస్థితులకు భిన్నంగా మారింది. కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్కడి ప్రజలకు మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చి తొలి విజయం సాధించగా, మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్ధరించి ఆ ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టింది.