సంస్థాన్ నారాయణపురం, అక్టోబర్ 15 : కాంట్రాక్టులకు అమ్ముడుబోయిన రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే అభివృద్ధి శూన్యమని.. టీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి ఓటు వేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రజలకు పిలుపునిచ్చారు. సంస్థాన్ నారాయణపురం మండలంలోని మర్రిబావి తండా, బోటిమీది తండా, రాధానగర్ తండా, పొర్లగడ్డ తండాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా మండలంలోని డాకుతండా, కొర్రతండా, చిల్లాపురం, లచ్చమ్మగూడెం గ్రామాల్లో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, వాయిల్లపల్లిలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్యయాదవ్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సబ్బండ వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నదన్నారు. రూ.వేల కోట్లకు అమ్ముడుబోయి మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టిన రాజగోపాల్‌రెడ్డి ఇన్నాళ్లూ చేయలేని అభివృద్ధి ఇప్పుడెలా చేస్తాడని ప్రశ్నించారు. గిరిజనులకు ఏం చేశాడని ఓట్లు అడుగుతున్నాడన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని మంత్రి ప్రశ్నించారు. పోడు భూముల పరిష్కారానికి ప్రభుత్వం కమిటీ వేసిందని, దానికి తానే చైర్‌పర్సన్‌గా ఉన్నానని, తప్పకుండా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రచారంలో గిరిజనాభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ రామచందర్‌నాయక్, ఎంపీపీ గుత్తా ఉమాప్రేమ్చందర్రెడ్డి, జడ్పీటీసీ వీరమళ్ల భానుమతీవెంకటేశ్గౌడ్, వైస్ ఎంపీ పీ రాజూనాయక్, ఆలిండియా గిరిజన సేవా సం ఘం నాయకులు డాక్టర్ రమణానాయక్, రాంబాబునాయక్, చండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జగ్గురాంనాయక్, సర్పంచులు దోటి మంజులాసైదులు, లచ్చిరాంనాయక్, అలివేలు, జక్కతి పాపయ్య, ఎంపీటీసీలు కరెంటోతు విజయ, జంగయ్య, నాయకులు పాల్గొన్నారు.
మునుగోడు నియోజకవర్గాన్ని ఢిల్లీలో కుదువబెట్టిన మోసకారి రాజగోపాల్‌రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించాలి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి మళ్లీ కట్టెల పొయ్యిపై వంట చేసుకునే రోజులు తీసుకొచ్చి మహిళలను ఇబ్బందుల పాల్జేస్తున్నది. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో 24 గంటల కరెంటు ఎందుకు ఇవ్వడం లేదు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు ఎందుకు అమలు చేయడం లేదు. అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం కేసీఆర్‌కు మద్దతు పలికి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి.
– ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి
సీఎం కేసీఆర్ రెండు వేల పింఛన్ ఇచ్చి వృద్ధులు ఆత్మగౌరవంతో బతికేలా చేశారు. గతంలో వారిని పట్టించుకునే వాళ్లు లేరు. ఇప్పుడు పింఛన్ వస్తుండటంతో కుటుంబ సభ్యులు బాగా చూసుకుంటున్నారు. అలాగే వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్తున్న కార్యసాధకుడు కేసీఆర్. వేల కోట్ల కాంట్రాక్టులకు అమ్ముడుబోయిన రాజగోపాల్‌రెడ్డిని ప్రజలు విశ్వసించడం లేదు. గ్రామాల్లో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి ప్రజల నుంచి భారీగా మద్దతు లభిస్తున్నది. కూసుకుంట్లను గెలిపించుకొని మునుగోడును అభివృద్ధి చేసుకోవాలి.
– బడుగుల లింగయ్య యాదవ్, రాజ్యసభ సభ్యుడు
మునుగోడు నియోజకవర్గ ఎల్లలు, హద్దులు రాజగోపాల్‌రెడ్డికి తెలియవు. గిరిజన తండాల్లోకి ఆయన ఏనాడైనా వచ్చాడా? నేను ఈ ప్రాంతంవాడిగా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషిచేసేవాడిగా మీ ముందుకొచ్చా. నన్ను గెలిపిస్తే మీకు సేవకుడిగా ఉంటూ తండాలను మరింత అభివృద్ధి చేస్తా.
– కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి
మత విద్వేషాలను రెచ్చగొట్టి అన్నదమ్ముల్లా కలిసి ఉన్న ప్రజలను విడగొట్టి ఓట్లు దండుకోవడమే బీజేపీ నైజం. మోదీ, అమిత్ షా సృష్టించిన ఉప ఎన్నికల్లో 18వేల కోట్లకు రాజగోపాల్‌రెడ్డి అమ్ముడుపోయాడు. చైతన్యవంతమైన మునుగోడు ప్రజలు బీజేపీని తరిమికొట్టాలి. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నైరాశ్యంలో ఉంది. దేశానికి సీఎం కేసీఆర్ ప్రత్యామ్నాయం. కేసీఆర్‌ను ఆశీర్వదించి ఢిల్లీకి పంపిస్తే తెలంగాణ ఎలా అభివృద్ధి చెందిందో.. మిగిలిన రాష్ర్టాలు కూడా అలాగే అభివృద్ధిలో పరుగులు పెడుతాయి. ఎనిమిదేండ్ల క్రితం మునుగోడు ఎలా ఉండేదో.. ఇప్పుడెలా ఉందో అభివృద్ధిని చూసి ఓటు వేయాలి. డబ్బుకు, ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల్లో కూసుకుంట్లను భారీ మెజార్టీతో గెలిపించాలి.
– కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ