భువనగిరి కలెక్టరేట్, అక్టోబర్ 15 : టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఈ పర్యాయం గతంలో మాదిరిగా కాకుండా స్థానిక జిల్లా కేంద్రాల్లోనే పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడంతో అభ్యర్థులకు దూర, వ్యయభారం తప్పగా సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 28,909 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతుండగా 96 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10 :30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగనున్నది. అయితే అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోనున్నందున పరీక్ష హాళ్లలోకి ఉదయం 8 గంటల నుంచే అనుమతించనున్నారు. 10:15 గంటలకు పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేస్తారు. ఆ తర్వాత వచ్చిన వారిని అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.
గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే అభ్యర్థుల సౌలభ్యం కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు సహితం నడుపనున్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండటంతోపాటు ప్రతి పరీక్ష కేంద్రం వద్ద మెటల్ డిటెక్టర్స్‌తో పోలీసులు అభ్యర్థులను తనిఖీ చేయనున్నారు.