చౌటుప్పల్/ మునుగోడు/ నాంపల్లి/ మర్రిగూడ , అక్టోబర్ 13:టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ కోసం చండూరుకు వచ్చిన రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో గురువారం ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మెతుకు ఆనంద్, నల్లమోతు భాస్కర్‌రావు, నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో నేతలు పుష్పగుచ్ఛాలు అందించి వెల్కమ్ చెప్పారు. శాలువ, పూల బొకేలతో సన్మానించారు. మంత్రితో సెల్ఫీలు దిగేందుకు యువతీయువకులు పోటీపడ్డారు. తన రాక కోసం ఎదురుచూస్తున్న టీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి అభివాదం చేశారు. గిరిజన మహిళలు తమ సంప్రదాయ నృత్యాలు స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. సంస్థాన్ నారాయణపురంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఘన స్వాగతం పలికారు.
నామినేషన్‌కు తరలివెళ్లిన నేతలు
టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు చండూరుకు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించారు. ఎర్రగండ్లపల్లిలో నిర్వహించిన ఇంటింటి ప్రచారాన్ని, నామినేషన్‌కు వెళ్లే బైక్ ర్యాలీని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. మునుగోడు మండలం చొల్లేడు, చల్మెడ గ్రామాల్లో భూపాలపల్లి, పరకాల ఎమ్మెల్యేలు గండ్ర వెంకట రమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి నామినేషన్‌కు వెళ్లే బైక్ ర్యాలీలను ప్రారంభించారు.