మర్రిగూడ, అక్టోబర్ 13: పోటాపోటీ ప్రచారాలతో ఓట్ల పోట్లాట నడుస్తున్న మునుగోడు నియోజకవర్గంలో.. కనిపించిన మనిషిని పలు పార్టీలు ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్న రోజుల్లో.. పూర్తి భిన్నమైన సన్నివేశం చోటుచేసుకున్నది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ కోసం గురువారం చండూరుకు వచ్చిన మంత్రి కేటీఆర్‌కు ఫ్లోరోసిస్ బాధితుడు అంశల స్వామి గుర్తుకు వచ్చారు. గిఫ్ట్ ఏ స్మైల్ కింద స్వామికి తాను కట్టించిన ఇల్లు ఎలా ఉందో చూడాలనుకున్నారు. ముందస్తు షెడ్యూల్ కాదు. ఎవరికీ సమాచారం లేదు. ప్రచారం ముగియగానే నేరుగా ఒక సామాన్యుడిగా మర్రిగూడ మండలం శివన్నగూడెంలోని స్వామి ఇంటికి వెళ్లారు. కాళ్లూచేతులు కడుక్కొని గుమ్మంలోకి అడుగుపెట్టారు. అనుకోని అతిథిని చూసి స్వామి ఉప్పొంగిపోగా, మంత్రి ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నారు. అప్పటికే సమయం 3 గంటలు దాటడంతో ఆకలిగా ఉన్న కేటీఆర్.. ‘అన్నం పెట్టమ్మా’ అంటూ ఇంట్లో మనిషిలా స్వామి, మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి నేలమీదే కూర్చున్నారు. చేతులు సహకరించని స్వామికి ఆప్యాయంగా భోజనం వడ్డించారు. అన్నం పెట్టిన స్వామి సోదరి రాజేశ్వరికి అన్నలా కొత్త బట్టలు పెట్టారు. భవిష్యత్‌లో ఏ అవసరం వచ్చినా బాధపడాల్సిన పని లేదని, నేనున్నానని భరోసానిచ్చారు. అనంతరం స్వామి ఇంటికి చేరిన భగీరథ నీటిని తాగి సంతోషం వ్యక్తం చేశారు.