సంస్థాన్ నారాయణపురం, అక్టోబర్ 13 : ఉప ఎన్నికలో తనను ఆశీర్వదించాలని టీఆర్ఎస్ మునుగోడు అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ప్రజలను కోరారు. చండూరులో నామినేషన్ వేసేందుకు వెళ్లే ముందు ఆయనకు ఎంపీపీ గుత్తా ఉమాదేవి, సర్పంచ్ శ్రీహరి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ స్వార్థ రాజకీయాల కోసం ప్రజల ఆత్మ గౌరవాన్ని మోదీ, అమిత్ షాకు తాకట్టుపెట్టిన రాజగోపాల్‌రెడ్డిని మునుగోడు గడ్డపై అడుగుపెట్టకుండా తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయన్నారు. తనను గెలిపిస్తే 2018 నుంచి ఆగిపోయిన పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. స్థానిక శివాలయం, రామలింగేశ్వరస్వామి దేవాలయంలో కూసుకుంట్ల ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ జక్కిడి జంగారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పల్లె గోవర్ధన్‌రెడ్డి, గుత్తా ప్రేమ్‌చందర్‌రెడ్డి, తెలంగాణ భిక్షం, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.