చౌటుప్పల్, అక్టోబర్ 13: అన్ని వర్గాల ప్రజలకూ సంక్షేమ పథకాల ఫలాలు అందిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి మునుగోడు ప్రజలు జేజేలు పలుకుతున్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పేర్కొన్నారు. మున్సిపాలిటీలోని 14, 19 వార్డుల్లో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు గడపగడపకూ అందుతున్నాయని వివరించారు. రూ.22,000 కోట్లకు అమ్ముడుపోయిన రాజగోపాల్‌రెడ్డి మనుగోడు ప్రజల ఆత్మాభిమానాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారని విమర్శించారు.
కాంట్రాక్టుల కోసమే పాకులాడే రాజగోపాల్‌రెడ్డికి ప్రజా సంక్షేమం పట్టదని అన్నారు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్న టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని ఆదరించాలని పిలుపునిచ్చారు. కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీ అందించాలని కోరారు. నాయకులు సత్యనారాయణ గౌడ్, బొంగు జంగయ్య గౌడ్, శేఖర్ పాల్గొన్నారు.