చౌటుప్పల్, అక్టోబర్ 13 : కరోనా కష్టకాలంలో ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తే రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ రూ.4వేల కోట్ల నష్టాన్ని భరించి పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేశారని టెస్కాబ్ చైర్మన్ కొం డూరు రవీందర్రావు అన్నా రు. స్థానిక సింగిల్ విండో కార్యాలయంలో టెస్కాబ్ వైస్‌చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కరోనా కోరలు చాచిన వేళ దేశం మొత్తం బంద్‌లో ఉంటే తెలంగాణలో మాత్రం రైతాంగానికి సింగిల్ విండో ద్వారా సేవలు అందించినట్లు చెప్పారు. రాష్ట్రంలో గతంలో కేవలం 1.20 లక్షల ఎకరాలు మాత్రమే సాగులో ఉండగా.. సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న రైతు అనుకూల విధానాలతో సాగు విస్తీర్ణం 2.40 లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు. ధాన్యం కొనుగోలుకు కేంద్రం కేవలం మద్దతు ధర రూ.1880 చెల్లిస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ప్రతి క్వింటాకు 400 రూపాయలు అధికంగా ఖర్చు చేస్తున్నదన్నారు. ధాన్యం కొనుగోలుకు రూ.4వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని పేర్కొన్నారు.. ఈ నెలాఖరు వరకు అన్ని జిల్లాల్లో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు చెప్పారు. రంగారెడ్డి జిల్లా నుంచి ఈ కార్యక్రమం మొదలు పెడతామన్నారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్లు పోచారం భాస్కర్‌రెడ్డి, బొజ్జారెడ్డి, బుయ్యని మనోహర్‌రెడ్డి, మర్నేని రవీందర్రావు, కూరాకుల నాగభూషయ్య, నిజాం పాషా, సింగిల్ విండో చైర్మన్లు చింతల దామోదర్‌రెడ్డి, జక్కిడి యాదిరెడ్డి, యాదయ్య, నరసింహ పాల్గొన్నారు.