సంస్థాన్ నారాయణపురం, అక్టోబర్ 12 : ‘గిరిజనుల ఓట్లు అడిగేందుకు రాజగోపాల్‌రెడ్డికి సిగ్గుండాలి.. ఆయనేం చేశారని ఓట్లు అడుగుతున్నారు.’ అని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. నారాయణపురం మండలంలోని పొర్లగడ్డతండా, గరికగడ్డతండా, బడితండాల్లో బుధవారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజగోపాల్‌రెడ్డి పాపమే మునుగోడు ఉప ఎన్నిక అన్నారు.
వేల కోట్ల కాంట్రాక్టులకు అమ్ముడుపోయి ప్రజలను మోసం చేయడానికి బీజేపీలో చేరాడని విమర్శించారు. మునుగోడు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన ఆయనకు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. సీఎం కేసీఆర్ గిరిజన రిజర్వేషన్లను ఆరు నుంచి 10 శాతానికి పెంచారని, సుమారు మూడు వేల తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారని తెలిపారు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి మంచి స్పందన వస్తున్నదని, ఆయన గెలుపు తథ్యమని అన్నారు. ప్రచారంలో వైస్ ఎంపీపీ రాజునాయక్, వార్డు సభ్యులు రాజు, సోనా, రాజు, భానుప్రకాశ్, హారిక, నాయకులు బిచ్యానాయక్, దశరథ నాయక్, కుమార్‌నాయక్, నరేశ్ పాల్గొన్నారు.