మునుగోడు, అక్టోబర్ 10: మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత పోలగోని సైదులు గౌడ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సమక్షంలో సోమవారం సాయంత్రం టీఆర్ఎస్ (బీఆర్ఎస్)లో చేరారు. మండలంలోని రావిగూడెం, రామకృష్ణాపురం, కల్వలపల్లి, వడ్డెరగూడెం, ఉకొండి గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరగా వారందిరకీ మంత్రి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికకు కుట్రలు, కుతంత్రాలు చేసినా బీజేపీ పాచికలు పారవని స్పష్టం చేశారు.
ఉకొండి కాంగ్రెస్ ఎంపీటీసీ భర్త పోలగోని సైదులుగౌడ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులకు మంత్రి గులాబీ కండవ్వాలు కప్పి ఆహ్వానించారు. మండల వ్యాప్తంగా వివిధ పార్టీల నుంచి మరో 400 మంది మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఉమ్మడి జిల్లాల టీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి తక్కళ్లపల్లి రవీందర్రావు, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ కర్నాటి స్వామి, నాయకులు పురుషోత్తంరెడ్డి, నారబోయన రవి ముదిరాజ్, శరత్‌బాబు పాల్గొన్నారు.