నాంపల్లి, అక్టోబర్ 10 : దేశానికి అన్నం పెడుతున్న రైతులకు అండగా ఉండేందుకు అనేక పథకాలు అమలు చేస్తూ సీఎం కేసీఆర్ రైతు పక్షపాతిగా నిలిచారని టీఆర్ఎస్(బీఆర్ఎస్) జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం మండలంలోని చిట్టంపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గంలో సాగు, తాగునీటి కోసం రెండు పెద్ద ప్రాజెక్టులను టీఆర్ఎస్(బీఆర్ఎస్) ప్రభుత్వం నిర్మిస్తుంటే అడుగడుగునా అడ్డుకుంటూ నియోజకవర్గ ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఉప ఎన్నికలో ఓడించి తగిన రీతిలో బుద్ధి చెప్పాలన్నారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు 24 గంటల విద్యుత్, పేదింటి ఆడబిడ్డ పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను అమలు చేస్తూ సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ నాడూ మునుగోడు నియోజకవర్గాన్ని పట్టించుకోని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, 22వేల కోట్ల కాంట్రాక్టుల కోసం నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారన్నారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నాడో ప్రజలు నిలదీయాలని కోరారు. టీఆర్ఎస్(బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా అందించాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. సమావేశంలో రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్‌రెడ్డి, కంకణాల వెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు వామపక్షాల నాయకులు పాల్గొన్నారు
నాంపల్లి : మండలంలోని ఎస్డబ్ల్యూ లింగోటం, నెవిళ్లగూడెం గ్రామాలకు చెందిన 30 మంది కాంగ్రెస్ నాయకులు రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్‌రెడ్డి, జిల్లా నాయకుడు ఏడుదొడ్ల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కంకణాల వెంకట్‌రెడ్డి, పులిరాజు, కోన్‌రెడ్డి కొండల్, బెక్కం రాంబాబు టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.