‘బీజేపీ మా బతుకులతో ఆటలాడుతున్నది. కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చి ఆగం చేస్తున్నది. ఉద్యోగం సరిగా చేసుకోలేక.. కుటుంబాలు సరిగా చూసుకోలేక నరకయాతన పడుతున్నం. జీతాలు పెంచే ప్రయత్నం చేయకపోగా.. పని గంటలు పెంచి ఇబ్బందుల పాల్జేస్తున్నది.కార్మికుల ఉపాధి, సంక్షేమంపై దెబ్బ కొడుతున్నది. అటువంటి బీజేపీకి మునుగోడు ఉప ఎన్నికల్లో బుద్ధి చెబుతాం. కూసుకుంట్లతోనే మునుగోడు బాగపడతది.. అందుకే ఆయనకే అండగా ఉంటాం. ప్రచారంలో కూడా పాల్గొంటాం’ అని కార్మిక లోకం ముక్తకంఠంతో నినదించింది.
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : స్వరాష్ట్రంలో కార్మిక లోకం చీకట్ల నుంచి వెలుగులోకి వచ్చింది. తెలంగాణలో కార్మికుల కష్టాలు తీరాయి. రాష్ట్ర ప్రభుత్వం వలస కార్మికులతోపాటు స్థానికులకు చేతినిండా పని కల్పిస్తూ భరోసా కల్పిస్తున్నది. రాష్ట్రంలో అర్హులైన కార్మికులతోపాటు చేనేత, గీత కార్మికులకు పింఛన్లు ఇస్తున్నది. ఆటో కార్మికులకు పన్ను రద్దు చేసింది. కరోనా సమయంలో డ్రైవర్లు తీవ్ర నష్టాల పాలవడంతో ఆరు నెలలపాటు క్వార్టర్లీ ట్యాక్స్‌ను మాఫీ చేసింది. నేతన్నలకు నేత బీమా పథకం తెచ్చింది. కార్మికులకు రసాయనాలు, నూలుపై సబ్సిడీ ఇస్తున్నది. గీత, మత్స్యకారులకు ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నది. భవన నిర్మాణ కార్మికుల పిల్లల వివాహానికి నగదు సాయం అందిస్తున్నది. ప్రమాద, వైద్య, బీమా, ప్రసూతి సాయం, సహజ మరణ బీమా, అతిమ యాత్ర ఖర్చులు తదితర సేవలు అందిస్తున్నది. దీంతోపాటు ఆటో డ్రైవర్లు, వర్కింగ్ జర్నలిస్టులు, హోంగార్డులకు ప్రమాద బీమా కింద రూ.5లక్షల ఆర్థిక సాయం ఇస్తున్నది. తెలంగాణ అసంఘటిత కార్మికుల సామాజిక భద్రత పథకంలో భాగంగా రూ.2లక్షల ప్రమాద బీమా అందిస్తూ అండగా ఉంటున్నది.
కేంద్రం విధానాలతో ఉపాధి, సంక్షేమంపై దెబ్బ..
రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం వారి బతుకులను ఆగం చేస్తున్నది. కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొస్తూ వారి పొట్టగొడుతున్నది. కార్మికుల సంక్షేమానికి తూట్లు పొడుస్తున్నది. హక్కులను కాలరాస్తున్నది. అడ్డమైన చట్టాలను తీసుకొస్తూ నిలువునా ముంచుతున్నది. పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్‌కు అమ్మేస్తున్నది. కార్మికుల ఉపాధి, సంక్షేమంపై దెబ్బకొడుతున్నది. రోడ్డు రవాణా సవరణ చట్టాన్ని తీసుకొచ్చిన కేంద్రం.. కార్మికుల కుటుంబాలను రోడ్డుపైకి నెట్టుతున్నది. విద్యుత్ రంగాన్ని ప్రైవేట్‌పరం చేస్తున్నది. గతంలో ఉన్న 44చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో నాలుగు నల్ల చట్టాలను తీసుకొచ్చింది. కొత్త చట్టాల ప్రకారం రోజుకు 12గంటలైనా పనిచేయించుకోవచ్చనే నిబంధనలను తీసుకొచ్చి శ్రమ దోపిడీకి పాల్పడుతున్నది. ఈ నేపథ్యంలో కార్మికలోకం బీజేపీపై గుర్రుగా ఉన్నది. తమకు ఎల్లవేళలా అండగా ఉంటున్న గులాబీ పార్టీకి మద్దుతుగా ఉంటామని, తమ పొట్ట గొడుతున్న బీజేపీకి మునుగోడు ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్తామని ప్రతిన బూనుతున్నారు.
మంచి మనసున్న సర్కారు
కార్మికుల సంక్షేమానికి టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నది. మా బాధలను అర్థం చేసుకొని ఎన్నో పథకాలు, కార్యక్రమాలను తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సక్రమంగా అమలు చేస్తున్నది. అందుకే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించుకుంటాం.
– తడకమళ్ల లక్ష్మి, కార్మికురాలు, చౌటుప్పల్
గులాబీ పార్టీకే మా మద్దతు..
నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ రంగాల్లో 30వేల మంది కార్మికులం పనిచేస్తున్నాం. రెక్కాడితేనే మాకు డొక్కాడుతుంది. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) సర్కారు మాకు అన్నీ మంచిగనే చేస్తున్నది. ప్రమాద బీమా, ఆరోగ్య బీమా కల్పిస్తున్నది. అన్ని విధాలుగా ఆదుకుంటున్న గులాబీ పార్టీకే మద్దతు ఇస్తం. కారు గుర్తుకే ఓటేస్తం.
– బి.ఉపేందర్, కార్మికుడు, చౌటుప్పల్