యాదాద్రి, సెప్టెంబర్ 17 : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం భక్తజన కోలాహలం నెలకొంది. సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంతం సందడిగా కనిపించింది. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు నిర్వహించే సువర్ణ పుష్పార్చన, వేదాశీర్వచనంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. లక్ష్మీనారసింహుడికి అర్చకులు నిత్యోత్సవాలు ఘనంగా నిర్వహించారు.
తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామి, అమ్మవార్లకు ఉదయం సుదర్శన నారసింహ హోమం ఘనంగా నిర్వహించారు. సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం చేశారు. అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం ఘనంగా జరిపించారు. కల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు.
సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు ఘనంగా నిర్వహించారు. కొండకింద దీక్షాపరుల మండపం వద్ద గల వ్రత మండపంలో సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా కొనసాగాయి. స్వామివారిని సుమారు 11,858 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.19,50,548 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 26నుంచి ఆక్టోబర్ 5వరకు దేవీ శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని ఆలయ ఈఓ ఎన్.గీత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 9రోజులు పాటు నిర్వహించే వేడుకల్లో భక్తులు పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. 9రోజుల పాటు పూజ ల్లో పాల్గొనే దంపతులు రూ.1,116, ఒక్కరోజు సప్తశతి పారాయణానికి రూ.116, లక్ష కుంకుమార్చనలో పాల్గొనేందుకు రూ.116 రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. భక్తులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
యాదాద్రీశుడి సేవలో పలువురు ప్రముఖులు పాల్గొని తరించారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, విశ్రాంత ఐపీఎస్ అధికారి రాజీవ్ మాథుర్, హైకోర్టు రిజిస్ట్రార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రమాకాంత్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేశారు.
ప్రధాన బుకింగ్ ద్వారా 1,24,750
వీఐపీ దర్శనం 1,80,000
వేద ఆశీర్వచనం 10,200
సుప్రభాతం 2,300
వ్రత పూజలు 63,200
కల్యాణకట్ట టిక్కెట్లు 26,000
ప్రసాద విక్రయం 8,71,300
వాహనపూజలు 19,800
ప్రచార శాఖ 10,500
అన్నదాన విరాళం 25,647
సువర్ణ పుష్పార్చన 58,432
యాదరుషి నిలయం 32,144
పాతగుట్ట నుంచి 15,370
కొండపైకి వాహనాల అనుమతి 3,00,000
శివాలయం 3,600
ఇతర విభాగాలు 3,705