మిర్యాలగూడ, సెప్టెంబర్ 16 : సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సుసంపన్నంగా ఉందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం మిర్యాలగూడలో 10వేల మందితో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఎన్ఎస్పీ క్యాంపు గ్రౌండు వరకు జాతీయ పతకాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ విద్య, వైద్యం, ఉద్యోగ రంగాల్లో నష్టపోయిందన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సీఎం కేసీఆర్ 14 ఏళ్లు అలుపెరగని ఉద్యమాలు చేశారని, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమరణ దీక్ష చేశారని తెలిపారు. నిజాం నవాబు నుంచి హైదరాబాద్ రాష్ర్టాన్ని దేశంలో విలీనం చేసి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వజ్రోత్సవాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కాగా అంతకుముందు కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, ఎమ్మెల్సీ కోటిరెడ్డితో కలిసి అంబేద్కర్, సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఆర్డీఓ రోహిత్‌సింగ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
వజ్రోత్సవాలు జరుపుకోవడం ఆనందంగా ఉంది: ఎమ్మెల్సీ ఎంసీ
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు జరుపుకోవడం ఆనందంగా ఉందని ఎమ్మెల్సీ ఎంసీ అన్నారు. రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు.
సెప్టెంబర్ 17 ప్రపంచ చరిత్రలోలిఖించదగ్గ రోజు: మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నిజాం నవాబుకు వ్యతిరేకంగా ఐదేళ్లు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్న సెప్టెంబర్17 ప్రపంచ చరిత్రలో లిఖించదగ్గ రోజు అని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. వజ్రోత్సవ సంబురాలు జరుపుకోవడం ఆనందంగా ఉందని, రాష్ట్రం ఇంకా పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలని కోరారు.
అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి: ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు
సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రైతులకు పంట పెట్టుబడి సాయం రూ.10 వేలు అందిస్తున్న గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ కేసీఆర్‌కు అండగా నిలువాలని కోరారు.