తెలంగాణ రాష్ట్ర సాధకుడు… అభివృద్ధి ప్రదాత… సబ్బండ వర్గాల సంక్షేమ సారథి.. దేశానికే ఆదర్శ పాలకుడుగా నిలిచిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పుడు దేశ రాజకీయాలపై దృష్టి సారించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసాధ్యమనుకున్న రాష్ర్టాన్ని సాధించడమే గాక, అనతికాలంలోనే అన్ని రంగాల్లో దేశానికి మోడల్‌గా నిలిపిన తీరు అభినందనలు అందుకుంటున్నది. లోతైన అధ్యయనం, బలమైన సంకల్పం, స్పష్టమైన వ్యూహంతో లక్ష్య సాధన దిశగా సాగే కేసీఆర్‌తో ఏదైనా సాధ్యమేనన్న మాట జనంలో వినిపిస్తున్నది. కేంద్రంలోని బీజేపీ సర్కారు పాలనలో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితుల నేపథ్యంలో..
దేశ రాజకీయాలను ప్రగతి కాముక దిశగా నడిపించడం కేసీఆర్‌కు మాత్రమే సాధ్యమన్న అభిప్రాయం అన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతున్నది. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలన్న ఆకాంక్ష సర్వత్రా మొదలైంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ పక్షాన అన్ని స్థాయిల్లో కేసీఆర్ దేశ రాజకీయ రంగ ప్రవేశంపై సంపూర్ణ మద్దతును ప్రకటించారు. జాతీయ పార్టీ ఏర్పాటుతోపాటు దేశ రాజకీయాల కోసం కేసీఆర్ ఏ పిలుపునిచ్చినా వెన్నంటి ఉంటామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు సైతం కేసీఆర్ వంటి బలమైన నాయకత్వం అవసరమని బలంగా విశ్వసిస్తున్నారు. దేశ్ నేత కేసీఆర్ అంటూ జేజేలు పలుకుతున్నారు.
నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : సరిగ్గా ఎనిమిదేండ్ల కిందట కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని మోదీ సర్కార్, రాష్ట్రంలో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కానీ.. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం ఈ ఎనిమిదేండ్లలో అనేక రంగాల్లో అభివృద్ధి సాధించి దేశానికే ఆదర్శంగా నిలుస్తుండగా.. మోదీ సారథ్యంలో దేశ పరిస్థితి అస్తవ్యస్తంగా మారిపోయిందన్న చర్చ సర్వత్రా నెలకొంది.
కేంద్రంలోని మోదీ సర్కార్ ఎనిమిదేండ్లలో ఒక్కటంటే ఒక్క చెప్పుకోదగిన పథకం తీసుకురాలేక పోయిందన్న విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. పైగా కార్పొరేట్ కంపెనీల అనుకూల విధానాలతో ప్రజలపై భారాలు మోపడంలో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. అడ్డూ అదుపు లేకుండా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుదలతో సామాన్యుల జీవనం చిన్నాభిన్నంగా మారుతున్నది. వీటి ప్రభావం నిత్యావసర వస్తువులతోపాటు అన్నింటిపైనా పడుతున్నది. దాంతో అనేక రంగాలు సంక్షోభంలోకి కూరుకుపోతున్నాయి. ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కల్పన లేకపోగా ఉన్న ఉపాధి మార్గాలు మూసుకుపోతున్నాయి.
ఎల్ఐసీ, బ్యాంకింగ్, రైల్వే ఇలా అనేక రంగాలను కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పుతూ సామాన్యుల ప్రయోజనాలను గాలికి వదిలేస్తున్నది. మోదీ విధానాలతో కేవలం అదానీ, అంబానీలకు చెందిన కంపెనీలు లక్షల కోట్ల సంపదను కూడేసుకున్నాయన్న విమర్శ ప్రజల్లో బలంగా ఉంది. గతంలో యూపీఏ సర్కార్ తీసుకొచ్చిన ఉపాధి హామీ వంటి ఒక్క ఘనమైన పథకానికి కూడా ఈ ఎనిమిదేండ్లలో దేశ ప్రజలు నోచుకోలేదని విపక్షాలు విమర్శనాస్ర్తాలు సంధిస్తున్నాయి. ఇదిలా ఉంటే అభివృద్ధిపథంలో దూసుకెళ్తున్న రాష్ర్టాలను సైతం జీర్ణించుకోలేక పోతుందన్న చర్చ ఉన్నది. రాష్ర్టాలకు సహకరించకుండా ఎక్కడికక్కడే మోకాలడ్డే ప్రయత్నాలను కొనసాగిస్తున్నదన్న విమర్శలు ఉన్నాయి.
తెలంగాణలో పండిస్తున్న వరి ధాన్యాన్ని కొనబోమంటూ ఆంక్షలు పెట్టి ఇబ్బందులకు గురిచేయడం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. పైగా ఉపాధి హామీ పథకంలో గతంలో వందకు పైగా పనులు నిర్వహించే వీలును కుదించింది. ఉపాధి హామీ నిధులతో శాశ్వత వనరులను సృష్టించే ప్రయత్నాలు రాష్ట్రం కొనసాగిస్తుంటే.. వాటిని అడ్డుకునేలా ఇటీవల కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కేవలం 20 రకాల పనుల కంటే ఎక్కువ చేయడానికి వీల్లేదంటూ ఆంక్షలు పెట్టింది. ఇక జాతీయ ప్రాజెక్టులకు జాతీయ హోదా, కేంద్ర విద్యాసంస్థలు, వైద్య సంస్థల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరు తీవ్ర ఆటంకంగా మారుతున్నది. వీటన్నింటిపైనా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది.
ఇక రాష్ట్రం విషయానికి వస్తే.. ప్రాజెక్టులు, వ్యవసాయం, విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పన, ఉపాధి అవకాశాల పెంపుదల, కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల కల్పన ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా తెలంగాణ ఘననీయమైన ప్రగతి సాధించిందన్నది కాదనలేని నిజం. అందుకు ప్రతియేటా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న నివేదికలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇంటింటికీ నల్లా కనెక్షన్లతో తెలంగాణలో కొత్తగా ఒక్క ఫ్లోరైడ్ కేసూ నమోదు కాలేదని పార్లమెంట్ సాక్షిగా చేసిన ప్రకటన వీటికి ఒక మచ్చు తునకే. ఇలా కొత్తగా రాష్ట్రం సాధించుకున్నాక సీఎం కేసీఆర్ ఒక్కో రంగంపై ప్రత్యేక దృష్టి పెడుతూ తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తూ వస్తున్నారు. ఒకనాడు బీడు భూములతో కునారిల్లిన రాష్ట్రం నేడు దేశానికే అన్నపూర్ణగా అవతరించింది.
స్వరాష్ట్రంలో ఉమ్మడి జిల్లాకే అత్యధిక ప్రయోజనం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకే అనేక రంగాల్లో అత్యధిక ప్రయోజనం చేకూరింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, వనరుల పునరుద్ధరణతో ఎనిమిదేండ్లలో ఎనిమిది లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగింది. దాంతో ప్రస్తుతం మొత్తం 21లక్షల ఎకరాలకు పంటల సాగు పెరుగడం విశేషం. గతంలో నాలుగు లక్షల ఎకరాలు దాటని వరి సాగు.. నేడు 11లక్షల పైచిలుకు విస్తరించింది. ఏడు లక్షల ఎకరాల్లో పత్తి సాగువుతూ రాష్ట్రంలోనే ముందంజలో ఉన్నది.
ఉచిత విద్యుత్తు ద్వారా అత్యధిక లబ్ధి జిల్లా రైతులకే కలుగుతున్నది. త్వరలోనే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అందుబాటులోకి వచ్చేలా శరవేగంగా పనులు కొనసాగుతున్నాయి. రైతుబంధు వంటి పథకాలతో ప్రతి సీజన్లో 1200 కోట్ల రూపాయలు ఉమ్మడి జిల్లా రైతులకు అందుతున్నాయి. జిల్లాలో గతంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా లేదు. ఇప్పుడు మూడు జిల్లాలకు మూడు మెడికల్ కాలేజీలు సాధ్యమయ్యాయి. వైద్యపరంగా ఎన్నో అధునాతన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. విద్యాపరంగా ఉమ్మడి జిల్లాలో పదుల సంఖ్యలో గురుకుల స్కూళ్లు, కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి.
మన ఊరు – మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ఉన్నతంగా తీర్చిదిద్దే పనులు జరుగుతున్నాయి. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో ప్రగతి కార్యక్రమాలతో మౌళిక వసతులు మెరుగుపడ్డాయి. రైతు వేదికలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, ట్రాక్టర్ల ద్వారా చెత్త సేకరణ, ట్యాంకర్ల ద్వారా మొక్కల పెంపకం ఇలా అనేక వినూత్న కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇవికాకుండా వయస్సు రీత్యా, వృత్తుల వారీగా ఆసరా పింఛన్లు, కల్యాణక్ష్మి, కేసీఆర్ కిట్ ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంతటి గొప్ప పథకాలు లేవు. ఇలా అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు కొనసాగుతుంటే వీటిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేయడం ఆందోళనకు గురిచేస్తుంది.
ఆంక్షల కేంద్రం..
జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై కేంద్రం కొర్రీలు పెడుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. ఉచిత విద్యుత్తుపై కేంద్రం చేస్తున్న కుట్రలను సీఎం కేసీఆర్ ఎప్పటికపుడు బహిర్గతం చేస్తూనే ఉన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణానికి కేంద్రం నిధుల కొరతను సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నది. పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్‌కు జాతీయ హోదాను పట్టించుకోవడం లేదు. ఇందులో భాగంగా నిర్మిస్తున్న మునుగోడు, దేవరకొండ ప్రాంతాలను సస్యశ్యామలం చేసే డిండి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులపైనా స్పష్టత రానివ్వడం లేదు. ఇక జిల్లాలో అత్యధికంగా సాగువుతున్న వరి ధాన్యం సేకరణపైనా గత యాసంగి నుంచి ఆంక్షలు పెడుతూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నది.
ఇలా ఏ రంగంలో చూసినా ఆటంకాలు సృష్టించేందుకే కేంద్రం కుట్రలు చేస్తుందన్న చర్చ జిల్లా ప్రజల్లోనూ ఉంది. ఇక్కడే ఇలా ఉంటే.. దేశవ్యాప్తంగా ఇతర రాష్ర్టాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయోనన్న సందేహాలు ప్రజల్లో నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరమన్న చర్చ సాగుతున్నది. మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా బలమైన నాయకత్వం దేశానికి అవసరమన్న అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. దీనికి కేసీఆర్ వంటి సమర్థుడే సరైన నాయకుడని ఉమ్మడి జిల్లా ప్రజలు భావిస్తున్నారు. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి ప్రవేశించాలని, రాష్ట్రం మాదిరిగానే దేశ ప్రజల సంక్షేమానికి కృషి చేయాలని బలంగా కోరుకుంటున్నారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ వెంట ఏ విధంగా నడిచామో.. అదేవిధంగా దేశం బాగు కోసం వెన్నంటి ఉంటామంటూ మద్దతు ప్రకటిస్తున్నారు. అనేక మంది ఈ విషయంలో స్పందిస్తూ దేశ్‌కి నేత కేసీఆర్.. అంటూ బల్లగుద్ది చెబుతున్నారు.
దేశాన్ని మార్చే శక్తి సీఎం కేసీఆర్‌కే ఉంది..
చిన్నప్పటి నుంచి చూస్తున్నా.. ఈ దేశం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటని వింటున్నాం. అభివృద్ధి చెందిన దేశంగా ఎప్పుడు మారుతుందో. దేశ రూపురేఖలు మార్చాలంటే ముఖ్యంగా సామాన్య ప్రజల జీవన స్థితిగతులను మార్చాలి. పేదలకు విద్య, వైద్యం ఉచితంగా అందించాలి. నిరుద్యోగం, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలి. 75 ఏండ్ల స్వతంత్ర భారతదేశం గర్వంగా చెప్పుకోవడానికి ఏమున్నది. సామాన్యుల జీవన పరిస్థితులను మార్చలేదు. ఇన్నేండ్ల పరిపాలనలో పేదల అభివృద్ధికి మార్పులు జరుగడం లేదు. అందుకే ఈ దేశానికి కొత్త నాయకుడి అవసరం ఉంది. దేశంలో 28రాష్ట్రాల నుంచి 29వ రాష్ట్రంగా తెలంగాణను ఏర్పాటు చేయడానికి ముఖ్య భూమిక పోషించిన సీఎం కేసీఆర్‌లో ఏదో తెలియని రాజనీతి దాగుంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ అనేక వినూత్న పథకాలు ప్రవేశపెట్టారు. ఆ పథకాలు పేదలకు ఆసరాగా నిలిచాయి. కేసీఆర్ ఆలోచన విధానం ఎప్పుడూ కొత్త మార్పునే కోరుతుంటుంది. అందుకే దేశ రాజకీయాల్లోకి కేసీఆర్‌కు ఆహ్వానం పలుకాలి. ఈ దేశాన్ని మార్చే శక్తి ఆయనలో నిండుగా ఉన్నది.
– బైరపాక స్వామి, కవి, అమ్మనబోలు, ఆలేరు మండలం
జాతీయ స్థాయిలో మార్పు అవసరం
భారతదేశం అనేక కులాలు, మతాలు, జాతులు, సంస్కృతులు, ఎన్నో ఆచారాలతో కూడుకున్నది. భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పుకొనే దేశంలో ప్రస్తుతం కొంత మంది గుత్తాధిపత్యం కొనసాగిస్తూ ఏక పార్టీ అనే భావనతో పాలన సాగిస్తున్నారు. భయాందోళనతో జీవనం సాగించాల్సిన పరిస్థితులు తలెత్తుతున్న ఈ తరుణంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు జాతీయ స్థాయిలో కొత్త ప్రభుత్వం కోసం ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. దేశంలోని పేద వర్గాలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే రంగాలు కనుమరుగవుతున్న తురుణంలో ఆయా వర్గాల ప్రజలు దిక్కులేని జీవనం సాగించాల్సి వస్తుంది. ఈ తరుణంలో జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే నాయకత్వం అవసరం.
– వేముల వెంకటేశ్వర్లు, కేఆర్ఆర్ కాలేజీ అధ్యాపకుడు, కోదాడ
సీఎం కేసీఆర్‌తోనే దేశ స్థాయిలో మహిళలకు రక్షణ
దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మహిళలపై లైంగికదాడులు, హింస, వేధింపులు, దాడులు పెరిగిపోతున్నా.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పైగా ప్రశ్నించే వారి హక్కులను కాలరాస్తున్నది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల రక్షణకు, అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. వాటిని చూసి దేశంలోని నాయకులు నేర్చుకోవాలి. సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలు దేశ ప్రజలందరికీ చాలా అవసరం. కేసీఆర్ వంటి నాయకుడు దేశ స్థాయిలో ఉంటేనే మహిళలకు రక్షణ లభిస్తుంది. దేశ రాజకీయాల్లోకి వెళ్లున్న కేసీఆర్ సారుకు సంపూర్ణ మద్దతు ఇస్తాం.
– అంతటి భాగ్యమ్మ, వీబీకే, సంస్థాన్ నారాయణపురం
సీఎం కేసీఆర్ ఉంటే దేశం బాగుపడుతది..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు కులవృత్తులు చేసుకునేవారు చాలా ఇబ్బంది పడ్డారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ కుల వృత్తుల వారికి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి ఆదుకుంటున్నడు. మాకు ఉచిత కరెంటు ఇచ్చాడు. నాకు రెండు వేల రూపాయల పింఛన్ మంజూరైంది. కుల వృత్తుల వారందరికీ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. దేశంలో కేసీఆర్ ఉంటే దేశ ప్రజలకు కూడా తెలంగాణ తరహాలో సంక్షేమ పథకాలు వస్తాయి. అప్పుడు దేశ ప్రజలందరూ బాగుపడుతారు. తెలంగాణలో రైతులు ఎంతో సంతోషకరంగా ఉన్నారు. తెలంగాణ తరహా పాలన కావాలని ఇప్పటికే అన్ని రాష్ర్టాల్లో ప్రజలు కోరుకుంటున్నారు. కేసీఆర్ దేశంలో ఉంటే అన్ని రాష్ర్టాల్లో తెలంగాణ వలే సంక్షేమ పథకాలు అమలు చేస్తారు. దాంతో దేశం పూర్తి స్థాయిలో బాగుపడుతది. కుల వృత్తులవారు ఉపాధి పొందుతారు. కాబట్టి దేశంలో కేసీఆర్ వంటి నాయకుడు ఉండాలి.
– వెంకటయ్య, క్షౌర వృత్తిదారుడు, తిప్పర్తి
కేసీఆర్ ముందుకొస్తే దేశం బాగుపడతది
ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి మన రాష్ట్రం లాగానే దేశం కూడా బాగుపడతది. ఆయన వచ్చినంక అందరి జీవితాల్లో ఆనందం నిండింది. కటింగ్ లేకుండా కరెంట్, పుష్కలంగా నీళ్లు అందుతుండడంతో పంటలు బాగా పండుతున్నయి. రోడ్లు బాగయినయి. మా సూర్యాపేట జిల్లా అయింది. మెడికల్ కాలేజీ వచ్చింది. గవర్నమెంట్ దవాఖాన బాగయింది. సర్కారు బడులు బాగు పడినయి. గతంలో నాకు రెండొందలు పింఛను వచ్చేది. ఇప్పుడు రెండు వేలు ఇస్తున్నరు. నా బిడ్డ పెండ్లికి కల్యాణలక్ష్మి కింద లక్ష నూటపదహారు రూపాయలు ఇచ్చి ఆదుకున్నరు. ఈ మధ్యనే మంత్రి జగదీశ్రెడ్డిగారు చెక్కు కూడా ఇచ్చినరు. అన్ని బాగనే ఉన్నయి కానీ.. బీజేపోల్లు, ప్రధానమంత్రి మోదీ 400 ఉన్న గ్యాస్ సిలిండర్‌ను రూ.1100పైనే పెంచిండ్రు. 40, 50 రూపాయలున్న పిట్రోల్ను 100 దాటించిండు. బండి తోలాలంటే భయమేస్తున్నది. అందుకనే మన ముఖ్యమంత్రి కేసీఆర్ సారు దేశ రాజకీయాల్లోకి పోతే ఇవన్నీ తగ్గుతాయని ఆశగా ఎదురు చూస్తున్నం. ఇంకా వేరేవాళ్ల మాటలు నమ్మలేం. మా ఇరుగు పొరుగువాళ్లమంతా ఒకచోట కూర్చొని మాట్లాడుకున్నప్పుడల్లా కేసీఆర్ సారు వల్లనే మా బతుకులు మరింత మారుతాయని అనుకుంటున్నం.
– పోలెబోయిన కోటమ్మ, గృహిణి, సూర్యాపేట
దేశానికి కేసీఆర్ వంటి నాయకుడు కావాలె..
దేశానికి సీఎం కేసీఆర్ వంటి గొప్ప నాయకుడు కావాలి. దేశంలో ఇప్పుడున్న పరిస్థితులను చక్కదిద్దే సామర్థ్యం ఆయనకే ఉంది. తనదైన పంథాలో తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కేసీఆర్ విజయం సాధించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాలను ప్రైవేటు పరం చేసి సంపన్నులకు కట్టబెడుతున్నది. జీఎస్టీ పేరుతో నిరుపేదలను ఇబ్బందులకు గురి చేస్తున్నది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నది. తెలంగాణలో కేసీఆర్ రైతులకు రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంటు ఇస్తుంటే.. ప్రధానమంత్రి మోదీ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. కేంద్రంలో బీజేపీని ఎదిరించాలంటే కేసీఆరే కరెక్ట్. దేశంలో ఉన్న వనరులను ప్రైవేటు పరం చేస్తున్న బీజేపీని గద్దె దింపే సత్తా ఆయనకే ఉంది. మన దగ్గరి పథకాలు దేశమంతా అమలు చేయాలి. అన్ని వర్గాల ప్రజల కష్టాలు, బాధలు సీఎం కేసీఆర్‌కు బాగా తెలుసు. దేశానికి కేసీఆర్ కావాలి.
-చీనూరి వెంకన్న, చికెన్ షాపు నిర్వాహకుడు, గుండాల