మునుగోడు, సెప్టెంబర్ 7 : మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, వేలకోట్ల రూపాయల కాంట్రాక్టుల కోసం బీజేపీలోకి వెళ్లినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని మళ్లీ గెలిపించేందుకు ఆయన అన్న కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోవర్ట్ రాజకీయం నడిపిస్తున్నారు. స్థానిక కాంగ్రెస్ నేతలకు ఫోన్లు చేసి ఎలాగైనా తన తమ్ముడు రాజగోపాల్‌రెడ్డిని గెలిపించాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని పార్టీ జిల్లా నాయకుడు పొలగోని సైదులుగౌడ్ వెల్లడించారు.
బుధవారం మునుగోడు మండలంలోని ఊకొండిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరామారావు దృష్టికి ఆయన విషయాన్ని తీసుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తనకు ఫోన్ చేసి “మనదంతా ఒకే కుటుంబం, తమ్ముడు రాజగోపాల్‌రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది, మీరంతా సపోర్ట్ చేయాలి” అని చెప్పారని పేర్కొన్నారు.
మీరు కూడా బీజేపీలోకి వెళ్లొచ్చు కదా అని వెంకట్‌రెడ్డిని ప్రశ్నించగా.. “త్వరలో నేను కూడా వెళ్తా.. ముందైతే తమ్ముడిని గెలిపించండి” అని ఆయన చెప్పారని సైదులుగౌడ్ వివరించారు. రాజగోపాల్‌రెడ్డి బీజేపీలోకి వెళ్లి కాంగ్రెస్‌కు ద్రోహం తలపెడితే, వెంకట్‌రెడ్డి మాత్రం పార్టీలో ఉంటూ కాంగ్రెస్‌ను నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయంగా జన్మనిచ్చిన కాం గ్రెస్ పార్టీకి వెంకట్‌రెడ్డి వెన్నుపోటు పొడుస్తున్నారని, దమ్ముంటే కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయి నచ్చిన పార్టీలో చేరాలని హితవు పలికారు.
గతంలోనూ ఇలాగే..
మునుగోడు మండలంలోని బీరెల్లిగూడెం, పులిపలుపులతో పాటు పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులకు కూడా వెంకట్‌రెడ్డి ఫోన్లు చేసి రాజగోపాల్‌రెడ్డిని గెలిపించాలని కోరాడని పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు సమావేశంలో నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. సమావేశంలో మాజీ ఎంపీపీ పొలగోని సత్యం, నాయకులు నన్నూరి విష్ణువర్ధన్‌రెడ్డి, పందుల భాస్కర్, పాల్వాయి చెన్నారెడ్డి, మిర్యాల మధుకర్, ఎంపీటీసీలు పొలగోని విజయలక్ష్మి, భీమనపల్లి సైదులు పాల్గొన్నారు.