Hung : రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7 మున్సిపల్ కార్పొరేషన్లు,116 మున్సిపాలిటీలకు ఇటీవల ఎన్నికలు జరుగగా.. ఇవాళ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 136 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు వెల్లడి అయిన ఫలితాల ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ 60కి పైగా మున్సిపాలిటీల్లో, బీఆర్ఎస్ పార్టీ 15 మున్సిపాలిటీల్లో విజయాలు సాధించాయి. అయితే పలుచోట్ల అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మధ్య గట్టిపోటీ జరిగింది. ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్ అందుకోక హంగ్ ఏర్పడింది. దాంతో ఆయా మున్సిపాలిటీల్లో హార్స్ ట్రేడింగ్‌కు తెరలేచింది. మ్యాజిక్ ఫిగర్ కోసం బేరసారాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో స్వతంత్రులు, ఎక్స్ అఫిషియో సభ్యులు కీలకంగా మారారు.
శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వరకు మొత్తం 16 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ప్రజలు హంగ్ తీర్పు ఇచ్చిన మున్సిపాలిటీల్లో పరకాల, అలంపూర్, నర్సాపూర్, జిన్నారం, కేసముద్రం, ఇస్నాపూర్, ఆసిఫాబాద్, జమ్మికుంట, జనగామ, కామారెడ్డి, అమరచింత, కోహీర్, దేవరకద్ర, ఆసిఫాబాద్, వేములవాడ, రాయికల్, జహీరాబాద్, మహబూబాబాద్, ఆలియాబాద్, బోధన్, గద్వాల, బెల్లంపల్లి, క్యాతనపల్లి తదితర మున్సిపాలిటీలు ఉన్నాయి.
ఇక ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. బీఆర్ఎస్ పార్టీ తన ఖాతాలో 8 మున్సిపాలిటీలు వేసుకుంది. సంగారెడ్డి జిల్లాలోని గడ్డపోతారం, ఇంద్రేశం, గుమ్మడిదల.. జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజ, మహబూబాద్ జిల్లాలోని తొర్రూరు, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఎల్లంపేట, మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆమన్‌గల్, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, మెదక్ జిల్లాలోని దుబ్బాక, తుప్రాన్తోపాటు మరో మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి.
ఇక అధికార కాంగ్రెస్ పార్టీ 60కి పైగా మున్సిపాలిటీల్లో విజయం సాధించింది. అందులో నేరేడు చర్ల, హుజూర్నగర్, హాలియా, కోదాడ, సూర్యాపేట, నందికొండ, చండూరు, భూత్పూర్, ధర్మపురి, భీంగల్, బిచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి, చొప్పదండి, సుల్తానాబాద్, మంథని, హుస్నాబాద్, మరిపెడ, డోర్నకల్, నారాయణఖేడ్, అశ్వారావుపేట, స్టేషన్ ఘన్పూర్, ఆందోలు-జోగిపేట, సదాశివపేట, సంగారెడ్డి, హుజూరాబాద్, దేవరకొండ, కొల్లాపూర్, మద్దూరు, పెబ్బేరు, స్టేషన్‌ఘన్‌పూర్, మథిర, ఇల్లందు, ములుగు, ఆత్మకూరు, చెన్నూరు, రామాయంపేట, వైరా, కల్లూరు, భద్రాచలం తదితర మున్సిపాలిటీల్లో గెలిచింది.
కాగా అనూహ్య రీతిలో వడ్డేపల్లి మున్సిపాలిటీని ఫార్వర్డ్ బ్లాక్ గెలుచుకుంది. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో బీజేపీ విజయం సాధించింది.