నల్లగొండ రూరల్, సెప్టెంబర్ 5 : వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, నేత, బీడీ కార్మికులకు ఆసరా పింఛన్ల మంజూరులో రాష్ట్రం రికార్డు సృష్టిస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్లగొండ మండలంలోని లబ్ధిదారులకు జిల్లాకేంద్రంలోని ఇంద్రారెడ్డి ఫంక్షన్ హాల్లో సోమవారం ఆయన నూతన ఫించన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25ఏండ్లు బీజేపీ ఎలుబడిలో ఉన్న గుజరాత్లో వృద్ధులు, వితంతువులకు ఇచ్చే పింఛన్ కేవలం రూ.750మాత్రమే అన్నారు. అందులో దివ్యాంగులకు ఇచ్చేది కేవలం రూ.600 మాత్రమేనన్నారు. సీఎం కేసీఆర్ ప్రజల మేలు కోరుతూ మంచి చేయడాన్ని ప్రధాని మోదీ చూసి తట్టుకోలేక పోతున్నాడని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమం చూసి బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ప్రజలు తిరగబడుతారనే భయం వారికి పట్టుకుందన్నారు. అందుకే సీఎం కేసీఆర్ రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు కేంద్రం కిందా మీద పడుతుందని విమర్శించారు. బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు గాకుండా అడ్డుకోవడం కేంద్రం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడం, రాష్ట్రం నుంచి ముక్కు పిండి వసూల్ చేసిన పన్నులు తిరిగి రాష్ర్టానికి అందించకుండా మొకలాడ్డుతుందని మండిపడ్డారు. అయినా వెనక్కి తగ్గకుండా కొత్తగా మంజూరైన 10లక్షల పింఛన్లు కలుపుకొని మొత్తం రాష్ట్రంలో 46లక్షల మంది లబ్ధిదారులకు ఫించన్లు మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని పేర్కొన్నారు.
లబ్ధిదారులకు పింఛన్ ఎలాంటి పైరవీలకు అస్కారం లేకుండా జమ ఆవుతుందన్నారు. అంతేగాకుండా రుణమాఫీ పేరుతో రూ.25వేల కోట్ల పంట రుణాలు మాఫీ చేసిన చరిత్ర సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. అందుకు భిన్నంగా బీజేపీ నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆయన మండిపడ్డారు. అన్నింటికి మించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 24గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా బీజేపీ పాలకులకు కంటగింపుగా మారిందన్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో కరెంట్ సరఫరా కేవలం 6గంటలు మాత్రమేనన్నారు. అక్కడ అర నిమిషం సైతం ఉచిత విద్యుత్ ఇవ్వక పోగా వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టి రీడింగ్ ప్రకారం రైతాంగం నుంచి ముక్కుపిండి మరీ విద్యుత్ ఛార్జీలు వసూలు చేస్తున్నారన్నారు. కేంద్రంలోని బీజేపీ పాలనలో గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదలకు అంతే లేకుండా పోయిందని విమర్శించారు.
రాష్ట్ర సంక్షేమానికి బీజేపీ అడ్డొస్తున్నప్పుడు సీఎం కేసీఆర్‌కు పథకాలు అనుభవిస్తున్న లబ్ధిదారులే అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, దేవరకొండ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఆర్డీఓ జగన్నాథ్‌రావు, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, ఎంపీపీ సమన్, టీఆర్ఏస్ మండలాధ్యక్షుడు దేప వెంకట్‌రెడ్డి, బకరం వెంకన్న, గాదె రాంరెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మన్నె కృష్ణార్జున్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు రాజుపేట మల్లేశ్‌గౌడ్, ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి, ఇన్చార్జి ఎంపీఓ మహమూద్, గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.