మిర్యాలగూడ రూరల్, సెప్టెంబర్ 5 : సీఎం కేసీఆర్ ప్రోత్సాహం, నాబార్డు సహకారంతో డీసీసీబీ రైతులకు విరివిగా రుణాలు అందిస్తున్నదని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని బి.అన్నారం పీఏసీఎస్ ఆధ్వర్యంలో రూ.21లక్షల నాబార్డు నిధులతో నూతనంగా నిర్మించిన గోదాంను సోమవారం వారు ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ రైతు క్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు, బ్యాంకులతో తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నారన్నారు. 103ఏండ్లు కలిగిన డీసీసీబీ 2020నాటికి కేవలం రూ.900కోట్ల టర్నోవర్ ఉంటే, సీఎం కేసీఆర్ సహకారంతో రెండేండ్లలో రూ.1900కోట్లకు పెంచామన్నారు. నష్టాల ఊబిలో ఉన్న బ్యాంకును ప్రభుత్వం, ఆధికారులు, సిబ్బంది సహకారంతో లాభాల బాటలోకి తెచ్చామన్నారు.
రైతుల వ్యవసాయానికి, అనుబంధ పనులకు రుణాలిచ్చి ప్రోత్సహిస్తూనే మరోవైపు వారి బిడ్డల ఉన్నత చదువుకు విదేశాలకు వెళ్లేందుకు విద్యారుణం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం 740మంది విద్యార్థుల విదేశీ చదువుకు రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. అన్నారం పీఏసీఎస్ నిర్వహణ తీరుపై ప్రశంసించారు. గతేడాది సంఘం వంద శాతం రికవరీతో పాటు, రూ.11లక్షలు లాభాలు గడించడంపై ప్రశంసించారు. సంఘం కోరిన బంగారు ఆభరణాలపై రుణాలు పొందేందుకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సంఘం సిబ్బంది డీసీసీబీ చైర్మన్, ఎమ్మెల్యేను శాలువాలతో సన్మానించారు. రైతులకు మంజూరైన దీర్ఘకాలిక రుణాల చెక్కులు పంపిణీ చేశారు.
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గ్రామ పాఠశాల ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ నారాయణరెడ్డి, ఎంపీపీ నూకల సరళాహన్మంతరెడ్డి , జడ్పీటీసీ విజయసింహారెడ్డి, రైతు సంఘం దామరచర్ల మండలాధ్యక్షుడు కుందూరు వీరకోటిరెడ్డి, సీఈఓ మదన్మోహన్, డీసీసీబీ డీసీఏ రాజేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ అంబటి వెంకట్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి , చిట్టి బాబునాయక్, ఏఈఓ నాగమణి, సీఈఓలు పడిగపాటి వెంకట్‌రెడ్డి , పోరెడ్డి వెంకట్‌రెడ్డి , మచ్చ లచ్చయ్య, యాదగిరి , టీఆర్ఎస్ నాయకులు పడిగపాటి కోటిరెడ్డి, బాల సత్యనారాయణ, కందుల నాగిరెడ్డి, వీరారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సైదిరెడ్డి పాల్గొన్నారు.