యాదాద్రి, సెప్టెంబర్ 2 : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దివ్యక్షేత్రంలోని అద్దాల మండపంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవను శుక్రవారం సాయంత్రం కోలాహలంగా నిర్వహించారు. పరమ పవిత్రంగా నిర్వహించే సేవలో మహిళా భక్తులు పాల్గొని తరించారు. ప్రధానార్చకుడు ఆధ్వర్యంలోని అర్చక బృందం వైభవంగా పూజలు నిర్వహించింది. ముత్తయిదువులు మంగళ హారతులతో అమ్మవారిని స్తుతిస్తూ పాటలు పాడి సేవ ముందు నడిచారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని అద్దాల మండపంలోని ఊయలలో శయనింపు చేసి గంట పాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ లాలిపాటలు పాడారు. స్వామి, అమ్మవార్లకు నిత్యరాధనలు ఘనంగా నిర్వహించారు.
సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పిన అర్చకులు తిరువారాధన, నిజాషేకాలతో స్వామివారి నిత్యారాధనలు ప్రారంభించారు. స్వామి వారికి సహస్రనామార్చన, లక్ష్మీ అమ్మవారికి కుంకుమార్చనలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. నారసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేసి, హారతి నివేదనలు అర్పించారు. సుమారు గంటన్నర పాటు సుదర్శన హోమంతో శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం చేశారు. అనంతరం దేవేరులను ముస్తాబు చేసి గజవాహన సేవ నిర్వహించారు.
ప్రతిరోజూ నిర్వహించే నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వీక్షించారు. అనంతరం నిర్వహించిన మొక్కు బ్రహ్మోత్సవ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. సాయంత్రం వేళ ఉభయ జోడు సేవలు, దర్బార్ సేవ నిర్వహించారు. రాత్రి నివేదన, శయనోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దీక్షాపరుల మండపంలో నిర్వహిస్తున్న సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వ్రతమాచరించారు. వివిధ విభాగాలను కలుపుకొని శ్రీవారి ఖజానాకు రూ.19,30,050 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామిని పలువురు ప్రముఖులు దర్శించున్నారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డితో పాటు ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా అడీషనల్ డిప్యూటీ కంప్ట్రోలర్, ఆడిట్ జనరల్ రాజ్వీర్ సింగ్, మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ ఏజీ రవిదాస్ పట్టార్, హైదరాబాద్ ఆడిట్ డైరెక్టర్ జనరల్ సీ.శైలజ, రాష్ట్ర డిప్యూటీ ఆడిట్ జనరల్ సంజయ్ కామినేని శుక్రవారం వేర్వేరుగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీకి ఆలయ అర్చకులు సంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు. దర్శన అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేయగా, ఆలయాధికారులు వారికి స్వామివారి ప్రసాదం అందించారు.
ప్రధాన బుక్కింగ్ ద్వారా 1,04,150
వీఐపీ దర్శనం 45,000
వేద ఆశీర్వచనం 6,000
సుప్రభాతం 3,700
ప్రచారశాఖ 26,250
వ్రత పూజలు 65,600
కళ్యాణకట్ట టిక్కెట్లు 19,400
ప్రసాద విక్రయం 6,39,050
వాహనపూజలు 14,600
అన్నదాన విరాళం 30,398
సువర్ణ పుష్పార్చన 71,948
లక్ష్మీ పుష్కరిణి 540
యాదరుషి నిలయం 35,392
పాతగుట్ట నుంచి 17,240
కొండపైకి వాహనాల అనుమతి 1,75,000
శివాలయం 1,800
లీసెస్, లీగల్ 4,03,372