నల్లగొండలోని మహాత్మ గాంధీ యూనివర్సిటీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ఎంజీయూ నుంచి జారీ చేసే వివిధ కోర్సుల సర్టిఫికెట్లకు నేషనల్ అకడమిక్ డిపాజిటరీ (ఎన్ఏడీ) స్కీమ్‌లో చోటు లభించింది. దాంతో ఇక్కడి సర్టిఫికెట్లను జాతీయ స్థాయిలో సైతం చూసుకునే అవకాశం కలిగింది. నకిలీ సర్టిఫికెట్లకు చెక్ పెట్టే వీలు కూడా ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ఏడీలోకి ప్రవేశించిన తొలి విశ్వవిద్యాలయం ఎంజీయూనే కావడం విశేషం. 2019-20 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల సర్టిఫికెట్లను వర్సిటీ పరీక్షల విభాగం అధికారులు ఎన్ఏడీలో అందుబాటులో ఉంచారు. ఎంజీయూలో చదివిన విద్యార్థులందరి సర్టిఫికెట్లను త్వరలోనే ఎన్ఏడీలో నమోదు చేస్తామని పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. దేశ, విదేశాల్లో వివిధ రంగాల్లో ఉద్యోగాలకు వెళ్లే ఎంజీయూ పూర్వ విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనున్నది.
రామగిరి, సెప్టెంబర్ 2 : భారత ప్రభుత్వ పరిధిలో ఉండే ‘నేషనల్ అకడమిక్ డిపాజిటరీ’ (ఎన్ఏడీ) స్కీమ్‌లో తెలంగాణ నుంచి చోటు దక్కించుకుని తొలి విశ్వవిద్యాలయంగా మహాత్మాగాంధీ యూనివర్సిటీ నిలిచింది. ఇప్పటికే ఎన్ఎస్ఎస్ అమలులో వర్సిటీ ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్‌గా పనిచేసిన డాక్టర్ ఆకుల రవి జాతీయస్థాయిలో ఎన్ఎస్ఎస్ అవార్డును అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా అందుకుని వర్సిటీ కీర్తిని చాటారు. అధ్యాపకులకు, విద్యార్థులకు బయో మెట్రిక్ హాజరుతో పాటు అత్యంత ఆధునిక టెక్నాలజీతో ఉన్న క్రీడాంశాల్లో ముందంజలో ఉన్న యూనివర్సిటీ ఏన్ఏడీలో చేరికతో మరో అడుగు ముందుకు వేసింది.
యూనివర్సిటీ పరీక్షల విభాగం జారీ చేసే సర్టిఫికెట్లను ఎన్ఏడీ స్కీమ్‌లో జత చేస్తారు. దీంతో దేశంలో ఎక్కడ ఉన్నా తమ సర్టిఫికెట్లు నేరుగా పొందడానికి లేదా జిరాక్స్‌లను తీసుకునేందుకు ఈ స్కీమ్ సహకరిస్తుంది. దీనిలో లాగిన్ అయి ఎన్ఏడీ అడిగిన వివరాలు, ఫీజును చెల్లిస్తే సర్టిఫికెట్స్ విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. ఈ విధానంతో విద్యార్థులు ఇక సర్టిఫికెట్లను స్కాన్ చేసుకోవడం, మెయిల్లో ఉంచుకోవాల్సి అవరసం ఉండదు. ప్రపంచంలో ఎక్కడికు వెళ్లినా సర్టిఫికెట్స్‌ను ఆయా సంస్థలు సులభంగా గుర్తు పట్టేందుకు అవకాశం ఉంటుంది.
2019-20 విద్యా సంవత్సరంలో వర్సిటీ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా వివిధ కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల సర్టిఫికెట్లను ఎన్ఏడీలో అందుబాటులోకి తెచ్చారు. త్వరలోనే ఎంజీయూ పరిధిలో పరీక్షల విభాగం ప్రారంభించిన నాటి నుంచి ఉత్తీర్ణులైన విద్యార్థుల సర్టిఫికెట్స్‌ను ఎన్ఏడీలో ఉంచేలా వీసీ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి, రిజిస్ట్రార్ టి.కృష్ణారెడ్డి, ఓఎస్డీ డాక్టర్ అల్వాల రవి, సీఓఈ డాక్టర్ మిర్యాల రమేశ్‌కుమార్ ప్రయత్నం చేస్తున్నారు.
ఎన్ఏడీ లాగిన్‌లో యూనివర్సిటీ నుంచి 2019-20లో ఉత్తీర్ణులైన విద్యార్థుల సర్టిఫికెట్లు అందుబాటులోకి తెచ్చాం. ఎన్ఏడీతో కలిసి జారీచేసే సర్టిఫికెట్స్ విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. ఇక్కడ చదివిన విద్యార్థులు జాతీయ స్థాయిలో ఎక్కడ ఉన్న వారికి కావాల్సిన సర్టిఫికెట్స్ పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఈ స్కీమ్‌లో చోటు దక్కించుకున్న యూనివర్సిటీ తెలంగాణలో మన ఎంజీయూనే కావడం చాలా సంతోషంగా ఉంది. విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా అందరి సహకారంతో ఎంజీయూను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– ప్రొఫెసర్ చొల్లేటి గోపాల్‌రెడ్డి, వీసీ, ఎంజీయూ
యూనివర్సిటీ పరిధిలో చదివిన విద్యార్థులు వ్యక్తిగతంగా గానీ, ఉద్యోగ అవకాశాలకు వెళ్లిన సందర్భాల్లో వారు చూపించిన సర్టిఫికెట్లు అసలువా? లేదా నకిలీవా అని తెలుసుకునేందుకు ఎన్ఏడీ ఉపయోగపడుతుంది. ఇందుకు ఆయా సంస్థలు కానీ, విద్యార్థి కానీ ఎన్ఏడీ స్కీమ్ ద్వారా లాగినై వారడిగిన వివరాలను, సెక్యూరిటీ డిపాజిట్‌ను చెల్లించినట్లయితే వివరాలు అందుబాటులోకి వస్తాయి.
సర్టిఫికెట్స్‌పై ఉన్న హాల్‌టికెట్ నంబర్, విద్యార్థి పేరు, తండ్రి పేరు, కోర్సు నమోదు చేయగానే ఏ సంవత్సరంలో చదివారు, ఎప్పుడు ఉత్తీర్ణత సాధించారు, సర్టిఫికెట్ జారీ అయిన తేదీ తదితర అంశాలు ఓపెన్ అవుతాయి. ఒకవేళ ఆ సర్టిఫికెట్ నకిలీదైతే ఈ వివరాలేవి కనిపించవు. దీంతో నకిలీ సర్టిఫికెట్లుగా తేలిపోనుంది.
దేశంలోని వివిధ యూనివర్సిటీలు, రాష్ట్ర, జాతీయస్థాయి ఇనిస్టిట్యూషన్ల నుంచి వివిధ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థుల సర్టిఫికెట్లను జాతీయస్థాయిలో అమలు చేసేందుకు ‘నేషనల్ అకాడమిక్ డిపాజిటరి’ (ఎన్ఏడీ), సెంట్రల్ డిపాజిటరీ లిమిటెడ్ అనే ప్రభుత్వరంగ సంస్థలకు బాధ్యతలు అప్పగించింది. అయితే ఈ సంస్థల్లో రిజిస్ట్రేషన్ అయిన యూనివర్సిటీలు విద్యార్థులకు జారీ చేసే సర్టిఫికెట్లను ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా అవి యూనివర్సిటీ జారీ చేసిన సర్టిఫికెట్లా? లేక నకిలీవా అని తెలిపేందుకు ప్రత్యేక లాగిన్ ద్వారా వివరాలు అందజేస్తాయి. దీనిలో ఎంజీయూ చోటుదక్కడంతో ఇక ఇక్కడ జారీ చేసే సర్టిఫికెట్లన్నింటికీ జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది.