ఉమ్మడి నల్లగొండలో రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డులకు 9 మంది ఉపాధ్యాయులను ప్రభుత్వం ఎంపిక చేసింది. పాఠాల బోధనతోపాటు సేవా కార్యక్రమాలు, పాఠశాల అభివృద్ధి, విద్యార్థులను వివిధ అంశాల్లో భాగస్వామ్యం చేయడంలో ఎంపికైన ఉపాధ్యాయులు ఎంతో తోడ్పాటునందించారు. ఎంపికైన ఉపాధ్యాయులకు జిల్లా వ్యాప్తంగాఅధికారులు, ఉపాధ్యాయులు, పలువురు అభినందనలు తెలిపారు. బోధనతోపాటు సేవా దృక్పథం అనితారెడ్డికి వరించిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
నకిరేకల్, సెప్టెంబర్ 2 : నకిరేకల్ మండలం చందుపట్ల బాలికల ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న కడారి అనితారెడ్డి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. 1996 నుంచి ఆమె ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధిస్తూనే నిరుపేద విద్యార్థులకు దాతల సహకారంతో బ్యాగులు, పెన్సిళ్లు, పెన్నులు, నోటు బుక్స్ ఇప్పించేవారు. చందుపట్ల పాఠశాలకు వచ్చిన కొత్తలో స్కూలుకు గేటు కూడా లేని పరిస్థితి.
వర్షం వస్తే నీళ్లు నిలవడంతో ఇబ్బందిగా ఉండేది. దాంతో ఆమె దాతలు, గ్రామపంచాయతీ సిబ్బంది సహకారంతో గేటు, కిచెన్ షెడ్ వేయించారు. గోడలపై గాంధీ, నెహ్రూ, ఇండియా మ్యాప్ లాంటి ఎన్నో చిత్రాలను పెయింటింగ్ రూపంలో వేయించారు. ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన సందర్భంగా నమస్తే తెలంగాణతో అనితారెడ్డి మాట్లాడారు. ‘దేవుడి దయ వల్ల తమ కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు లేవు. ప్రతి సంవత్సరం వచ్చిన జీతంలో కొంత భాగం పిల్లలకు అవసరమైన నోట్ బుక్స్, పెన్నులు లాంటివి అందిస్తున్నా. దాతల సహకారంతో చందుపట్ల పాఠశాలను చక్కగా తీర్చిదిద్దాం. ఈ అవార్డుతో నా జీవితం సార్థకమైంది. చాలా సంతోషంగా ఉంది’ అని తెలిపారు.
మోతె : పుట్టి పెరిగిన ఊరు, తాను చదువుకున్న పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నారు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన టి.సత్యనారాయణ రెడ్డి. మోతె మండలం నరసింహాపురం ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా సత్యనారాయణ రెడ్డి పనిచేస్తూ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. దాతల సహకారంతో పాఠశాల భవనం నిర్మించారు. బెంచీలు, ఆట వస్తువులు, ఆర్ఓ వాటర్ ప్లాంట్, జిరాక్స్ మిషన్, కంప్యూటర్, మైక్ సెట్, బీరువా వంటి వస్తువులు అందేలా చూశారు.
‘మీ పిల్లలకు చదువు రాకపోతే నేనే పూర్తి బాధ్యుడిని’ అని పిల్లల తల్లిదండ్రులకు హామీ ఇచ్చి విద్యార్థుల సంఖ్యను 73మందికి పెంచారు. విద్యార్థులకు నాణ్యమైన బోధనతోపాటు ఈ పాఠశాల నుంచి గురుకులాలకు ప్రత్యేక తరగతులు నిర్వహించి ప్రతిసంవత్సరం 10 స్వీట్లకు తగ్గకుండా ఎంపికయ్యేలా చూస్తున్నారు. విద్యార్థులకు వ్యాస రచన పోటీలు, ఆటలు నిర్వహించి విద్యార్థులను ఉత్సాహ పరుస్తున్నారు. పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం తనవంతు సహకారం చేస్తున్నారు.
పెన్‌పహాడ్ : మండలంలోని అనంతారానికి చెందిన మామిడి వెంకటయ్య ఇదే మండలంలోని పొట్లపహాడ్ ఎంపీయూపీఎస్‌లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. వృత్తి పట్ల అంకిత భావం, విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు కృషి చేయడంతో ఆయన రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డుకు ఎంపికయ్యారు. నేరేడుచర్ల మండలం ముకుందాపురం, ఎల్లారం పాఠశాలలో పనిచేశారు. పొట్లపహాడ్లో విధులు నిర్వహిస్తుండగా మండల, జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్నారు.
ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇంటింటికీ వెళ్లి విద్యార్థులు పాఠశాలలో చేరే విధంగా కృషి చేశారు. పాఠశాలలో పరిశుభ్రత, మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకున్నారు. తన సొంత ఖర్చులతో పాఠశాలలో వసతులు కల్పించడంతోపాటు విద్యార్థులకు పోటీ పరీక్షలకు కావాల్సిన పుస్తకాలు అందించారు. విద్యార్థుల్లో పోటీ తత్వం పెరిగేలానగదు బహుమతులు ఇచ్చారు. అనేక సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములై ప్రత్యేక గుర్తింపు సాధించారు. ఉత్తమ అవార్డుకు ఎంపిక కావ డంపై మండల ఉపాధ్యాయులు, అనంతారం, పొట్లపహాడ్ గ్రామస్తులు అభినందనలు తెలిపారు.
టెక్స్ బుక్స్‌లో రెండు భాషల్లో పాఠాల రూపకల్పన
అడ్డగూడూరు : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న చింతమళ్ల భరణీకుమార్ రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ఆయన స్వగ్రామం ఆలేరు మండలం గుండ్లగూడెం గ్రామం. ఆయన 2008లో మోటకొండూరు మండలం మాటూరులో జడ్పీహెచ్ఎస్లో ఎస్జీటీగా ఉద్యోగంలో చేరారు. 2009 నుంచి రాజాపేట మండలం దూదివెంకటాపూర్ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్లో, 2018 నుంచి అడ్డగూడూరులో జడ్పీహెచ్ఎస్లో ఫిజికల్ సైన్స్ బోధిస్తున్నారు. డీఈఓ కార్యాలయంలో జిల్లా సైన్స్ అధికారిగా కూడా పనిచేస్తున్నారు.
జిల్లా సైన్స్ అధికారిగా ఇన్స్పైర్, సైన్స్ ఫెయిర్‌లో విద్యార్థులను జాతీయ స్థాయి ఎంపికకు కృషి చేశారు. స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్‌లో జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో రావడానికి తోడ్పడ్డారు. ఇంటింటా ఇన్నోవేషన్ కార్యక్రమంలో జిల్లాను రాష్ట్ర స్థాయిలో ముందు నిలుపడంలో విద్యార్థులను ప్రోత్సహించారు. భౌతిక రసాయన శాస్త్రంలో రాష్ట్ర రీసోర్స్ పర్సన్‌గా ట్రైనింగ్‌లు ఇచ్చారు.
పలు మాడ్యూల్స్, ప్రశ్నపత్రాలు, టెక్స్బుక్స్లలో రెండు భాషల్లో పాఠాల రూప కల్పనకు కృషి చేశారు. యునిసెఫ్ ద్వారా ఐసీటీలో ట్రైనింగ్ పొంది డిజిటల్ క్లాస్‌లో రాష్ట్ర రీసోర్స్ పర్సన్‌గా శిక్షణ ఇచ్చారు. కొవిడ్ సమయంలో ప్రభుత్వ టీవీ టీశాట్, డీడీ యాదగిరిలో డిజిటల్ తరగతులు చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి సైన్స్ ఫెస్టివల్, వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు.
చిలుకూరు : 24 సంవత్సరాల నుంచి పిల్లల అభ్యున్నతే లక్ష్యంగా పని చేస్తున్నారు ఉపాధ్యాయుడు రామారావు. చిలుకూరు మండలం జడ్పీహెచ్ఎస్లో ఫిజికల్ సైన్స్ పాఠాలు చెప్తూ ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. విద్యార్థులను ప్రతి సంవత్సరం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్‌నకు జిల్లా నుంచి అత్యధిక మందిని ఎంపిక చేయడంలో ఆయన కృషి చేస్తున్నారు.
10వ తరగతి ఫలితాల్లో 100 శాతం ఫలితాలు తీసుకురావడం, విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పించడంలో ఆయన ముందుంటారు. తన యూట్యూబ్ చానల్ ద్వారా వందల మంది విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్, ఎన్టీఎస్సీ క్లాసులు బోధిస్తున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వ చానల్ టీ-షాట్లో కూడా బోధించారు. రామారావు ఉత్తమ అవార్డుకు ఎంపిక కావడంతో పలువురు అభినందించారు.
చండూరు : మండలంలోని తెరట్పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఉదావత్ లచ్చిరామ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. లచ్చిరామ్ స్వస్థలం సంస్థాన్ నారాయణపురం మండలం పోర్లగడ్డతండా. లచ్చిరామ్ చిన్నతనం నుంచే పట్టుదలతో చదివేవారు. ఏ పని చేపట్టిన విజయం సాధించేంత వరకూ విశ్రమించేవారు కాదు. పాఠశాల హరితహారంలో నాటిన మొక్కలకు రోజూ నీళ్లుపోయించి పెరిగే విధంగా కృషి చేశారు.
పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన అందించడంలో ప్రధాన పాత్ర పోషించారు. విద్యార్థులు గురుకుల, నవోదయ విద్యాలయాల్లో సీట్లు పొందే విధంగా శిక్షణ ఇచ్చారు. వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించారు. విద్యార్థుల సృజనాత్మకను వెలికితీసి వివిధ పోటీల్లో పాల్గొనేలా ప్రేరణ ఇచ్చారు. సైన్స్‌పై అవగాహన పెంపొందించి సైన్స్‌ఫెయిర్‌లో విద్యార్థులు పాల్గొనేలా తీర్చిదిద్దారు.
బడిబాట కార్యక్రమంలో వినూత్న రీతిలో ప్రచారం చేసి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగేలా కృషి చేశారు. విద్యార్థులకు చిత్రలేఖనం, కంప్యూటర్ విద్య అందించడంతోపాటు బాలికా చేతన కార్యక్రమాలు నిర్వహించారు. కరోనా సమయంలో విద్యార్థులతో మాస్కులు తయారు చేయించి కరోనాపై అవగాహన కల్పించారు. లచ్చిరామ్ అవార్డుకు ఎంపిక కావడంపై ఉపాధ్యాయ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలతోపాటు ఉపాధ్యాయులు, తెరట్పల్లి గ్రామస్తులు అభినందనలు తెలిపారు.