సూర్యాపేట అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల-2లో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న అంకతి వెంకన్న ఎంపికయ్యారు. ఆయన 1996లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. 2002లో స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది ఫిజికల్ సైన్స్ పాఠాలను బోధిస్తున్నారు. విద్యార్థులకు ప్రయోగాల ద్వారా సులభంగా అర్థమయ్యే పద్ధతిలో పాఠాలు చెబుతున్నారు. అనేక విషయ సంబంధిత కరదీపికల తయారీలో కీలక పాత్ర పోషించారు.
జిల్లా, రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ కార్యక్రమాల్లో విద్యార్థులను భాగస్వామ్యం చేయడంలో ముందున్నారు. విద్యార్థులకు సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు దాతల సహకారంతో పాఠశాలలో ఎల్ఈడీ టీవీలను ఏర్పాటు చేయించారు. మంచి నీటి వాటర్ ప్లాంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. స్కూల్ విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ స్కాలర్ షిఫ్ పొందే విధంగా చేస్తున్న సేవలు మరువలేనివి. జిల్లా స్థాయిలో సైన్స్‌పై నిర్వహించిన కార్యక్రమంలో జీఎస్ఎల్వీ మోడల్ అందరినీ ఆకట్టుకున్నది.
సాంకేతిక ప్రగతి, సైన్స్ అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రస్తుతం వృత్తితోపాటు జనవిజ్ఞాన వేదిక, విజ్ఞాన భారతి, అన్వేషిక వంటి పలు శాస్త్ర ప్రచార సంస్థల్లో పని చేస్తున్నారు. ఈ సందర్భంగా వెంకన్నను జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ అభినందనలు తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయులను స్ఫూర్తిగా తీసుకుని రానున్న రోజుల్లో ఎక్కువ మంది ఉపాధ్యాయులు అవార్డులకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. అవసరమైన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు.