సూర్యాపేట టౌన్, సెప్టెంబర్ 1 : ‘తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు యావత్ దేశానికే ఆదర్శం. రాష్ట్రంలో 60 శాతం కుటుంబాలు ఆసరా పింఛన్లు
పొందుతున్నాయి. గొప్పలకు పోయే ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో పింఛన్లు పొందుతున్న కుటుంబాలు 20 శాతమే’నని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఆసరా పింఛన్లను పెన్‌పహాడ్, చివ్వెంల మండలాల లబ్ధిదారులకు గురువారం జిల్లా కేంద్రంలో మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాతికేండ్లు బీజేపీ ఏలుబడిలో ఉన్న మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో వృద్ధులకు ఇస్తున్న పింఛన్ 750 రూపాయలు మాత్రమేనని,
అదే పార్టీ అధికారంలో ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఇచ్చే పింఛన్ కేవలం 600 రూపాయలని తెలిపారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు రూ.2,016, దివ్యాంగులకు రూ.3,016 పింఛన్ ఇస్తున్నది ఒక్క తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని స్పష్టం చేశారు. డబుల్ ఇంజన్ పేరుతో రాజకీయం వెలుగబెడుతున్న బీజేపీకి తెలంగాణ సర్కారు అందిస్తున్న ఫింఛన్లు ట్రబుల్ ఇస్తున్నాయని ఎద్దేవా చేశారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో జనం ఎక్కడ నిలదీస్తారోనన్న భయం ఆ పార్టీ నాయకులను వెంటాడుతున్నదని మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు.