మర్రిగూడ, సెప్టెంబర్ 1 : మునుగోడు నియోజకవర్గవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీలోకి వలసల వెల్లువ కొనసాగుతున్నది. రాష్ర్టాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్‌కు మద్దతుగా కాంగ్రెస్, బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులు గులాబీ కండువాలు కప్పుకొంటున్నారు. గురువారం మర్రిగూడ మండలంలో కాంగ్రెస్ పార్టీకి చెంది యరుగండ్లపల్లి, అజ్జలాపురం, తిరుగండ్లపల్లి సర్పంచ్, కిష్టాపురం గ్రామస్తులు 50 మంది రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
దామెరభీమనపల్లి, కమ్మగూడెం, భోజ్యాతండా, భీమ్లాతండాకు చెందిన 30 కాంగ్రెస్ కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో చేరాయి. నాంపల్లి మండలంలోని రావికుంట తండాకు కాంగ్రెస్ నాయకులు 60 మంది, జాన్‌తండా గామ శాఖ అధ్యక్షుడు మెగావత్ యాదగిరితోపాటు మరో 20 మంది కార్యకర్తలు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్యెల్యే కూసుకుంట్ల సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు.
సూర్యాపేట టౌన్, సెప్టెంబర్ 1 : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని, రాష్ట్ర జనాభాలో 60 శాతం కుటుంబాలు ఆసరా పింఛన్లు పొందుతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో పెన్‌పహాడ్, చివ్వెంల మండలాల లబ్ధిదారులకు కొత్త పింఛన్ కార్డులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గప్పాలు చెప్పుకునే ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో ఆసరా పింఛన్లు పొందుతన్నది కేవలం 20 శాతం కుటుంబాలు మాత్రమేనని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడ తిరుగబాటు వస్తుందోననే మీమాంస వారిని వెంటాడుతుందని, అందుకే సీఎం కేసీఈఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు కేంద్రం కిందా, మీదా పడుతుందని దుయ్యబట్టారు. బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు కాకుండా అడ్డుకోవడం, కేంద్రం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడం చేస్తుందని మండిపడ్డారు.
అయినా వెనక్కి తగ్గకుండా కొత్తగా 10 లక్షల మందితో కలుపుకొని మొత్తం 46 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అంతేకాకుండా రుణమాఫీ పేరుతో రూ.25 వేల కోట్ల పంట రుణాలు మాఫీ చేసిన చరిత్ర మన ముఖ్యమంత్రిదే అని అన్నారు. రాష్ట్రంలోని రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు ఇస్తుంటే, గుజరాత్లో కేవలం 6 గంటలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు.
ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందరూ అండగా నిలువాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ హేమంత్ కేశవ్‌పాటిల్, జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగంధర్‌రావు, డీఆర్డీఓ కిరణ్‌కుమార్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు, సింగిల్ విండో చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.