
పిల్లల్ని ఇంగ్లిష్ మీడియం చదివించాలన్న నిరుపేద తల్లిదండ్రుల కల నెరవేరబోతున్నది. ఏండ్ల తరబడి కునారిల్లుతున్న పాఠశాలలకు మహర్దశ పట్టనున్నది. పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నట్లుగా సర్కారు బడి సరికొత్త హంగులు అద్దుకుంటున్నది. వేల కోట్ల రూపాయలతో మౌలిక వసతులు, పైసా ఖర్చు లేకుండా ఇంగ్లిష్ మీడియంలో బోధన.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మన ఊరు.. మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు విజ్ఞాన వెలుగులు పంచనున్నాయి.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతీదీఇంగ్లిష్తో ముడిపడి ఉన్నది. ఆ కారణంతోనే నిరుపేదలు సైతం తలకు మించిన భారమైనా అప్పులు చేసి మరీ పిల్లల్ని ఇంగ్లిష్ మీడియం చదివిస్తున్నారు. వేలకు వేలు ఫీజులు చెల్లిస్తూ ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతంతోపాటు ఇంగ్లిష్ మీడియం బోధించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమాన్ని అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయి.
రామగిరి, జనవరి 23 : పాఠశాలలకు సర్కారు జీవం పోస్తున్నది. మాతృభాషతోపాటు ఆంగ్లం
అనివార్యమైన నేటి తరుణంలో ఎంతో మంది తల్లిదండ్రులు ఆర్థిక భారమైనా ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారు. మరికొందరు స్థానిక పాఠశాలల్లోనే చదివిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దాంతో తల్లిదండ్రులు, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నాయకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
మన ఊరు.. మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కానున్నాయి. ఇప్పటికే ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం అందుతుండగా ఇక మీదట ఆంగ్ల మాధ్యమంతో అడ్మిషన్లు పెరుగనున్నాయి. వెరసి ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం రానున్నది. ప్రస్తుతం గురుకులాలు, కేజీబీవీల్లో మాత్రమే అంగ్ల మాధ్యమం కొనసాగుతుండగా ఇకమీదట ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 3,122 సర్కారు పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం అందుబాటులోకి రానున్నది. సొంతూళ్లోనే ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తుండడంతో పేదలపై ఆర్థిక భారం తగ్గనున్నది.
ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ..
రాష్ట్ర ఏర్పాటుకు ముందు 2012 సంవత్సరంలో సక్సెస్ స్కూళ్ల పేరుతో ఆంగ్ల మాధ్యమం ప్రారంభించినప్పటికీ క్షేత్రస్థాయిలో విఫలమయ్యారు. ప్రస్తుతం మౌలిక సౌకర్యాలు కల్పించడంతో పాటు ఉపాధ్యాయులకు సైతం ప్రత్యేకంగా శిక్షణ అందించనున్నారు. ఇంగ్లిష్ మీడియం బోధనకు అవసరమైన పాఠ్య పుస్తకాల ముద్రణ ప్రారంభిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి 3,122 పాఠశాలల్లో…
ప్రస్తుతం గురుకులాలు, కేజీబీవీల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తుండగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 3,122 పాఠశాలల్లోనూ అందుబాటులోకి వస్తుంది. నల్లగొండ జిల్లాలో 1,489, సూర్యాపేట జిల్లాలో 909, యాదాద్రి భువనగిరి జిల్లాలోని 724 పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభం కానున్నది. అందుకు అవసరమైన మౌలిక వసతులు కూడా కల్పిస్తున్నారు.
ఆంగ్ల మాధ్యమంతో ఎంతో మేలు..
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించనున్న ఇంగ్లిష్ మీడియం బోధనతో అన్ని రకాలుగా మేలు జరుగనున్నది. ప్రైవేటు పాఠశాలలతో పోలిస్తే ఫీజుల భారం ఉండదు. యూనిఫాం, పరీక్ష ఫీజులకు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఉచితంగా యూనిఫాం, పాఠ్యపుస్తకాలు అందుతాయి. మౌలిక వసతులు, ఆట స్థలం, తాగునీటి వసతి కల్పిస్తారు. నిపుణులైన ఉపాధ్యాయులు బోధిస్తారు. దాంతో ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు రూ.7వేల నుంచి 50వేల వరకు ఆదా అయినట్లే. ప్రభుత్వ నిర్ణయంతో పేదలైన తల్లిదండ్రులపై ఆర్థిక భారం తొలగిపోనున్నదని విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లోనూ ఇంగ్లిష్ మీడియం అందుబాటులోకి రానుండడంపై సామాజిక వేత్తలు, విద్యార్థి సంఘాల నాయకులు స్వాగతిస్తున్నారు.
ఆదరణ తగ్గిన సక్సెస్ స్కూల్స్…
కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో 2012 సంవత్సరంలో రాష్ర్ట వ్యాప్తంగా సక్సెస్ స్కూల్స్ పేరుతో హైస్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 568 ఉన్నత పాఠశాలుండగా వాటిలో 312 స్కూళ్లలో ప్రవేశపెట్టారు. కానీ, ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వకపోవడం, సరైన పాఠ్య పుస్తకాలు లేకపోవడం, పర్యవేక్షణ లోపించడంతో లక్ష్యం అందుకోలేకపోయారు. ఇప్పటికీ నల్లగొండ జిల్లాలో 87, సూర్యాపేటలో 32, యాదాద్రిలో 18 పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం కొనసాగుతన్నట్లు విద్యాశాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
కారణాలివే..
అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ స్కూల్స్‌లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించినా కొనసాగించడంలో విఫలమైంది.
ఆంగ్లమాధ్యమం బోధనపై ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వకపోవడంతోపాటు మాడ్యూల్స్‌ను అందించలేకపోయింది.
విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలను సకాలంలో అందించలేదని పలువురు పేర్కొంటున్నారు.
ఆంగ్ల మాధ్యమంపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించకపోవడం.
మన ఊరు.. మన బడిని స్వాగతిస్తున్నాం..
ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఇంగ్లిష్ మీడియం బోధించడాన్ని స్వాగతిస్తున్నాం. ఈ కార్యక్రమంతో ప్రత్యేకంగా నిధులు కేటాయించడాన్ని గమ నిస్తే విద్యారంగ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌కు ఉన్న పట్టుదల స్పష్టమైంది. వాస్తవానికి పేద, బడుగు, బలహీనవర్గాల తల్లిదండ్రులు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో అత్యధిక ఫీజులు చెల్లించలేక తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియం చదివించలేకపోతున్నారు. ఈ క్రమంలో పేద పిల్లలు సైతం ఇంగ్లిష్ మీడియం చదివేలా సంస్కరణలు తీసుకురావడం అభినందనీయం,
ప్రభుత్వ నిర్ణయం పేదల పిల్లలకు వరం…
నేటి కాలంలో ఆంగ్లభాష , ఆంగ్లమాధ్యమం ప్రాధాన్యత పెరిగింది. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలుగుతో పాటు ఇంగ్లిష్ మీడియంను అందుబాటులోకి తెస్తుండటం పేద విద్యార్థులకు వరం. మా ఊరిబడిలో గ్రామస్తుల కోరికమేరకు విద్యాశాఖ అధికారుల అనుమతితో ఇంగ్లిష్ మీడియం చదువులు కొనసాగిస్తున్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసేలా చర్యలు తీసుకుంటుండం చాలా సంతోషం. బడుగు, బలహీన వర్గాల తల్లిదండ్రులకు తమ పిల్లలను ఉచితంగా ఇంగ్లిష్ మీడియం చదివించే అవకాశం వచ్చింది.