హాలియా, ఆగస్టు 30 : నాగార్జున సాగర్ ఎడమ కాల్వ కింద వరినాట్లు చివరి దశకు చేరుకున్నాయి. ఈనెల మొదటివారంలో ప్రారంభమైన వరినాట్లు నెలాఖరుకు నూటికి 80 శాతం వరి నాట్లు పూర్తికాగా మరో వారం, పది రోజుల్లో మిగిలిన 20శాతం పూర్తయ్యే అవకాశం ఉన్నది.
3.8 లక్షల ఎకరాల్లో వరిసాగు
నాగార్జున సాగర్ ఎడమ కాల్వ కింద ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 2 లక్షల 99 వేల ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తుండగా ఎడమ కాల్వ పరిధిలోని లిఫ్ట్‌ల కింద మరో 82 వేల ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవడంతో నాగార్జునసాగర్ జలాశయం త్వరగా నిండింది. దాంతో ప్రభుత్వం ఈ ఏడాది ముందుగానే ఎడమ కాల్వకు సాగునీటిని విడుదల చేయగా ఆయకట్టు ప్రాంతంలో రైతులు వరినాట్లలో తలమునకలై ఉన్నారు.
కూలీల కొరతతో ఆర్థికభారం..
సాగర్ ఎడమ కాల్వ కింద వరినాట్లకు కూలీల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. నాట్లు వేసేందుకు కూలీలు దొరకకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూలీలు సైతం రేట్లను పెంచేశారు. గత ఏడాది రోజుకు 4 నుంచి 5 వందల రూపాయలు తీసుకుంటే ఈ ఏడాది 7 నుంచి 8 వందలు ఇస్తామన్నా కూలీలు దొరకని పరిస్థితి. వరినాట్ల కోసం కూలీలను దూరప్రాంతాల నుంచి తీసుకురావాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. కూలీతోపాటు ఆటో కిరాయి కూడా చెల్లించాల్సి వస్తుండటంతో రైతులపై ఆర్థిక భారం పడుతున్నది.
కూలీల కొరత తీవ్రంగా ఉంది..
వరినాటు వేసేందుకు కూ లీలు దొరకడం లేదు. ప్రభు త్వం ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసిన తర్వాత రైతులంతా ఒకేసారి నారు పోసుకోవడంతో పొలాలు అన్నీ ఒకేసారి వరినాటుకు వచ్చాయి. దాంతో కూలీల కొరత తీవ్రంగా ఉన్నది. వరినాటు వేయించుకునేందుకు రోజుల తరబడి కూలీల ఇండ్ల చుట్టూ తిరగాల్సి వస్తున్నది.
– మండలి శ్రీనివాస్, రైతు, బోయగూడెం, హాలియా మండలం