నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్ (నార్మూల్) పాడి రైతులకు శుభవార్త చెప్పింది. గత ఏడాది ప్రమాణ స్వీకారం చేసిన ఆ యూనియన్ పాలకవర్గం ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక సారి ధరలు పెంచగా.. ప్రభుత్వ సూచన మేరకు మరోసారి పాలతో పాటు వెన్న రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు గురువారం నుంచి అమల్లోకి రానున్నట్లు నార్మూల్ పాలకవర్గం మంగళవారం 465వ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంది. గేదె పాలకు వెన్న శాతాన్ని బట్టి రూ.3.96 నుంచి రూ.6.60కి, ఆవు పాలకు రూ.5 నుంచి రూ.5.59కి పెంచుతూ పాలకవర్గం తీర్మానించింది. గేదె వెన్న కిలో రూ.66 పెంచగా, ఆవు వెన్న రూ.43 పెంచారు.
పాలతోపాటు వెన్న రేట్లు పెంపు..
పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటిన పాలు, వెన్న ధరలు పెంచిన నార్మూల్ సంస్థ.. రైతుల కోరిక మేరకు మరోసారి ధరలు పెంచుతున్నట్లు నిర్ణయించింది. గతంలో ఉన్న రేట్లను సవరిస్తూ ప్రస్తుతం పెంచిన రేట్లతో ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రస్తుతం గేదె పాలు ఆరు శాతం పైన ఫ్యాట్ ఉంటే లీటరుకు రూ.34.20 చెల్లిస్తున్నారు. దాన్ని ఇప్పుడు రూ.39.20కి పెంచారు. పది శాతం పైన ఫ్యాట్ ఉంటే రూ.74.40 నుంచి 79.99కి పెంచుతూ నార్మూల్ నిర్ణయం తీసుకుంది. మూడు శాతం పైన ఫ్యాట్ ఉన్న ఆవు పాలకు లీటరుకు రూ.30.71 నుంచి రూ.35.71కి పెంచారు. ఐదు శాతం పైన ఫ్యాట్ ఉంటే రూ.34.71 నుంచి రూ.40.30కి పెంచారు. గేదె పాల నుంచి తీసే వెన్న ధర కిలో రూ.690 నుంచి 756 రూపాయలకు పెంచగా.. ఆవు వెన్నకు కిలోకు రూ.270 నుంచి 313 రూపాయలకు పెరిగింది.
ఏడాదిలోనే రెండు సార్లు ధరల పెంపు..
రాష్ట్ర ప్రభుత్వం చొరవతో పాడి రైతులకు నార్మూల్ సంస్థ ద్వారా ఈ ఏడాదిలోనే రెండు సార్లు ఆవు, గేదె పాలతో పాటు వెన్న రేట్లు పెరిగాయి. సాధారణంగా ఆవు పాల కంటే గేదె పాలల్లో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది ఆరంభంలో లీటరుకు ఐదు శాతం ఫ్యాట్ ఉంటే రూ.32.20, పది శాతం ఉంటే రూ.68.40 ఇచ్చేవారు. దాన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐదు శాతం నుంచి పది శాతం వరకు పెంచి గత రేట్ల కంటే రెండు రూపాయలు అదనంగా ఇస్తున్నారు. పది శాతానికి మించితే ఆరు రూపాయల వరకు చెల్లిస్తున్నారు. ఆవు పాలల్లో మూడు నుంచి 4.5 వరకు వెన్న శాతం ఉంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరికి ముందు మూడు శాతం ఉంటే లీటరుకు రూ.28.11 ఇవ్వగా ఫిబ్రవరిలో రూ.2.60 పెంచి రూ.30.71 ఇస్తున్నారు. వెన్న శాతం 4.5పైన ఉంటే లీటరుకు రూ.31.50, దానికి మరో రూ.3.20 కలిపి రూ.34.71 చెల్లిస్తున్నారు. తాజాగా పెరిగిన ధరలు ఈ సెప్టెంబర్ నుంచి అమలు చేయనున్నారు. దాంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నార్మూల్ సంస్థ పరిధిలో ఉన్న 35,250 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది.
పెరిగిన రేట్లు రేపటి నుంచి అమల్లోకి వస్తాయి..
రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు నార్మూల్ రైతులకు ఈ సెప్టెంబర్ ఒకటి నుంచి పాలు, వెన్న ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతం గేదె పాలు ఆరు శాతం పైన ఫ్యాట్‌కు లీటరుకు రూ.34.20 చెల్లిస్తుండగా.. తాజాగా రూ.39.20కి పెరుగనుంది. 10 శాతం పైన ఫ్యాట్‌కు రూ.74.40 నుంచి 79.99 రూపాయలకు పెంచాం. ఆవు పాలు మూడు శాతం పైన ఫ్యాట్ ఉంటే లీటరుకు రూ.30.71 ఉండగా.. రూ.35.71గా నిర్ణయించాం. ఐదు శాతం పైన ఫ్యాట్ ఉన్న ఆవు పాలకు రూ.34.71 నుంచి రూ.40.30కి పెంచాలని నిర్ణయం తీసుకున్నాం. గేదె వెన్నకు కిలో రూ.690 నుంచి 756కు, ఆవు వెన్నకు రూ.270 నుంచి 313 రూపాయలకు పెంచుతూ నార్మూల్ పాలకవర్గం తీర్మానం చేసింది.
– గంగుల కృష్ణారెడ్డి, నార్మూల్ చైర్మన్