జిల్లాలో రైల్వే స్టేషన్లు పేరుకే పరిమితమయ్యాయి. చెప్పుకోవడానికే తప్ప ప్రయాణికులకు మాత్రం ఉపయోగపడటంలేదు. జిల్లా మీదుగా నిత్యం వందల సంఖ్యలో రైళ్లు వెళ్తున్నా పట్టుమని పది రైళ్లు కూడా ఆగని పరిస్థితి. ఆయా స్టేషన్లలో హాల్ట్‌లు పెట్టాలని ఏండ్ల తరబడి వినతులు సమర్పిస్తున్నా రైల్వే శాఖ పట్టించుకోవడం లేదు. స్టేషన్‌కు సమీపంలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆధ్యాత్మిక క్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉన్నా రైళ్లు ఆగకుండా వెళ్లిపోతున్నాయి. రాయగిరి స్టేషన్‌కు యాదాద్రి అనే పేరు మార్చి చేతులు దులుపుకొన్నారు. నిత్యం వేల మంది విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు జిల్లా నుంచి హైదరాబాద్‌కు వివిధ పనుల నిమిత్తం వెళ్తుంటారు. రైలు సదుపాయం లేకపోవడంతో ఇతర మార్గాలను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు రైల్వేస్టేషన్లు అస్తవ్యస్తంగా మారాయి. సరైన నిర్వహణ లేకపోవడంతో అధ్వానంగా తయారయ్యాయి. స్టేషన్లలో ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు తాళాలు వేసి కనిపిస్తున్నాయి. నీటి సౌకర్యం అంతంత మాత్రంగానే ఉన్నది. మురుగునీటి నిల్వలతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. కొన్ని స్టేషన్లలో ఏకంగా కంపచెట్లు పెరిగి దర్శనమిస్తున్నాయి. ప్రధాన స్టేషన్లు అయిన భువనగిరి, ఆలేరు, బీబీనగర్, వలిగొండలోనూ ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పందించి వెంటనే అందుబాటులో ఉన్న రైళ్లను ఆపడంతోపాటు స్టేషన్ల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు.
భువనగిరి కలెక్టరేట్, ఆగస్టు 29 : జిల్లా మీదుగా నిత్యం అనేక రైళ్లు వెళ్తున్నా.. ప్రధాన స్టేషన్లలో చాలా వరకు ఆగని పరిస్థితి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలోని భువనగిరితోపాటు యాదాద్రి, నాగిరెడ్డిపల్లి రైల్వేస్టేషన్ల నుంచి నిత్యం హైదరాబాద్‌తోపాటు దేశంలోని పలు ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు వెళ్తుంటారు. అయితే.. ప్రయాణికుల రద్దీ మేరకు రైళ్లు ఆగకపోవడంతో ఇతర మార్గాలను ఎంచుకుంటున్నారు. అదేవిధంగా స్టేషన్లలో సౌకర్యాలు సరిగా లేకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ప్రయాణికుల అవసరం మేరకు యాదాద్రి రైల్వేస్టేషన్లో ప్రస్తుతం నడుస్తున్న రైళ్లతోపాటు పద్మావతి ఎక్స్‌ప్రెస్, నాగిరెడ్డిపల్లిలో నారాయణాద్రి, భువనగిరిలో శాతవాహన, మచిలీపట్నం, కోణార్క్, పద్మావతి తదితర రైళ్లను ఆపాలని ప్రయాణికులు, ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
రాష్ట్ర రాజధానికి కూత వేటు దూరంలో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని భువనగిరి, నాగిరెడ్డిపల్లి, యాదాద్రి రైల్వేస్టేషన్లలో పలు రకాల రైళ్లు నిలువడం లేదు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టతోపాటు జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పని చేసే వేలాది మంది ఉద్యోగులు రోజూ రాకపోకలు సాగిస్తుంటారు. ఈ స్టేషన్లలో చాలా వరకు రైళ్లు ఆగకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. భువనగిరి, యాదాద్రి, నాగిరెడ్డిపల్లి రైల్వేస్టేషన్లలో ప్రస్తుతం నడుస్తున్న రైళ్లతోపాటు శాతవాహన, మచిలీపట్నం, పద్మావతి, కోణార్క్, నారాయణాద్రి తదితర రైళ్లను ఆపాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఈ ప్రాంత ఎంపీలకు పలుమార్లు వినతిపత్రాలు సైతం అందజేశారు.
జిల్లా కేంద్రంలోని ప్రధాన రైల్వేస్టేషన్‌తోపాటు యాదాద్రి, నాగిరెడ్డిపల్లి స్టేషన్లలో పారిశుధ్యం అస్తవ్యస్థంగా తయారైంది. భువనగిరి రైల్వేస్టేషన్లో మంచినీటి సౌకర్యం సక్రమంగా లేదు. మురుగు నీటి నిల్వతో దుర్గంధం వెదజల్లుతున్నది. మరుగుదొడ్లకు తాళాలు వేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రానికి కూతవేటు దూరంలోని యాదాద్రి రైల్వేస్టేషన్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నిర్వహణ లోపంతో ప్లాట్‌ఫారాలపై కంప చెట్లు పెరిగాయి. అపరిశుభ్రత నెలకొంది. మరుగుదొడ్ల నిర్వహణ లోపంతో మలమూత్రాదులు ఎక్కడికక్కడ నిలిచిపోయి దుర్గంధం వెదజల్లుతున్నది. నాగిరెడ్డిపల్లి రైల్వేస్టేషన్లో అభివృద్ధి పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి.
బీబీనగర్ : హైదరాబాద్‌కు అతి దగ్గరలోని బీబీనగర్ మండలం నుంచి రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లోని పరిశ్రమల్లో ఉద్యోగాలకు నిత్యం వేలాది మంది వెళ్తుంటారు. రైలు చార్జీలు తక్కువ కావడంతో ఎక్కువ మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. అయితే.. బీబీనగర్ రైల్వే స్టేషన్ గుండా రోజుకు 150 నుంచి 200 వరకు రైళ్లు వెళ్తుంటాయి. అందులో 18 మాత్రమే వలిగొండ స్టేషన్లో ఆగుతున్నాయి.
ఆలేరు : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మోడల్ స్టేషన్లలో ఒకటైన ఆలేరు రైల్వే స్టేషన్లో సమస్యలు నెలకొన్నాయి. సరైన నీటి సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. స్టేషన్ ఆవరణలో విద్యుత్ దీపాలు వెలగడం లేదు. మరుగుదొడ్లు మూసిఉండడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని ఐదు సంవత్సరాలుగా ప్రయాణికులు కోరుతున్నా రైల్వే అధికారులు పట్టించుకోవడం లేదు.
వలిగొండ : వలిగొండ రైల్వేస్టేషన్లో ప్యాసింజర్‌తోపాటు ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాలని స్థానికులు కోరుతున్నారు. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న వారు, కూరగాయలు, పాలు తీసుకెళ్లే రైతులు నిత్యం ఇక్కడి నుంచి ప్రయాణిస్తుంటారు. అయితే.. వలిగొండ స్టేషన్లో ఆగే డెమో రైలు ప్రయాణికుల వేళలకు అనుకూలంగా లేదు. ఉదయం 6:30గంటలకు నడికుడి నుంచి కాచిగూడ, తిరిగి 10:40 గంటలకు కాచిగూడ నుంచి నడికుడికి, సాయంత్రం 6:30కు నడికుడి నుంచి కాచిగూడ, రాత్రి 9:30 గంటలకు కాచిగూడ నుంచి నడికుడి వెళ్లే డెమో రైలు మాత్రమే వలిగొండ స్టేషన్లో ఆగుతుంది. ఈ రైలు వేళలు ప్రయాణికులకు అనువుగా లేకపోవడంతో ఆదరణకు నోచుకోవడం లేదు. వలిగొండ నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రైల్వే స్టేషన్‌కు లైటింగ్ లేకపోవడంతో రాత్రి వేళల్లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా వలిగొండ స్టేషన్లో రిజర్వేషన్ టికెట్ కౌంటర్, ప్లాట్‌ఫాం షెల్టర్‌తోపాటు విశ్రాంతి గదులను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
రామన్నపేట : మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్లో కరోనా నుంచి రైళ్లు ఆగకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేనేత కార్మికులు, విద్యార్థులు, వ్యాపారుల రాకపోకలకు అనుగుణంగా గతంలో రైలు సదుపాయం ఉండేది. కరోనా సమయం నుంచి మండల కేంద్రంలో నారాయణాద్రి ఎక్స్‌ప్రైస్, ఫలక్‌నుమా, జన్మభూమి, రేపల్లె రైళ్లు నిలుపడం లేదు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం గుంటూరు వెళ్లే రేపల్లె రైలు మాత్రమే ఆగుతున్నది. రైల్వే జీఎంలకు ఎన్నో సార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని ప్రజలు పేర్కొంటున్నారు.
కరోనా నుంచి నిలిపివేసిన రైళ్లను వెంటనే పునరుద్ధరించాలి. రైలు సదుపాయం లేక ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నం. దూర ప్రాంతాలకు పోవాలంటే ప్రైవేటు వాహనాలను ఆశ్రయించడంతో సమయం, డబ్బు అధికమవుతున్నది. సంబంధిత అధికారులు రైల్వే ఉన్నతాధికారులను సంప్రందించి ఇక్కడ రైళ్లను నిలిపేలా చర్యలు తీసుకోవాలి.
– బద్దుల రమేశ్, బోగారం, రామన్నపేట
వలిగొండలో పేరుకు మాత్రమే రైల్వేస్టేషన్ ఉంది. దాని వల్ల ప్రయాణికులకు పెద్దగా ఉపయోగం లేదు. రైల్వే స్టేషన్లో ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాలి. ప్రయాణికుల కోసం మంచినీటి సౌకర్యం కల్పించాలి. ప్లాట్‌ఫాం షెల్టర్‌తోపాటు విశ్రాంతి గదులను అందుబాటులోకి తేవాలి. రైతులు కూరగాయలు, పాలు హైదరాబాద్‌కు తీసుకెళ్లే విధంగా ప్రయాణికులకు అనుగుణంగా రైళ్లను ఆపాలి. రాత్రి వేళల్లో ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా వలిగొండ నుంచి రైల్వే స్టేషన్ వరకు విద్యుద్దీపాలను ఏర్పాటు చేయాలి.
– బొడిగె విక్రమ్, లింగరాజుపల్లి, వలిగొండ మండలం
నాగిరెడ్డిపల్లి రైల్వేస్టేషన్ పరిధిలోని గ్రామాలకు చెందిన ప్రజలు వందల సంఖ్యలో వివిధ పనుల నిమిత్తం నిత్యం జంట నగరాలకు ప్రయాణాలు సాగిస్తుంటారు. వారి సౌకర్యార్థం నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌తోపాటు నడికుడి మార్గంలో ప్రయాణించే పలు రైళ్లను ఆపాలి. స్టేషన్లో మౌలిక వసతులు కల్పించాలి. పారిశుధ్యాన్ని మెరుగు పరుచాలి.
– రచ్చ ప్రభాకర్, నందనం, భువనగిరి మండలం
లోకల్ ట్రైన్లు అన్నివేళలా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. బీబీనగర్ మండలం పారిశ్రామిక వాడగా అభివృద్ధి చెందుతున్నందున హైదరాబాద్‌కు ప్రయాణించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. లోకల్ ట్రైన్లు అందుబాటులో ఉంటే స్థానికులకు సౌకర్యంగా ఉండడంతోపాటు ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. బీబీనగర్ నుంచి చాలా రైళ్లు వెళ్తున్నా.. కొన్ని ఎక్స్‌ప్రెస్ ట్రైన్లను మాత్రమే ఆపుతున్నారు. మరిన్ని రైళ్లను ఆపాలి.
– ఎండీ దస్తగిరి, బీబీనగర్
భువనగిరి రైల్వే స్టేషన్లో శాతవాహన, మచిలీపట్నం, కోణార్క్, పద్మావతి రైళ్లతోపాటు మరిన్ని రైళ్లను నిలుపాలి. భువనగిరి నుంచి సుదూర ప్రాంతాలకు ప్రయాణికులు వెళ్లేందుకు వీలుగా సమయానుకూలంగా ట్రైన్లు నడుపాలి. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో మౌలిక సదుపాయాల నిర్వహణ అస్తవ్యస్థంగా ఉంది. సమస్యల పరిష్కారానికి రైల్వే అధికారులు సమగ్ర చర్యలు చేపట్టాలి. ప్రయాణికుల సమస్యలపై ఎన్ని పోరాటాలు చేసినా రైల్వే శాఖ పనితీరు నిమ్మకు నీరెత్తినట్లు ఉంది.
– దయ్యాల నర్సింహ, సీపీఎం మండల కార్యదర్శి, భువనగిరి