యాదాద్రి, ఆగస్టు 29 : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దివ్యక్షేత్రంలో స్వామి, అమ్మవార్లకు నిత్యోత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామిని మేల్కొల్పిన అర్చకులు తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామి, అమ్మవార్లకు ఉదయం సుదర్శన నారసింహ హోమం ఘనంగా నిర్వహించారు.
సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం చేశారు. అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం ఘనంగా జరిపించారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజల ఘనంగా నిర్వహించారు. కొండకింద ధీక్షాపరుల మండపం వద్ద గల వ్రత మండపంలో సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి.
సోమవారం కావడంతో పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వరాలయంలో లింగేశ్వర కుటుంబంతో పాటు ఆలయంలో నూతనంగా ప్రతిష్టించిన స్పటిక లింగేశ్వరుడికి ప్రభాతవేళ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని సుమారు గంటన్నర పాటు నిర్వహించారు. సాయంత్రం రామలింగేశ్వరుడి సేవను శివాలయ మాఢవీధుల్లో ఊరేగించారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ. 22,51,670 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
యాదాద్రీశుడిని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు సంప్రదాయరీతిలో ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం అర్చకులు వేదాశీర్వచనం చేయగా, ఆలయాధికారులు స్వామివారి ప్రసాదం అందించారు.
శ్రీవారిని కేంద్ర సమాచార శాఖ మంత్రి దేవ్‌సిన్హ్ చౌహాన్ దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ ప్రధానార్చకులు నల్లన్‌థీఘళ్ లక్ష్మీనర్సింహాచార్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వయంభు దర్శనం అనంతరం వేదాశీర్వచనం చేయగా, ఆలయ ఈఓ ఎన్.గీత స్వామివారి ప్రసాదం అందించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ ఎన్.గీత ఆలయ పునర్నిర్మాణాలను మంత్రికి వివరించారు.
ప్రధాన బుక్కింగ్ ద్వారా 2,52,000
వీఐపీ దర్శనాలు 1,80,000
వేద ఆశీర్వచనం 7,200
సుప్రభాతం 3,900
ప్రచార శాఖ 95,000
వ్రత పూజలు 1,30,400
కళ్యాణకట్ట టిక్కెట్లు 50,600
ప్రసాద విక్రయం 8,36,900
వాహనపూజలు 3,00,000
అన్నదాన విరాళం 30,534
సువర్ణ పుష్పార్చన 93,400
యాదరుషి నిలయం 63,280
పాతగుట్ట నుంచి 34,270
కొండపైకి వాహన ప్రవేశం 3,00,000
లక్ష్మీ పుష్కరిణి 1,550
శివాలయం 6,100
లీసెస్, లీగల్ 59,532
ఇతర విభాగాలు 12,804