
నల్లగొండ, జనవరి 23 : జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది వానకాలంలో 1,78,434 హెక్టార్లలో వరి సాగు చేయగా హెక్టారుకు 5.25 మెట్రిక్ టన్నుల చొప్పున 11,03,421 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో స్థానిక అవసరాలు పోను మార్కెటింగ్ నిమిత్తం 5.43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రానుందని అంచనా వేయగా సన్న ధాన్యం స్థానిక అవసరాలు పెరుగడంతో అంచనాకు అనుగుణంగా మార్కెట్‌కు రాలేదు. అక్టోబర్ 27న జిల్లాలో 234 కేంద్రాల ద్వారా సేకరణ చేపట్టిన ప్రభుత్వ రంగ సంస్థలు 75,666 మంది రైతుల నుంచి 4,43,186 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది.
రూ.615 కోట్ల చెల్లింపులు..
జిల్లా వ్యాప్తంగా ఐకేపీ, పీఏసీఎస్, మార్కెటింగ్ శాఖ ద్వారా మొత్తం 234 కేంద్రాలు ధాన్యం కొనుగోలుకు ఏర్పాటు చేయగా 75,666 మంది రైతుల నుంచి ఈ మూడు నెలల్లో 4,43,186 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. ధాన్యం సేకరణకు 1.10 కోట్ల గన్నీ బ్యాగులు వినియోగించారు.
అయితే మొత్తం రూ.868.65 కోట్ల విలువైన ధాన్యం సేకరించగా అందులో ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో ట్యాబ్ ఎంట్రీ రూ.857 కోట్ల మేరకు జరిగింది. వీటిల్లో రూ.195.12 కోట్ల బిల్లులు సివిల్ సైప్లె శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బిల్లులు రెండు మూడు రోజుల్లో ప్రభుత్వానికి పంపిస్తామని ఆ శాఖ యంత్రాంగం తెలిపింది. ఇప్పటి వరకు ప్రభుత్వానికి నివేదించిన రూ.673 కోట్లలో 49,201 మంది రైతులకు రూ.615.80 కోట్లు చెల్లించింది. మిగిలిన నిధులకు సంబంధించిన బిల్లులు పూర్తి కాగానే రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.
చివరి గింజ వరకూ కొనుగోలు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దానికి అనుగుణంగా ఈ సీజన్‌కు సంబంధించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసింది. క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు 15 వేల మంది ఓ సైన్యంలా కృషి చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ పూర్తి చేశారు. గత సీజన్‌కు సంబంధించిన ధాన్యం ఇప్పటికీ ఎఫ్‌సీఐ నిర్వాకం వల్ల ఇంకా మిల్లుల్లోనే ఉండడంతో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి చిన్న మిల్లులకు ట్యాగింగ్ అవకాశం ఇచ్చి కొన్న ధాన్యం మొత్తం ఆయా మిల్లుల్లో దిగుమతి చేసి లక్ష్యాన్ని పూర్తి చేశారు.
రెండు మూడు రోజుల్లో చెల్లింపులు పూర్తి చేస్తాం :
జిల్లా వ్యాప్తంగా వానకాలంలో 75,666 మంది రైతుల నుంచి 4.43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. ఈసారి లక్ష్యం 5.43 లక్షల మెట్రిక్ టన్నులు కాగా 4.43 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాం. మరో రెండు మూడు రోజుల్లో చెల్లింపులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రతి గింజనూ కొనుగోలు చేశాం.