యాదగిరిగుట్ట రూరల్, ఆగస్టు 29: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకునేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. గ్రామ గ్రామాన మండపాలను ఏర్పాటు చేశారు. వాటిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం వినాయకుడిని ప్రతిష్ఠించి తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజించనున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 5వేల విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. వినాయక ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకునేలా పోలీసుశాఖ తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నది.
జిల్లా వ్యాప్తంగా ఏర్పాటుచేసే ప్రతి వినాయక విగ్రహానికి పోలీసులు జియో ట్యాగింగ్ చేయనున్నారు. దాంతో ప్రతి మండపంపై ప్రత్యేక నిఘా ఉంచేందుకు వీలవుతుంది. పెట్రో, మొబైల్, బ్లూ కోట్స్ టీమ్‌లు అనునిత్యం పర్యవేక్షించనున్నాయి. నిమజ్జనం రోజున శోభాయాత్ర వెళ్లాల్సిన మార్గాలను సైతం పోలీసులు ఉత్సవ కమిటీ సభ్యుల ద్వారా తెలుసుకుంటున్నారు.
వినాయక ఉత్సవ కమిటీల వారు నిబంధనలు పాటించేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులతో సమావేశాలు ఏర్పాటుచేశారు. యాదాద్రి భువనగిరి జోన్ డీసీపీ, ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు ఉత్సవాల సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. పోలీస్‌శాఖ రూపొందించిన యాప్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. మండపాల వద్ద ఉత్సవ కమిటీ సభ్యులు రాత్రి సమయంలో ఉండాలని, శాంతియుతంగా ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. ఎవరైన శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
గణనాథుల విగ్రహాలు, అవసరమైన సామగి కొనుగోలుకు ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తుండడంతో దుకాణాల వద్ద సందడి నెలకొంది. ప్రధానంగా భువనగిరి, యాదగిరిగుట్ట, చౌటుప్పల్‌తో పాటు మున్సిపాలిటీ కేంద్రాల్లో సందడి నెలకొంది. గ్రామాల్లో ఉత్సవ శోభ నెలకొంది. ప్రజలు వినాయక విగ్రహాలను కొనుగోలు చేసి గ్రామాలకు తరలిస్తున్నారు. పలువురు మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.
వినాయక చవితి నవరాత్రులను శాంతియుత వాతవారణంలో జరుపుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేసి నిబంధనలు వివరించాం. మండపాల వద్ద ప్రమాదాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలి. ప్రతి విగ్రహానికి జియో ట్యాగింగ్ చేస్తున్నాం. యాదాద్రి భువనగిరి జోన్ వ్యాప్తంగా వినాయక మండపాల వద్ద నిఘా ఉంటుంది. నిరంతరం పెట్రోలింగ్ కొనసాగుతుంది. ప్రజలు పోలీస్‌శాఖకు సహకరించాలి.
– కె. నారాయణరెడ్డి, డీసీపీ, యాదాద్రి భువనగిరి జోన్