
మిర్యాలగూడ, జనవరి 23 : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలిచిందని మండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని 310 మందికి ప్రభుత్వం నుంచి మంజూరైన రూ. 3.10కోట్ల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఆదివారం పట్టణంలోని శ్రీఫంక్షన్హాల్లో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుతో కలిసి అందించారు. అనంతరం గుత్తా మాట్లాడుతూ పేదింటి తల్లిదండ్రులకు ఆడపిల్ల వివాహం భారం కాకూడదనే సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకం ద్వారా రూ. లక్షా 116 అందిస్తున్నారని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అన్నదాతలకు అండగా నిలిచేందుకు రైతుబంధు ద్వారా ఎకరానికి ప్రతి ఏటా రూ.10 వేల సాయం, రైతుబీమా ద్వారా వారి కుటుంబానికి భరోసా కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు మాట్లాడుతూ కాల్వచివరి భూముల రైతుల కష్టాలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ దామరచర్ల, అడవిదేవులపల్లి మండలాల్లో రూ. 500 కోట్లతో 3 లిఫ్టులు మంజూరు చేశారన్నారు. నియోజకవర్గంలో 100 మందికి దళితబంధు పథకాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. అనంతరం ఎన్నెస్పీ క్యాంపులో నిర్మిస్తున్న వివిధ భవనాలతో పాటు మినీ రవీంద్రభారతిని వారు పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీఓ రోహిత్‌సింగ్, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, ఎంపీపీలు నూకల సరళ, నందిని, శ్రీవిద్య, బాలాజీనాయక్, తాసీల్దార్ గణేశ్, మోసిన్‌అలీ, సేవ్యానాయక్, లలిత, మంగమ్మ, ఆర్ఐ శ్యాంసుందర్ పాల్గొన్నారు.