యాదాద్రి, ఆగస్టు 22 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ప్రధానాలయంతో పాటు పాతగుట్ట ఆలయంలో కృష్ణాష్టమి ముగింపు వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. మూడోరోజు వేడుకల్లో భాగంగా శ్రీకృష్ణుడి విగ్రహాన్ని దివ్యమనోహరంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. తొలుత ప్రధానాలయంలో లక్ష్మీనారసింహుల ప్రత్యేక అలంకరణతో ఉట్ల సేవోత్సవాన్ని చేపట్టారు. పాలు, వెన్నతో కూడిన ఉట్టికి పూజలు చేశారు. అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు.
రుక్మిణీ కల్యాణం
కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా రాత్రి యాదాద్రీశుడి ప్రధానాలయంతో పాటు పాతగుట్ట ఆలయంలో కృష్ణుడు, రుక్మిణీదేవీ కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ సంప్రదాయరీతిలో విష్వక్సేనారాధన, స్వస్తివాచన పర్వాలతో కల్యాణోత్సవం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుల నేతృత్వంలో నిర్వహించిన రుక్మిణీ కల్యాణ విశిష్టతను అర్చకులు వివరించారు. కల్యాణోత్సవ పర్వంతో కృష్ణాష్టమి వేడుకలు ముగిశాయని ఆలయ అర్చకులు తెలిపారు.
స్వామివారికి లక్ష పుష్పార్చన
ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని లక్ష పుష్పార్చన పూజలు శాస్ర్తోక్తంగా జరిపించారు. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చకబృందం, వేద పండితులు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన పూజలు చేశారు. స్వయంభూ ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులను పట్టువస్ర్తాలతో దివ్యమనోహరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై తీర్చిదిద్దారు. అర్చక బృందం, వేద పండితులు స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో వివిధ రకాల పూలతో లక్షపుష్పార్చన పూజలను పాంచరాత్రాగమశాస్త్ర ప్రకారం సుమారు రెండు గంటల పాటు నిర్వహించారు.
భక్తుల సందడి
శ్రావణమాసం చివరి సోమవారం కావడంతో భక్తుల సందడి నెలకొంది. నారసింహుడికి ప్రత్యేక పూజలు చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. భక్తుల రాకతో తిరుమాఢవీధులు, క్యూలైన్లు సందడిగా మారాయి. శ్రావణమాసంలో భాగంగా శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చన వైభవంగా సాగుతున్నది. 25వ రోజులో భాగంగా అర్చకులు కుంకుమతో అమ్మవారిని అర్చించారు. లక్ష్మీసహస్రనామ పఠనం కొనసాగుతున్నది. లక్ష్మీనారసింహుడికి నిత్యోత్సవాలు వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామిని మేల్కొల్పిన అర్చకులు తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామి, అమ్మవార్లకు ఉదయం సుదర్శన నారసింహ హోమం ఘనంగా నిర్వహించారు. సుదర్శన ఆళ్వారులకు కొలుస్తూ హోమం చేశారు. అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం ఘనంగా జరిపించారు.
సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు ఘనంగా నిర్వహించారు. కొండకింద దీక్షాపరుల మండపం వద్ద గల వ్రత మండపంలో సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి. సోమవారం కావడంతో పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వరాలయంలో లింగేశ్వర కుటుంబంతో పాటు ఆలయంలో నూతనంగా ప్రతిష్టించిన స్పటిక లింగేశ్వరుడికి ప్రభాతవేళ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని సుమారు గంటన్నర పాటు జరిపారు. సాయంత్రం రామలింగేశ్వరుడికి సేవను శివాలయ మాఢవీధుల్లో ఊరేగించారు. అన్ని విభాగాలను కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.36,40,902 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో ఎన్. గీత తెలిపారు. 25వేల పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు.
స్వామివారి బంగారు లాకెట్ విక్రయాలు షురూ
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి బంగారు లాకెట్ల విక్రయాలు మొదలయ్యాయి. యాదాద్రి ఆలయంలోని ప్రచారశాఖ కౌంటర్లలో భక్తులు వీటిని కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్ బోడుప్పల్‌కు చెందిన పల్లె ఉప్పలయ్య స్వామివారి 2 బంగారు లాకెట్లను సోమవారం కొనుగోలు చేసినట్లు ఆలయాధికారులు తెలిపారు.
నాగదేవత పుట్టకు షెడ్డు
యాదాద్రి కొండపైకి వెళ్లే ప్రథమ ఘాట్ రోడ్డు వద్ద నాగదేవత పుట్టకు దాతల సహకారంతో షెడ్డు నిర్మించారు. హైదరాబాద్‌లోని నాగోల్ చెందిన భక్తుడు పసునూరి కిరణ్‌రెడ్డి షెడ్డు నిర్మాణానికి రూ.2లక్షలు అందించారు.