‘బాబ్బాబు.. మా మీటింగుకు రండి, డబ్బులిస్తం. బండ్లు పెడుతం. మంచీమర్యాద చూసుకుంటం’ అంటూ బీజేపీ నాయకులు బతిమిలాడుకున్నా మునుగోడు నియోజకవర్గ ప్రజల కనీసం పట్టించుకోలేదు. దాంతో భారీ అంచనాలతో వందల వాహనాలు ఏర్పాటుచేసుకున్నా కమలం నేతలు కంగుతిన్నారు. స్థానిక పరిశ్రమల్లో పనిచేసే బిహార్ కూలీల దగ్గరికి వెళ్లి 500 రూపాయలు, పులిహోరా, రాత్రి మర్యాద చూసుకుంటామని చెప్పి మునుగోడు సభకు తీసుకెళ్లారు. నియోజకవర్గ ప్రజల నుంచి కనీస స్పందన సైతం కరువవడంతో బీజేపీ సభను హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, వరంగల్ జిల్లాల నుంచి వచ్చిన నేతలు, ఉత్తరాది రాష్ర్టాల నుంచి ఉపాధి కోసం ఇక్కడికి వచ్చిన కూలీలతో మ.మ. అనిపించారు. వచ్చిన కొద్దిమందికూడా నాయకుల ప్రసంగం మధ్యలోనే వెళ్లిపోవడం గమన్హారం. దాంతో కమలం నేతలు తెల్లమొహం వేశారు.
మునుగోడు/చండూరు, ఆగస్టు 21 : మునుగోడు ఆత్మగౌరవ సభ పేరిట బీజేపీ ఆదివారం నిర్వహించిన సభ అట్టర్ ఫ్లాప్ అయింది. జనాలు లేక సభ వెలవెలబోయింది. నియోజకవర్గ ప్రజలు కనీస ఆసక్తి చూపకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి జనాల తరలింపు చేపట్టిన అది కూడా పెద్దగా ప్రయోజనం ఇవ్వలేదు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కోసం కాకుండా ఆయన వచ్చిన బీఎస్ఎఫ్ హెలికాప్టర్ చూసేందుకే ఆ కాస్త జనం వచ్చారు. సభా ప్రాంగణం కంటే జనాలు ఎక్కువగా హెలీప్యాడ్ వద్దే కనిపించారు. ఓటు హక్కులేని 15 సంవత్సరాలలోపు విద్యార్థులే ఉండడం గమనార్హం. అంతేకాకుండా ప్రతి వ్యక్తికి రూ.500 చెల్లించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనానికి ఇద్దరు వ్యక్తులు ఉంటే రూ.1200 ఇచ్చారు. వెళ్లిన వారు కూడా సభాస్థలికి చేరుకున్న వారిలో అమిత్ షా సభకు చేరుకోక ముందే తిరుగుముఖం పట్టారు. అమిత్షా ప్రసంగాన్ని సైతం జనం పెడచెవిన పెట్టారు.
50కార్లు.. 100 మంది కార్యకర్తలు
హాలియా : నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీలో లుకలుకలో మరోసారి బయటపడ్డాయి. మునుగోడులో ఆదివారం జరిగిన బహిరంగ సభకు జిల్లా నలుమూలల నుంచి భారీగా బీజేపీ కార్యకర్తలను సమీకరించాలని పార్టీ నిర్ణయించింది. కానీ నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి 50 వాహనాల్లో 100 మంది వరకు తరలివెళ్లారు. చాలా గ్రామాల్లో బీజేపీ నాయకులు డబ్బులు ఇచ్చి వాహనాలు సమకూర్చినా బహిరంగ సభకు వెళ్లేందుకు ప్రజలు సిద్ధపడక పోవడం గమనార్హం. ఈ నియోజకవర్గంలో పార్టీకి సరైన నాయకత్వం లేకపోవడంతో పాటు జిల్లా పార్టీ నాయకత్వం తమకు నచ్చిన వారికి వాహనాలు ఇప్పించడంతో వాహనానికి ఇద్దరు చొప్పున బీజేపీ కార్యకర్తలు జల్సాగా తరలి వెళ్లారు. 50 కార్లలో 100 మంది మాత్రమే బహిరంగ సభకు వెళ్లడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.