మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలోకి వలసల ప్రవాహం కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ సభ సూపర్ సక్సెస్ విజయవంతం కావడంతో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మరింత ఉత్సాహంగా గులాబీ గూటికి చేరుతున్నారు. ఆదివారం మర్రిగూడ మండలం అంతంపేట సర్పంచ్ శేఖర్ గౌడ్, చౌటుప్పల్ మండలం జైకేసారం సర్పంచ్ కొర్పూరి సైదులు, నేలపట్ల సర్పంచ్ చౌట వేణుగోపాల్‌రెడ్డి, కొత్తగా ఏర్పడ్డ గట్టుప్పల్ మండలం నామాపురం మాజీ ఎంపీటీసీ
జాజుల శంకర్, వార్డు సభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్‌లో మంత్రి గులాబీకండువాలు కప్పి వారిని ఆహాన్వించారు. టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో మునుగోడు మండలం రాంరెడ్డిపల్లికి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు 30మంది గులాబీ కండువా కప్పుకొన్నారు. కాగా, మర్రిగూడ మండలానికి చెందిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆ పార్టీ సర్పంచ్‌లు పలువురు ఇప్పటికే టీఆర్ఎస్లో చేరగా.. వలసల జోరు కొనసాగుతుండడంతో మర్రిగూడ మండలంలో కాంగ్రెస్ పార్టీ దాదాపు ఖాళీ అవుతున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
మర్రిగూడ, ఆగస్టు 21 : రాష్ట్ర ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని గ్రహించి ఇతర పార్టీల సర్పంచులు, ఎంపీటీసీలు టీఆర్ఎస్లో చేరుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అంతంపేట సర్పంచ్ మాదగోని శేఖర్‌గౌడ్ హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో ఆదివారం టీఆర్ఎస్లో చేరారు. మంత్రి జగదీశ్‌రెడ్డి సర్పంచ్ శేఖర్‌గౌడ్‌కు గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ రాజకీయ పైశాచిక ఆనందాన్ని తిప్పి కొట్టేందుకు ప్రజాప్రతినిధులు, మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ వైపు నిలబడాల్సిన అవసరముందన్నారు. సాధారణ ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండగానే మునుగోడుకు ఉప ఎన్నిక ఎందుకొచ్చిందో ప్రజలు గమనించాలని సూచించారు. రూ.22వేల కోట్ల కాంట్రాక్టులకు కక్కుర్తి పడి ప్రజాస్వామ్యాన్ని, ప్రజల తీర్పును అపహాస్యం చేస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడన్నారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి రాజగోపాల్‌రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మర్రిగూడ ఇన్చార్జి, చందంపేట మాజీ ఎంపీపీ ఏడుపుల గోవిందు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పాక నగేశ్‌యాదవ్ పాల్గొన్నారు.
గట్టుప్పల్‌లో కొనసాగుతున్న వలసలు
చండూరు(గట్టుప్పల్) : నూతనంగా ఏర్పడిన గట్టుప్పల మండలంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతున్నది. ఇప్పటికే పలువురు ఎంపీటీసీలతో పాటు గట్టుప్పల సర్పంచ్ టీఆర్ఎస్లో చేరారు. ఇదే క్రమంలో మండలంలోని నామాపురం మాజీ ఎంపీటీసీ జాజుల శంకర్, వార్డు సభ్యుడు జాజుల నర్సింహతో పాటు పలువురు మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో ఆదివారం టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
టీఆర్ఎస్లోకి జైకేసారం, నేలపట్ల సర్పంచులు
చౌటుప్పల్ : మండలం నుంచి టీఆర్ఎస్లోకి వలసల వెల్లువ కొనసాగుతున్నది. మండలంలోని జైకేసారం, నేలపట్ల గ్రామాల కాంగ్రెస్ సర్పంచులు కొర్పూరి సైదులు, చౌట వేణుగోపాల్ మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలవడం ఖాయమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, కంచర్ల భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ రామచంద్రనాయక్ పాల్గొన్నారు.