నిడమనూరు, జనవరి11: ఒకప్పుడు కనీస వసతులకు నోచని నిడమనూరు మండలంలోని ముప్పారం గ్రామం నేడు ఊహించనంత అభివృద్ధిని సొంతం చేసుకున్నది. సర్పంచ్ అల్లం శ్రీనివాస్ పల్లె ప్రగతి నిధులను సద్వినియోగం చేస్తూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు. హరితహారం మొక్కల సంరక్షణ, బృహత్ పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామం నిర్మాణం, ఇంటింటికీ మిషన్ భగీరథ నీటి సరఫరాలో మండలంలోనే ముప్పారం ఆదర్శంగా
నిలుస్తున్నది.
నిరంతరాయంగా అభివృద్ధి.. 2,145మంది జనాభా ఉన్న ముప్పారం గ్రామంలో సరిపడా వసతుల్లేక ఒకప్పడు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో ఇక్కడ అభివృద్ధికి అడుగులు పడ్డాయి. పంచాయతీకి ప్రతి నెలా మంజూరవుతున్న స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు రూ.2.20 లక్షలతో సర్పంచ్ అల్లం శ్రీనివాస్ పారిశుధ్య కార్యక్రమాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం ప్రక్రియను నిరంతరాయంగా చేపడుతున్నారు.
ప్రభుత్వ పథకాలు సద్వినియోగం..
సర్పంచ్ అల్లం శ్రీనివాస్ ప్రత్యేక చొరవ ముప్పారం రూపురేఖులు మారుతున్నాయి. మండలంలో ఎక్కడా లేని విధంగా సర్వే నంబర్ 153లో 9 ఎకరాల ప్రభుత్వ స్థలంలో బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసి 25 వేల మొక్కలు నాటారు. కంపోస్ట్ షెడ్, నర్సరీ, వైకుంఠధామం ఏర్పాటుచేశారు. హరితహారంలో మండలంలోనే అత్యధికంగా మొక్కలు నాటి అగ్రభాగాన నిలిచారు. ఉన్నతాధికారులు ఎవరొచ్చినా ముందుగా ముప్పారంలో పల్లె ప్రగతి అమలు తీరును పరిశీలిస్తుండడం సర్పంచ్ నిరంతరం హరితహారం మొక్కలను పర్యవేక్షిస్తుండడంతో పచ్చదనం పరిఢవిల్లుతున్నది. ఒకనాడు చిత్తడిగా ఉండే రోడ్లు సీసీగా మారాయి. మురుగు కాల్వలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తూ ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్త పడుతున్నారు. గ్రామస్తుల అవసరాల మేరకు పారదర్శకంగా నిధులు ఖర్చు చేయడంతోనే ముప్పారం అభివృద్ధికి బాటలు పడ్డాయని, పల్లె ప్రగతి అమలులో అగ్రభాగాన నిలుగలిగిందని పంచాయతీ కార్యదర్శి పి.మధుసూదన్ తెలిపారు.
సీఎం కేసీఆర్ చొరవతోనే..
పల్లె సీమల అభివృద్ధికి సీఎం కేసీఆర్ తీసుకున్న చొరవతోనే ముప్పారం గ్రామ అభివృద్ధి సాధ్యపడింది. మారుమూల పంచాయతీల అభివృద్ధికి పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా నిధులు అందుతున్నాయి. మా గ్రామంలో పారిశుధ్య నిర్వహణ, బృహత్ పల్లె ప్రకృతి వనం, నర్సరీ, కంపోస్ట్ షెడ్, రైతు వేదిక, మిషన్ భగీరథ పథకాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేశాం. ఇప్పుడు మా గ్రామం అభివృద్ధికి మారుపేగా నిలుస్తున్నది.
-అల్లం శ్రీనివాస్, ముప్పారం గ్రామ సర్పంచ్