రాష్ట్రంలో ప్రజావసరాలకు అనుగుణంగా పాల ఉత్పత్తిని పెంచాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆడ పశువుల సంతతి పెంపునకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ కారణంగా దున్నపోతులు, కోడెల సంఖ్య క్రమంగా తగ్గడంతో పశుగణాభివృద్ధి సంస్థ బర్రెలు, ఆవుల్లో ఏటా కృత్రిమ గర్భధారణ చేపడుతున్నది. ఈ పద్ధతిలో ఆడ సంతతిని పెంచేందుకు మగ వీర్య కణాలను వేరు చేసి ఇచ్చే (సెక్స్ శార్టెడ్ సెమన్) ప్రక్రియను వచ్చే నెల నుంచి ప్రారంభించనున్నది. ఎదకొచ్చే పశువుల కోసం 65 శాతం సబ్సిడీపై ఈ వీర్యం అందించనున్నది. ఈ పద్ధతిలో 96 శాతం ఆడ దూడలే పుట్టే అవకాశం ఉంది. అలా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1.75 లక్షల నుంచి రెండు లక్షల పశువులకు కృత్రిమ గర్భధారణ చేయనున్నది.
నల్లగొండ, ఆగస్టు 4 : రాష్ట్రంలో పాల ఉత్పత్తి పెంచేందుకు వీలుగా ఆడ పశువుల సంతతి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొదిస్తున్నది. పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టే కృత్రిమ గర్భధారణ పద్ధతిలో కొంత మార్పును చేస్తున్నది. పశువుల నుంచి సేకరించిన వీర్యంలో ఆడ, మగ వీర్య కణాలు వేరు చేసే సెక్స్ శార్టెడ్ శమన్ పద్ధతిని వచ్చే నెల నుంచి ప్రారంభించనున్నది. ఎదకొచ్చే ఆడ పశువులకు 65 శాతం సబ్సిడీతో ఈ వీర్యం ఇచ్చి ఆడ పశువుల సంతతి పెంచనున్నారు.
96 శాతం ఆడ దూడలే ..
కాలానుగుణంగా వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెరగడంతో దున్నపోతులు, కోడె దూడల అవసరం క్రమంగా తగ్గుతూ వస్తున్నది. ఈ నేపథ్యంలో ఎదకొచ్చే ఆడ పశువులు గర్భం దాల్చేందుకు మగ పశువుల సంఖ్య సరిపోను లేనందున జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం కృత్రిమ గర్భధారణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ పద్ధతిలో ఆడ దూడలు జన్మిస్తే పాల ఉత్పత్తి ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉన్నందున రైతులు వాటిని పెంచుతున్నారు. మగవైతే కనీసం వాటిని వదిలేయడం లేదా మార్కెట్లో విక్రయించడం చేస్తున్నారు. ఆడ దూడల సంఖ్య కూడా తక్కువగా ఉన్నందున పాల ఉత్పత్తి కూడా తక్కువగానే ఉంటున్నది. ఈ నేపథ్యంలో సేకరించిన వీర్యం నుంచి ఆడ, మగ వీర్య కణాలను వేరు చేసే పద్ధతిని (సెక్స్ శార్టెడ్ శమన్ సిస్టమ్) ఈ ఏడాది నుంచి ప్రభుత్వం అమలు చేయనున్నది. దీని ద్వారా వంద పశువులకు కృత్రిమ గర్భధారణ చేస్తే 96 శాతం ఆడ దూడలే జన్మించే అవకాశం ఉంది. దాంతో పాల ఉత్పత్తి కూడా పెరిగే అవకాశం ఉన్నది.
65శాతం సబ్సిడీ
ప్రతి సంవత్సరం జాతీయ కృత్రిమ గర్భధారణ పథకం కింద ప్రభుత్వం సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ఉచితంగా కృత్రిమ గర్భధారణ కార్యక్రమం చేపడుతుంది. ఈ సారి జాతీయ పాల అభివృద్ధి బోర్డు (ఎన్డీడీపీ) ద్వారా ఆడ, మగ వీర్య కణాలను వేరు చేసే పద్ధతిని అమలు చేయనుంది. కృత్రిమ గర్భధారణకు అవసరమైన పశువుల వీర్యాన్ని అందించేందుకు కర్ణాటకలోని భారత ఆగ్రో ఇండస్ట్రీస్ ఫెడరేషన్ (బెయిస్) ద్వారా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కీం అమలుకు రూ.19 కోట్లు కేటాయించింది. ఒక్కో డోసును బెయిస్ సంస్థ రూ.675కు ఇవ్వనుండగా రైతు రూ.250 చెల్లిస్తే ప్రభుత్వం రూ.425 సబ్సిడీ అందిస్తుంది. పశువుకు ఏఐ చేసిన 21 రోజుల్లో గర్భం దాలుస్తుంది. ఆ సమయంలో దాల్చక పోతే రెండో సారి రైతు మరో రూ.250 చెల్లించి ఏఐ చేయించుకోవాలి. మొదటి సారి రైతు చెల్లించిన రూ.250 రైతుకు తిరిగి చెల్లిస్తారు. రెండు సార్లు గర్భం దాల్చక పోతే రూ.500 తిరిగి చెల్లిస్తారు. అంతకు ముందే ఆన్లైన్లో రైతు పేరు ఆధార్ నంబర్‌తో పాటు పశువుకు ఇచ్చిన ట్యాగ్ నంబర్‌తో పాటు ఇతర వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది.
72 ప్రత్యేక బృందాలు
సెక్స్డ్ శార్టెడ్ శమన్ సిస్టమ్ ద్వారా కృత్రిమ గర్భధారణ చేసేందుకు జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ మండలానికి ఒక బృందం చొప్పున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 72 బృందాలను ఏర్పాటు చేసింది. ప్రతి బృందంలో డాక్టర్‌తో పాటు గోపాల మిత్ర ఉంటారు. వీరితో మరో 15 మంది సూపర్వైజర్లతో కలిపి మొత్తం 159 మందిని కేటాయించారు. వీరికి ఈ వారంలోనే హైదరాబాద్‌లో శిక్షణ ఇస్తారు. ఈనెల చివరి వరకు రైతులకు అవగాహన కల్పిస్తారు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి డిసెంబర్ 31 వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నారు.
ఉమ్మడి జిల్లాలో 5.52లక్షల పశువులు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5,52,645 పశువులు ఉన్నాయి. అందులో 1,65,546 ఆవులు, 3,87 099 గేదెలు ఉన్నాయి. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ 31 వరకు సుమారు 1.75లక్షల నుంచి 2 లక్షల వరకు పశువులు ఎదకు వచ్చే అవకాశం ఉన్నట్లు పశుగణాభివృద్ధి సంస్థ అంచానా వేసింది. ప్రతి మండలానికి ఏర్పాటు చేసిన డాక్టర్ల బృందం ఫోన్ నంబర్‌ను రైతులు తీసుకొని తమ పశువులు ఎదకు రాగానే సమాచారం అందిస్తే వారు వచ్చి ఏఐ చేస్తారు. తొలి, మలి ఈతలో అయితే పశువులు త్వరగా గర్భం దాల్చే అవకాశం ఉన్నందున ఈ పద్ధతితో ఆ రకమైన పశువులకే అమలు చేసే విధంగా అదికారులు చర్యలు తీసుకుంటున్నారు.
పాల ఉత్పత్తి పెంచేందుకే కొత్త పద్ధతి
డీఎల్‌డీఏ చైర్మన్ మోతె పిచ్చిరెడ్డి
నల్లగొండ : రాష్ట్రంలో ప్రజావసరాలకు తగిన పాల ఉత్పత్తి లేనందున ప్రభుత్వం పాల ఉత్పత్తి పెంచేందుకు సెక్స్డ్ శార్టెడ్ శమన్ సిస్టమ్‌ను వచ్చే నెల నుంచి జిల్లాలో అమలు చేయనున్నట్లు జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ మోతె పిచ్చిరెడ్డి తెలిపారు. గురువారం స్థానిక డీఎల్‌డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ ఈఓ మల్లిఖార్జున్‌తో కలిసి మాట్లాడారు. గతంలో ప్రతి సంవత్సరం జాతీయ కృత్రిమ గర్భధారణ పథకం కింద పశువులకు ఉచితంగా గర్భధారణ చేసినప్పటికీ మగ లేదా ఆడ దూడ పుడుతుందా అనేది తెలియని పరిస్థితి. మగ పశువులను పెంచేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదని, వాటివల్ల పాల ఉత్పత్తి కూడా పెరగడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజావసరాలకు అవసరమైన పాల ఉత్పత్తిని పెంచేందుకు సెక్స్డ్ శార్టెడ్ శమన్ సిస్టమ్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పద్ధతిలో 96శాతం ఆడ దూడలే జన్మించే అవకాశం ఉందన్నారు. జిల్లాలో సుమారు రెండు లక్షల పశువులకు ఏఐ చేసే అవకశం ఉన్నట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.