ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మరో కార్పొరేషన్ చైర్మన్ పదవి వరించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో రాష్ట్ర గిరిజన సహకార ఆర్థికాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ఇస్లావత్ రాంచందర్‌నాయక్ నియమితులయ్యారు. గురువారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ స్వయంగా నియామక పత్రాన్ని అందజేసి అభినందించారు. ప్రస్తుతం రాంచందర్‌నాయక్ నల్లగొండ జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడిగా ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్తోనే గిరిజనులకు మంచి గుర్తింపు లభించిందని, సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటానని ఈ సందర్భంగా రాంచందర్‌నాయక్ తెలిపారు.
నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) బలమైన సంస్థాగత నిర్మాణంతో పాటు పటిష్టమైన ప్రజా ప్రాతినిధ్యంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా అవతరించింది. ఈ నేపథ్యంలోనే జిల్లా పరిధిలోని అనేక మంది నేతలకు పదవులు అదే రీతిలో వరిస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రస్థాయి కార్పొరేషన్లకు చైర్మన్లుగా జిల్లాకు చెందినవారు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా రాష్ట్ర గిరిజన సహకార ఆర్థికాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ఇస్లావత్ రాంచందర్ నాయక్ నియమితులయ్యారు. గురువారం ఉత్వర్వులు వెలువడ్డాయి. దీంతో రాష్ట్ర రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్‌తో కలిసి రాంచందర్‌నాయక్ సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నియామక ఉత్తర్వులను రాంచందర్‌నాయక్‌కు సీఎం కేసీఆర్ స్వయంగా అందజేశారు. విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ గిరిజనుల ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలంటూ ఈ సందర్భంగా సీఎం ఆశీర్వదిస్తూ అభినందించారు. కాగా ఇప్పటికే ఉమ్మడి జిల్లాను అనేక కార్పొరేషన్ పదవులు వరించాయి.
రాష్ట్ర ఆయిల్‌ఫెడ్ సంస్థ చైర్మన్‌గా కంచర్ల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర గొర్రెల మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా దూదిమెట్ల బాలరాజ్యాదవ్, రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్‌గా జూలూరి గౌరీ శంకర్, రాష్ట్ర ఫుడ్స్ చైర్మన్‌గా మేడే రాజీవ్ సాగర్ ఇప్పటికే బాధ్యతల్లో ఉన్నారు. వీరితో పాటు గతంలోనూ అనేక రాష్ట్రస్థాయి కార్పొరేషన్లకు జిల్లాకు చెందినవారు చైర్మన్లుగా వ్యవహరించారు. తాజాగా మరో చైర్మన్ పదవి దక్కడంతో పార్టీ జిల్లా శ్రేణుల్లో సంతోషం వ్యక్తమవుతున్నది. పార్టీ కోసం పనిచేస్తున్న వారికి తగిన గుర్తింపు దక్కుతున్నదనడానికి ఈ పదవులే నిదర్శనమని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పనితనానికి గుర్తింపు..
హాలియా, ఆగస్టు 4 : నల్లగొండ జిల్లా రైతు బంధు అధ్యక్షుడిగా ఉన్న రాంచందర్‌నాయక్ ఒకవైపు ప్రభుత్వ రైతు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు తెలంగాణ బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా గిరిజన చైతన్యం, వారి సమస్యల పరిష్కారం కోసం చురుగ్గా పని చేస్తున్నారు. 2014 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, నాయకుడిగా అంకితభావంతో పని చేశారు. 2018, 2021 సాగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయంలో కీలక భూమిక పోషించారు.
ఏడాదిలో సాగర్ నియోజక వర్గానికి రెండు పదవులు..
సాగర్ నియోజకవర్గానికి రాష్ట్రం లో కీలక పదవుల రాక పరంపర కొనసాగుతుంది. ఆరు మాసాల క్రితం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా నియోజకవర్గానికే చెందిన ఎంసీ కోటిరెడ్డి ఎంపికవగా ప్రస్తుతం తెలంగాణ గిరిజన ఆర్థిక అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా త్రిపురారం మండ లం సత్యంపాడుతండాకు చెందిన ఇస్లావత్ రాంచందర్‌నాయక్ నియమితులయ్యారు. రాంచందర్‌నాయక్ నియామకం పట్ల నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, బంజారా సేవా సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.