నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు. తన రాజకీయ, ఆర్థిక అవసరాలే సిసలైన నిజాలు. ఆయనకు అవసరం ఉందంటే ఆకాశానికి ఎత్తేస్తాడు. అనుకున్నది జరుగడం లేదూ అంటే పరనిందలు మోపుతాడు. పోతూపోతూ రాళ్లేసి పోతాడు. ఇదీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వైఖరి. రాజీనామా విషయంలోనూ అదే చేశాడు. తానే గొప్ప, తానే అంతా అంటూ గప్పాలు కొడుతూనే, కండ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధి ఆయన తీరుపై మునుగోడు నియోజకవర్గ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తన స్వార్థం కోసం రాజీనామా చేసి, మునుగోడు అభివృద్ధి కోసమేనంటూ కలరింగ్ ఇవ్వడంపై మండిపడుతున్నారు. ఫ్లోరైడ్ కోరల్లో చిక్కి విలవిల్లాడిన నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథతో విముక్తి కల్పించింది నిజం కాదా? అని నిలదీస్తున్నారు. రాజధానికి హైదరాబాద్‌కు కూత వేటు దూరంలో ఉన్నా, ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహించినా, అభివృద్ధి, సంక్షేమం విషయంలో మునుగోడు నియోజకవర్గానికి ప్రాధాన్యం దక్కింది మాత్రం టీఆర్ఎస్ పాలనలోనేనని ఘంటాపథంగా చెప్తున్నారు. 2018లో అనేక హామీలతో గెలిచి, సొంత వ్యాపారాల్లో బిజీ అయిన రాజగోపాల్‌రెడ్డి నియోజకవర్గాన్ని ఏనాడైనా పట్టించుకున్నాడా? అని ప్రశ్నిస్తున్నారు. ఆయన రాజీనామాతో నియోజకవర్గానికి పట్టిన చీడ వదిలిందంటూ సంస్థాన్‌నారాయణపురంలో కాంగ్రెస్ కార్యకర్తలు పటాకులు కాల్చి సంబురాలు చేశారు.
నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు02 (నమస్తే తెలంగాణ) : అది సమైక్య పాలన…. పేరుకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు కూత వేటు దూరంలో ఉన్న నియోజకవర్గం.. కానీ అభివృద్ధికి మాత్రం ఆమడ దూరం. అదే మునుగోడు నియోజక వర్గం. ఎక్కువ కాలం కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఈ నియోజకర్గానికి ప్రాతినిధ్యం వహించారు. కానీ ఏనాడూ అభివృద్ధిని పట్టించుకోలేదు. సమస్యలకు ఆలవాలంగా మార్చేశారు. కనీసం తాగునీళ్లు ఇవ్వక ఫ్లోరైడ్‌ను పెంచి పోషించారు. దీంతో ఎంతో మంది కాళ్లు, చేతులు వంకర పోయి జీవితాల్ని మధ్యలోనే వదులుకున్నారు. ఎలాంటి సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టకపోవడంతో బీడు భూములుగా మారిపోయాయి. రహదారులు, విద్య, వైద్యం లాంటి మౌలిక వసతులకు ఇక్కడి ప్రజలు దూరంగా ఉన్నారు. అందుకే కేసీఅర్ నేతృత్వంలో సాగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఇక్కడి ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములయ్యారు. ఇదే స్ఫూర్తితో 2014లో రాష్ట్రం సిద్ధించాక ఇక్కడ జరిగిన తొలి ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించారు. ఇక అప్పటి నుంచే మునుగోడు నియోజకర్గ అభివృద్ధికి బాటలు పడ్డాయి.
ముఖ్యంగా ఉద్యమ సమయంలో కేసీఅర్ నియోజకవర్గంలో పలుమార్లు ఫ్లోరైడ్ ప్రాంతాల్లో పర్యటిస్తూ స్వరాష్ట్రంలో చెక్ పెడతామని అప్పట్లోనే ప్రకటించారు. దీనికి కట్టుబడి ఉన్న కేసీఅర్ సీఎంగా ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారు. 2016లో మిషన్ భగీరథ పథకాన్ని నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్ నుంచి ప్రారంభిస్తూ పైలాన్ ఆవిష్కరించారు. నియోజకవర్గంలోని ప్రతి ఆవాసంలోని ఇంటింటికీ నల్లా కనెక్షన్‌తో కృష్ణా జలాలను అందిస్తున్నారు. దాంతో సరిగ్గా నాలుగేళ్లలో కొత్తగా ఒక్క ఫ్లోరైడ్ కేసు నమోదు కాకుండా అడ్డుకట్ట పడింది. 2020 అక్టోబర్‌లో కేంద్రమే స్వయంగా పార్లమెంట్ సాక్షిగా ఒక్క ఫ్లోరైడ్ కేసు నమోదు కాలేదని ప్రకటించింది. ఇక ఇదే సమయంలో ఎన్నడూ సాగునీటి ప్రాజెక్టు ఊసు కూడా ఇక్కడ లేదు. కానీ సీఎం కేసీఅర్ డిండి ఎత్తిపోతల పథకంతో మునుగోడు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు నడుం బిగించారు. దీనికి 2016 లోనే మర్రిగూడ మండల పరిధిలోని చర్లగూడెం వద్ద భూమి పూజ చేశారు. ప్రస్తుతం నియోజకర్గ పరిధిలో చర్లగూడెం, కిష్టరాంపల్లి పేరుతో భారీ రిజర్వాయర్లు నిర్మాణంలో ఉన్నాయి. కాంగ్రెస్ నేతలు ఎన్నో ఆటంకాలు సృష్టిస్తున్నా ప్రభుత్వం పనులు కొనసాగిస్తున్నది. ఇవి పూర్తయితే ఇక్కడ శాశ్వత సాగునీటి వసతి ఏర్పాటు కానుంది. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు, కుంటలను పటిష్ట పరిచారు. సమృద్ధిగా వర్షాలతో భూగర్భ జలాలు ఎంతో మెరుగయ్యాయి. ఇక మరో వైపు పారిశ్రామిక రంగంలోనూ మల్కాపుర్ వద్ద ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ పార్క్ మార్క్‌గా నిలిచింది. ఎన్నో పరిశ్రమలు తరలివస్తున్నాయి. ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి.
మౌలిక వసతుల విషయంలోనూ అంతర్గత రహదారుల పరిస్థితి ఎంతో మెరుగైంది. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు వేసిన డబుల్ రోడ్లతో అన్ని వైపులా రవాణా సౌకర్యం అభివృద్ధి చెందింది. దీంతో పాటు ముఖ్యమైన రహదార్లను అభివృద్ధి చేశారు. తండాలకు సైతం రవాణా సౌకర్యం ఏర్పడింది. విద్యాపరంగానూ మండలాల వారీగా మోడల్ స్కూల్స్, కేజీబీవీలు, గురుకులాల సంఖ్య గణనీయంగా పెరిగింది. వైద్య విభాగాన్ని పటిష్ట పరిచారు. ఇలా అభివృద్ధిపథంలో దూసుకుపోతున్న తరుణంలో 2018లో జరిగిన ఎన్నికల్లో స్థానిక పరిస్థితులతో పాటు ప్రజలకు భ్రమలు కల్పిస్తూ, తప్పుడు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక అక్కడి నుంచి నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోలేదు. తన వ్యాపార పనుల్లో బిజీ అయి మధ్య మధ్యలో వస్తూ అక్కడక్కడ సొంత డబ్బులు పంచుతూ హడావిడికి అలవాటు పడ్డారు. ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని ఏనాడూ ఆలోచించలేదు. అభివృద్ధి కోసం ప్రత్యేక ఎజెండా పెట్టుకుని పని చేసింది లేదు. ఫలానా కావాలని అడిగింది లేదు. కేవలం అప్పుడప్పుడు ఆర్థిక సాయాల పేరుతో హడావిడికి, మీడియా కార్యక్రమాలకు పరిమితమయ్యారు. ఇక చాలాసార్లు ప్రజల్లో తిరుగలేక, నియోజకవర్గానికి సమయం ఇవ్వలేక తన బిజీ షెడ్యూల్‌కు ఎమ్మెల్యే పదవి సెట్ కా దంటూ ఆయనే అనేకసార్లు తన అనుచరులతో అన్నట్లుగా చర్చ ఉన్నది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఎంపీగానే పోటీ చేస్తానని కూడా అంటుండేవాడని ఆయన అనుచరులు చెబుతుంటారు. పైగా ప్రభుత్వం వైపున ఏమైనా కార్యక్రమాలు చేపడితే ప్రొటోకాల్ లాంటి కుంటి సాకులతో వాటిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. రాజగోపాల్‌రెడ్డి తీరు నచ్చక పలువురు జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, సర్పంచులు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధిని కొనసాగించేందుకు చిత్తశుద్ధితో ప్రభుత్వం వ్యవహరిస్తూ వస్తున్నది. అభివృద్ధి, సంక్షేమ పథకాలు జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో కొనసాగుతున్నాయి. ఇక్కడ ఏ పని జరిగినా సీఎం కేసీఅర్ సారథ్యంలోని టీఆర్ఎస్ సర్కార్ హయాం లో జరిగినవి అంటే ఎవ్వరూ కాదనలేని పరిస్థితి.
వీటన్నింటినీ వదిలి నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంపై స్థానిక ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేవలం తమ సొంత ప్రయోజనాల కోసమే పార్టీ మార్పు అన్న చర్చ సర్వత్రా వినిపిస్తున్నది. ఓ వైపు ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ కేంద్ర సర్కార్ అస్తవ్యస్త విధానాలతో ప్రజలపై పెనుభారాలు మోపుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆస్తుల అమ్మకం, ధరల పెరుగుదల లాంటి చర్యలతో కేంద్రం ప్రజల నడ్డి విరుస్తున్నదని ఇప్పటికే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో బీజేపీలో రాజగోపాల్‌రెడ్డి చేరడమంటే తన స్వప్రయోజనాల కోసమేనని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దీనికి మునుగోడు అభివృద్ధిని ముడి పెట్టడం ఎంతమాత్రం సమంజసం కాదన్న చర్చ నియోజకవర్గం అంతటా జోరుగా సాగుతోంది. ఇన్నాళ్లు తనతో కలిసి నడిచిన కాంగ్రెస్ కార్యకర్తలు సైతం రాజగోపాల్‌రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.