యాదాద్రి, ఆగస్టు 2 : యాదాద్రి లక్ష్మీనరసింహుడి స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు సంప్రదాయ పూజలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం 3.30గంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవ, తిరువారాధనలు, ఆరగింపు చేపట్టారు. స్వామికి నిజాభిషేకం నిర్వహించిన అనంతరం తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేశారు. నిత్యపూజల్లో భాగంగా ప్రధానాలయంలోని వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, లక్ష్మీనరసింహుల నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా జరిపించారు. సాయం త్రం ప్రాకారంలో వెండి మొక్కు జోడు సేవోత్సవం, దర్బార్ సేవలు సంప్రదాయంగా నిర్వహించారు. అలంకార సేవోత్సవంలో పాల్గొన్న భక్తులకు అర్చకులు స్వామి, అమ్మవార్ల ఆశీస్సులు అందించారు.
కొండకింద దీక్షాపరుల మండపంలో సత్యనారాయణ వ్రతాల్లో భక్తులు పాల్గొని వ్రతం ఆచరించారు. పాతగుట్ట ఆలయంలో స్వామి, అమ్మవార్లకు నిత్యపూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామిని ఆరాధిస్తూ ఆకుపూజ చేపట్టారు. క్యూ కాంప్లెక్స్‌లోని ఆలయంలో క్షేత్రానికి పాలకుడైన హనుమంతుడిని సింధూరంతో అలంకరించి అభిషేకించి తమలపాకులతో అర్చించారు. వేదమంత్రాల మధ్య నిర్వహించిన పూజల్లో పలువురు భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. తమలపాకులతో అర్చించి లలితాపారాయణం చేశారు. ఆంజనేయస్వామికి ఇష్టమైన వడపప్పు, బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. నాగుల పంచమి సందర్భంగా కొండపైన పుట్టకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. నాగదేవతకు పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామిని 8వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వివిధ విభాగాలు కలుపుకొని స్వామి ఖజానాకు రూ.17,08,504 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
వైభవంగా కోటి కుంకుమార్చన
యాదాద్రిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చన’ కార్యక్రమం ఘనంగా కొనసాగుతున్నది. ప్రధానార్చకులు నల్లన్‌థీఘళ్ లక్ష్మీనారసింహాచార్యులు ఆధ్వర్యంలో 30మంది రుత్వికులు పాల్గొ ని అమ్మవారి సహస్రనామార్చన పఠించారు. కుంకుమార్చనలో పాల్గొన్న దంపతుల గోత్రనామాల పేరిట అర్చకులు సంకల్పం చేశారు. స్వామివారి శెల్లా, అమ్మవారి కునుముతో పాటు మహాప్రసాదాన్ని అర్చకులు భక్తులకు అందించారు.