నల్లగొండ ప్రతినిధి, జూలై 30(నమస్తే తెలంగాణ) : గత ఏడాది డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం ఈ యాసంగిలో కేవలం రా రైస్ మాత్రమే తీసుకుంటామంటూ మొదలుపెట్టిన కొర్రీలతో అప్పటి నుంచి ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉన్నాయి. కిందటి యాసంగి, వానకాలంతోపాటు ఇటీవల యాసంగి ధాన్యాన్ని సీఎంఆర్‌గా కేంద్రం రాష్ట్రం నుంచి సేకరించాల్సి ఉంది. కానీ, గత నెల 7 నుంచి సీఎంఆర్ సేకరణ నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. దాంతో పెద్ద ఎత్తున మిల్లుల్లో ధాన్యం పేరుకుపోవడంతోపాటు కొన్నిచోట్ల వర్షాలకు ధాన్యం తడిసి మొలకెత్తింది. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడికి చివరకు తలొగ్గిన కేంద్రం ఈ నెల 18 నుంచి తిరిగి సీఎంఆర్ సేకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆగస్టు 31 వరకు గత యాసంగి, వానకాలానికి సంబంధించిన మొత్తం సీఎంఆర్‌ను అప్పజెప్పాలని కండిషన్ పెట్టింది. దాంతో ఆయా జిల్లాల అదనపు కలెక్టర్ల నేతృత్వంలో సివిల్ సప్లయ్ అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టక తప్పడం లేదు. నల్లగొండ జిల్లాలో 2020-21 యాసంగికి సంబంధించి ఇంకా 11,782 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని బాయిల్డ్ బియ్యంగా మార్చి ఇవ్వాల్సి ఉంది.
మొత్తం 5.78లక్షల మెట్రిక్ టన్నుల బియ్యానికి 5.66 లక్షలు పూర్తి చేశారు. ఇక యాదాద్రి జిల్లాలో 2.86 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్‌కు 2.83 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించారు. మరో 2,969 మెట్రిక్ టన్నులను ఇవ్వాల్సి ఉంది. దాన్ని పూర్తి చేయడం సులభమే. అయితే గత వానకాలందే ఇప్పుడు అతి పెద్ద టాస్క్‌గా మారింది. 2021-22 వానకాలానికి సంబంధించి పెద్ద మొత్తంలో సీఎంఆర్ ఇవ్వాల్సి ఉంది. అది కూడా కేవలం రా రైస్‌గా మాత్రమే ఇవ్వడంతోపాటు పోర్టిఫైడ్ రైస్‌గా కూడా మార్చి ఇవ్వాలని నిబంధనలు విధించారు. ఇది క్షేత్రస్థాయిలో అంత సులభంగా కనిపించడం లేదు. నల్లగొండలో పరిశీలిస్తే గత వానకాలంలో 3.03 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యానికి 65 శాతం లక్ష్యంతో 1.98 లక్షలు మాత్రమే ఇప్పటివరకు ఇవ్వగలిగారు. ఇంకా 1.05 లక్షల మెట్రిక్ టన్నులు బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పజెప్పాల్సి ఉంది. యాదాద్రి జిల్లాలో మొత్తం 1.77లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్‌కు 71921 మెట్రిక్ టన్నులనే ఇప్పటివరకు ఇవ్వగలిగారు. మిగతా 1.05 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇవ్వాలి. సూర్యాపేట జిల్లాలో 2.42 లక్షల మెట్రిక్ టన్నులకు 1.02 లక్షలే ఇచ్చారు. మరో 1.41 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఆగస్టు 31వరకు ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంది. సరిగ్గా నెల రోజుల్లోపు దీన్ని పూర్తి చేయాల్సిందేనని కేంద్రం హుకూం జారీ చేసింది. అప్పటివరకు ఇచ్చిందే తమ లెక్కలోకి వస్తుందని స్పష్టం చేసింది.
40 రోజుల నిలిపివేతతో అవరోధాలు. మిల్లుల్లో రుకుపోయిన ధాన్యం..
గత నెల 7 నుంచి సీఎంఆర్ సేకరణను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి 40 రోజులపాటు ఒక్క గింజా సేకరించకపోవడంతో మిల్లుల్లో ధాన్యం ఎక్కడికక్కడే పేరుకుపోయింది. అయితే ప్రస్తుతం సీఎంఆర్ సేకరణను ప్రారంభించినా అనేక అవరోధాలు ఎదురవుతున్నాయి. అనేక మిల్లుల్లో రెండు, మూడు సీజన్లకు సంబంధించిన ధాన్యాన్ని ఆరుబయటే పట్టాలు కప్పి నిల్వ చేశారు. ఇటీవల భారీ వర్షాలతో కొన్నిచోట్ల ధాన్యం తడిసి మొలకలు కూడా వచ్చాయి. దాంతో మిల్లింగ్ ప్రక్రియలో 100 కిలోల ధాన్యానికి 67కిలోల బియ్యం రావాల్సి ఉంటే తక్కువగా రావడం, రంగు మారడం జరిగాయి. నాణ్యతలోనూ సూక్ష్మస్థాయి లోపాలు సహజంగా వస్తుంటాయి. కానీ, వాటిని ఎఫ్‌సీఐ పరిగణలోకి తీసుకోవడం లేదు. బియ్యం సేకరణ విషయంలో నాణ్యతతోపాటు పరిమాణంలోనూ ఎఫ్‌సీఐ కచ్చితంగా వ్యవహరిస్తుండడంతో నిర్ణీత ప్రమాణాలతో సీఎంఆర్‌ను అప్పజెప్పడం కత్త్తిసాములా మారింది. ఈ విషయంలో రైస్ మిల్లర్లను సమన్వయం చేసుకుంటూ జిల్లా పౌరసరఫరాల అధికారులు ముందుకు సాగాల్సి వస్తుంది. క్షేత్రస్థాయిలో ఒక్కో రైస్‌మిల్లును సందర్శిస్తూ పరిస్థితులను గమనిస్తూ లక్ష్యాన్ని చేరుకునేలా చర్యలు చేపట్టారు. వాస్తవంగా 40 రోజులపాటు సీఎంఆర్‌ను నిలిపివేయకపోతే గత యాసంగితోపాటు వానకాలం సీఎంఆర్ దాదాపు దగ్గర పడేది. అధికారుల అంచనా ప్రకారం ఉమ్మడి జిల్లాలో నిత్యం 5వేల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ అప్పజెప్పినా కనీసం రెండు లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ఇప్పటికే పూర్తయ్యేది.
క్షేత్రస్థాయిలో పర్యటనలు
వీటన్నింటి నేపథ్యంలో సాధ్యమైనంత వేగంగా సీఎంఆర్‌ను పూర్తి చేసేందుకు పౌరసరఫరా విభాగం అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలతో ఉరుకులు పరుగులు పెడుతున్నారు. రైస్‌మిల్లులను తనిఖీలు చేస్తూ తగు సూచనలు చేస్తున్నారు. రోజువారీగా రైస్‌మిల్లర్లను సమన్యయం చేసుకుంటూ గడువు లోపు పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నారు. శనివారం అసిస్టెంట్ సివిల్ సప్లయ్ అధికారి నిత్యానందంతో కలిసి నల్లగొండ జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు పలు రైస్ మిల్లుల్లో మిల్లింగ్ ప్రక్రియను పరిశీలించారు. చిన్న చిన్న ఆటంకాలు ఉన్నా వాటిని అధిగమిస్తూ సీఎంఆర్ పూర్తి చేయాలని ఆదేశించారు. కిందటి యాసంగి, వానకాలం సీజన్లకు సంబంధించిన సీఎంఆర్‌ను అప్పజెప్పేందుకు ఆగస్టు 31వరకు గడువు విధించారని ఈ సందర్భంగా డీఎస్ఓ వెంకటేశ్వర్లు ‘నమస్తే తెలంగాణ’తో చెప్పారు. గడువు లోగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రైస్‌మిల్లర్లను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని, ఇటీవలి యాసంగికి సంబంధించి కూడా మిల్లింగ్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
తాజా సీజన్లోనూ జాప్యం
ఇక ఇటీవల కొనుగోలు చేసిన యాసంగి ధాన్యం నుంచి నేటికీ సీఎంఆర్ సేకరణ మొదలుకాలేదు. తమకు ఇంకా ఉత్తర్వులు రాలేదంటూ ఎఫ్‌సీఐ అధికారులు చెబుతుండడం గమనార్హం. గతంలో అయితే వాస్తవంగా ఈ పాటికే కొంతమేర పూర్తయ్యేది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 210 రైస్‌మిల్లులు సీఎంఆర్ ప్రక్రియలో పాలుపంచుకుంటాయి. అయితే ఒక్క నల్లగొండ జిల్లాలో గత సీజన్లకు సంబంధించి పరిశీలిస్తే 2020-21 యాసంగి సీఎంఆర్ కేవలం 5 మిల్లుల నుంచే రావాల్సి ఉంది. 2021-22 వానకాలంలో 60 మిల్లల నుంచి సీఎంఆర్ రావాల్సి ఉంది. ఇక్కడ మొత్తం 100 రైస్‌మిల్లులు ఉండగా, మరో 40 మిల్లులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవలి యాసంగి సీజన్ సీఎంఆర్ సేకరణ ఎఫ్‌సీఐ ప్రారంభిస్తే ఈ మిల్లుల ద్వారా నిత్యం కొంత పూర్తి చేసే అవకాశం ఉండేది. కానీ, నేటినీ సేకరణపై ఎఫ్‌సీఐ జాప్యం చేస్తుండడంతో ఈ మిల్లుల్లో మిల్లింగ్ కొనసాగడం లేదు. ఇదే పరిస్థితి సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లోనూ నెలకొంది. ఇకనైనా వేగవంతం చేయాలని జిల్లా రైస్‌మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారు.