నందికొండ, జూలై 30 : దశాబ్ధం తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్ట్(ఎన్ఎస్పీ) కింద ఆయకట్టుకు వానకాలం పంటకు జూలైలో సాగునీరు అందించడం ఇదే తొలిసారి. చురుగ్గా కదులుతున్న రుతుపవనాలతో భారీగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో క్రమంగా పెరుగుతుండడంతో రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఈ 28న ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశారు. గతేడాది ఇదే తేదీన ప్రాజెక్ట్ 540.5 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉండగా ఈ ఏడాది 550.9గా ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గత ఎనిమిదేండ్లలో ఎడమ కాల్వ కింద భూములకు నీటిని విడుదల చేయడం ఇది 15వ సారి. ప్రాజెక్ట్ 59 ఏండ్ల చరిత్రలో వరుసగా 15 సార్లు పంటలకు నీటిని విడుదల చేయడం ఇదే తొలిసారి. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్‌తో సహా నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మ జిల్లాలో మొత్తం 10 లక్షల 37 వేల 796 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నీటిని పొదుపుగా వాడుతూ ఎడమకాల్వ ఆయకట్టుకు రెండు పంటలకు ప్రభుత్వం నీరును అందిస్తుంది. ఈ విధానంలో పంటలు తెగుళ్ల బారిన పడకుండా ఉండడమే కాకుండా ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాగర్ ఎడమకాల్వ ఏఎంఆర్, లో లెవెల్, హై లెవెల్, ప్రతి లిఫ్ట్ క్రింద ఉన్న పొలాలకు నీరు అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
నీటి సమాచారం :శ్రీశైలం, జూరాల నుంచి రోజూ 93,956 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రాల ద్వారా 31,786 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు వచ్చి చేరుతుంది. శ్రీశైలం నుంచి సాగర్‌కు నిలకడగా ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో నాగార్జునసాగర్ రిజర్వాయర్ నీటిమట్టం క్రమంగా పెరుగుతూ వస్తుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 (312 టీఎంసీలు) అడుగుకులకు గాను ప్రస్తుతం 554.50 (220.4776 టీఎంసీలు) అడుగుల మేరకు నీరు నిల్వ ఉంది. నీటి ప్రవాహం ఆశజనకంగా వచ్చి చేరుతుండడంతో వానకాలం పంటకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో ఎడమ కాల్వకు నీటి విడుదలను ప్రారంభించారు. కుడికాల్వ, ప్రధాన జల విద్యుత్ కేంద్రం, వరద కాల్వల ద్వారా నీటి విడుదల లేదు. ఎడమ కాల్వ ద్వారా 717 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 1,650 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి 2,367 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతుంది. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను 879.50 గా ఉంది.
కుడి కాల్వకు రేపు నీటి విడుదల :నాగార్జునసాగర్ డ్యాం కుడికాల్వకు సోమవారం నీటి విడుదల కానుంది. ఆ రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు ఉదయం 10 గంటలకు నీటి విడుదలను ప్రారంభించనున్నట్లు ఎన్ఎస్పీ అధికారులు తెలిపారు. కుడి కాల్వ ద్వారా ఆంధ్ర ప్రాంతానికి సాగు, తాగు నీరు అందనున్నది.